నేను ముసలిదాన్నయ్యాననీ, తనేమో ఇంకా ..
బయటికెళ్లి సంపాదించడం పెద్ద బాధ్యత.
అంతకన్నా పెద్ద బాధ్యత ఇంట్లో ఉండి కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకోవడం!
అందుకే గృహిణిని త్యాగమయి అంటారు.
భర్త, పిల్లల ఆరోగ్యం కోసం, ఆనందం కోసం తన ఇష్టాలను చంపుకుని మరీ ఇల్లాలు జీవితమంతా శ్రమిస్తుంది. భర్త ఆ శ్రమను గుర్తించకుండా...
ఇంకా ఏదో కావాలని కోరుకోవడం, నిందలు వేయడం అమానుషమే అవుతుంది.
ప్రశ్న - జవాబు
మా పెళ్లయ్యి పాతికేళ్లయింది. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా వారు బ్యాంక్‌మేనేజర్. ఇటీవలే వి.ఆర్.ఎస్ తీసుకున్నారు. నా సమస్యేమిటంటే, పెళ్లయినప్పటి నుంచి కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా పని చేశాను. నా సేవలను మా వారు ఏనాడూ గుర్తించక పోగా నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించేవారు కాదు. పిల్లల కోసమే నేను ఆయన పెట్టిన హింసల ను ఇన్నాళ్లూ ఓపిగ్గా భరించాను. అయితే కొంతకాలంగా ఆయన నేను ముసలిదాన్నయ్యాననీ, తనేమో ఇంకా ఫిట్‌గా ఉన్నాననీ, ఈ వయసులో కూడా అమ్మాయిలు తనంటే పడి చస్తున్నారనీ సూటిపోటి మాటలతో నన్ను తీవ్రమైన మానసిక వేదనకి గురి చేస్తున్నారు. నేనది సహించలేకపోతున్నాను. ఆయన ఉనికి కూడా భరించలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.
-అనసూయ, వరంగల్
ఈ వయసులో మీరు ఆయన మీద కేసు పెట్టమని కానీ, విడాకులివ్వమని కానీ నేను మీకు సలహా ఇవ్వలేను. కానీ మీకు ఒక చక్కటి పరిష్కారం సూచించగలను. అతని మానసిక వేధింపుల నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు పై కారణాలన్నీ వివరిస్తూ, ఫ్యామిలీ కోర్టులో జుడీషియల్ సెపరేషన్ కోరుతూ పిటిషన్ వేయండి. సెక్షన్ 10, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దీనిని విడాకులు లేకుండా విడిపోవడం అంటారు. కోర్టువారు విచారణ తర్వాత విడివిడిగా జీవించడానికి మీకు డిక్రీ ఇస్తారు. ఇందువల్ల మీ వివాహ బంధం రద్దు కాదు. ఆస్తి హక్కులకు ఏ ముప్పూ వాటిల్లదు. కేవలం శారీరక సంబంధాలు మాత్రం రద్దవుతాయి. ఇద్దరూ కలిసి జీవించే హక్కు తాత్కాలికంగా రద్దవుతుంది. ఈ సెక్షన్‌లోని అంతరార్థం ఏమిటంటే విడిపోయిన జంట పునరాలోచించుకుని లోటుపాట్లను సవరించుకుని మరలా కలిసి జీవించడానికి అవకాశం ఇవ్వడం. మీ భర్త తన ప్రవర్తనను మార్చుకుని, మిమ్మల్ని సక్రమంగా చూస్తానని మీకు నమ్మకం కలిగిస్తే, మీరు మరలా అతనితో ఉండొచ్చు.
నా పెళ్లయి ఐదేళ్లయింది. పిల్లల్లేరు. ఇటీవల నా భర్త ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. మా మతం మంచిది కాదనీ, మా నమ్మకాలకూ, ఆచారాలకూ, సంప్రదాయాలకూ అర్థం లేదనీ, తాను వేరొక మత సిద్ధాంతాన్ని ఇష్టపడుతున్నాననీ, దానినే నన్ను కూడా అనుసరించమని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. మాది సనాతన సంప్రదాయ కుటుంబం. హిందూ వివాహ చట్టం ప్రకారం మా పెళ్లయింది. నేను అతని కోసం నా నమ్మకాలనూ, సంప్రదాయాలనూ ఒదులుకోలేను. అలాగని అతని సిద్ధాంతాన్ని విమర్శించలేను. అతను మతం కూడా మారాడని నాకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. నాకు అతనితో కాపురం చేయడం ఇష్టం లేదు. తగిన సలహా ఇవ్వండి.
- అలేఖ్య, రాజమండ్రి
హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 ప్రకారం భార్యగానీ, భర్తగానీ, హైందవేతర మతానికి మారడం విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్‌గా పనికి వస్తుంది. నిజంగా మీరు మీ భర్త నుండి విడాకులు తీసుకోవాలని భావించినప్పుడు దానికి తగిన నిర్దిష్టమైన ఆధారాలు చూపుతూ కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ వేయవచ్చు. లేదంటే మీరిద్దరూ ఒక అంగీకారానికి వచ్చి మ్యూచువల్ కన్సెంట్ ప్రకారం డైవోర్స్ తీసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.
మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. మా పెళ్లికి మా పెద్దల అంగీకారం లేదు. మాకు ఒక బాబు. మా నాన్నగారు మంచి స్థితిమంతులు. ఆయనకు స్వంత ఇల్లు, పొలాలు ఉన్నాయి. నాకు ఇద్దరు అన్నయ్యలున్నారు. నాకు, మా పుట్టింటికీ రాకపోకలు లేవు. ఈ మధ్య మా నాన్నగారు హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలిసి, పుట్టింటికి వెళ్లి వచ్చాను. నాన్నగారి పెద్ద కర్మ తర్వాత నుంచి నాకు, మా నాన్నగారి ఆస్తికి ఏ సంబంధం లేదని సంతకాలు చేయమంటూ మా అమ్మ, అన్నయ్యలు నాపై ఒత్తిడి తెస్తున్నారు. మా నాన్నగారు వీలునామా రాయకుండా చనిపోయారని తెలిసింది. ఆస్తిలో నాకు వాటా రాదా? ఇష్టంలేని పెళ్లి ఆస్తి పంపకాలకి అడ్డంకి అవుతుందా?
- వైదేహి, గుంటూరు
ఇష్టం లేని వివాహానికీ, మీ ఆస్తి హక్కుకూ ఎలాంటి సంబంధం లేదు. హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఒక హిందువు వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తికి తల్లి, భార్య, కూతురు, కొడుకు, వితంతవులైన కోడళ్లు ప్రథమశ్రేణి వారసులవుతారు. కనుక మీ నాన్నగారి ఆస్తిలో మీకూ మీ తల్లి, అన్నయ్యలతోపాటు సమానమైన హక్కు ఉంటుంది. సమానమైన వాటా వస్తుంది. హిందూ వారసత్వ చట్టానికి 1985లో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సవరణ తీసుకు వచ్చింది.
దాని ప్రకారం కూతురుకి హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తండ్రి, సోదరులతో సమానంగా జన్మతః హక్కులుంటాయి. ఇది సెప్టెంబర్ 5, 1985 నుండి అమలులోకి వచ్చింది. అంతకు ముందు వివాహమైన కుమార్తెలను చట్టం మినహాయించింది. ఈ చట్టాన్ని అధ్యయనం చేసి, దేశమంతటా ఒకేరకమైన వారసత్వపు హక్కులు కల్పించేలా 2005వ సంవత్సరంలో పార్లమెంట్ దీనికి సవరణ చట్టం చేసింది. అదేమిటంటే వివాహంతో నిమిత్తం లేకుండా కొడుకుగా పుట్టి ఉంటే ఏ హక్కులు వస్తాయో, కూతుళ్లకూ ఆ హక్కులు సంక్రమిస్తాయి.
అయితే 2014, డిసెంబర్ 20 నాటికి ఆస్తి విభజన, బదిలీ, విల్లు ద్వారా సంక్రమించడం జరిగి ఉంటే మాత్రం ఆస్తిలో హక్కును పొందే అవకాశం లేదు. మీ వివాహం 1990లో జరిగింది. అంతేకాకుండా మీ తండ్రి 2015లో మరణించారు. వీలునామా రాయలేదు. విభజన జరగలేదు అంటున్నారు కాబట్టి, మీకు ఆస్తిలో హక్కు సంక్రమిస్తుంది. మీరు కేసు వేసి, కోర్టు ద్వారా మీకు రావలసిన ఆస్తిని రాబట్టుకోవచ్చు.
కేస్ స్టడీ
దారి తెలుసుకుంది నరకాన్ని దాటింది
మంగ, వెంకటయ్యల పెళ్లయ్యి ఐదేళ్లయింది. వెంకటయ్య కారు డ్రైవర్. మంగ నాలుగిళ్లలో పని చేసుకుంటూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఇద్దరు పిల్లలు. మంగ చాలా అందంగా ఉంటుంది. భర్తకన్నా ఎక్కువ చదువుకుంది. కలుపుగోలు స్వభావం కావడం వల్ల అందరితో చక్కగా మాట్లాడేది. అది చూసి ఓర్చుకోలేకపోయాడు వెంకటయ్య. దాంతో రోజూ తాగొచ్చి మంగను చితకబాదేవాడు. లేనిపోని సంబంధాలు అంటగట్టి వేధించేవాడు. చాలా కాలం ఓపిక పట్టింది మంగ.
ఇక భరించడం తనవల్ల కాదనుకుంది. అతని నుంచి విడిపోతేనైనా ప్రశాంతంగా తన దారిన తను జీవించవచ్చున నుకుంది. అయితే ఆమెకు కోర్టు ఖర్చులు కానీ, లాయర్ ఫీజులు కానీ భరించే శక్తి లేదు. దాంతో తెలిసిన వాళ్లని ఆశ్రయించింది. వాళ్లు ఆమెకు దారి చూపారు. ‘జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అని ఉంటుంది. అందులో పిల్లలకు, స్త్రీలకు, షెడ్యూల్డ్ కులాల వారికీ, శారీరక వికలాంగులకూ, యాచకులకూ, పారిశ్రామిక కార్మికులకు, నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుంది. కోర్టు ఫీజులు కూడా కట్టనక్కరలేదు’ అని చెప్పారు. మంగ వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారిని కలిసింది.
అక్కడి వారు ఆమె చెప్పిన దంతా విని, ఆమెకు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేశారు. ఆ న్యాయవాది సాయంతో మంగ అతి కొద్దికాలంలోనే తన భర్త నుంచి విడాకులు తీసుకుని, పిల్లలను తీసుకుని, వేరు కాపురం పెట్టి, ప్రశాంతంగా జీవిస్తోంది. ఇటువంటి న్యాయసే వాధికార సంస్థ ప్రతి జిల్లాలోనూ ఉంటుంది. అవస రమైన వారు తమ జిల్లాకు సంబంధించిన న్యాయ సేవా సంస్థను సంప్రదించి, తగిన సాయం పొందవచ్చు.
వి.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్