గాలివానకు ముందు తర్వాత.... | Prior to the storm | Sakshi
Sakshi News home page

గాలివానకు ముందు తర్వాత....

Published Sat, Apr 11 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

గాలివానకు ముందు తర్వాత....

గాలివానకు ముందు తర్వాత....

  కథలు పుట్టించే కథలు

తెలుగు కథకు ఖ్యాతి తెచ్చి పెట్టిందని భావిస్తున్న     ‘గాలివాన’కు మాతృక వంటి కథలు ఇంతకు ముందు ఉన్నాయి. వాటి ప్రభావం గాలివాన మీద ఉంది. అంత మాత్రం చేత గాలివాన ఘనతకు వచ్చిన లోటేమీ లేదు. పట్టాల మీద రైలు వెళుతున్నప్పుడు మనింట్లో కిటికీ ఊగినట్టు ఒక మంచి కథ చదివినప్పుడు కలిగే అనునాదంతో గొప్పగొప్ప కథలు రాసినవాళ్లు చాలామంది ఉన్నారు. నిజానికి మూలకథ కంటే మెరుగైన కథలు రాసినవాళ్లు ఉన్నారు.
 
 గాలివాన! దీనికి మొదట బీజం వేసినవాడు గుస్తావ్ ఫ్లోబేర్. ‘మదాం బావరి’ ఫేమ్. ఆయన కూడా సొంతంగా రాయలేదు. అసలు అంత ఉన్నతమైన మానవ ఘటనను ఎవరూ ఊహించలేరు. ఎవరి జీవితంలో అయినా జరిగితే ఆ నోటా ఈ నోటా విని కథనం చేయడం తప్ప.

ఇంతకూ ఆ కథ ఏమిటి?

ఒకడు హంతకుడు. ఆ తర్వాత మారాలనుకుంటాడు. మంచి పనులు చేసి ‘సెయింట్’ కావాలనుకుంటాడు. కాని మంచి పని అంటే ఏమిటి? ఆచి తూచి చేసేది మంచి పనా? అప్రయత్నంగా చేయగలగాలి. అప్పుడే అది దైవానికి దగ్గరగా ఉంటుంది. అలాంటి పని ఇతడు ఏమి చేశాడు గనుక. ఇలాంటి సమయంలోనే భయంకరమైన శీతాకాలం వచ్చింది. మంచు- పేనినతాళ్ల వలే కురుస్తోంది. ఉష్ణం కావాలి ప్రతిఒక్కరికి ఉష్ణం. అది లేకపోతే చచ్చిపోతారు. అలాంటి శీతలంలోనే దారిన సెయింట్ పోతుంటే ఒక దిమ్మరి తారసపడ్డాడు. గోడ దగ్గర పడి ఉండి, ముణగ దీసుకొని, చలి... చలి అని వణుకుతున్నాడు. కాపాడండి... కాపాడండి.. రోదిస్తున్నాడు. సెయింట్ చూశాడు. క్షణం కూడా ఆలోచించలేదు. కోటు విప్పి ఇచ్చాడు. చాల్లేదు. ఇంకేదో బట్ట తెచ్చి కప్పాడు. సరిపోలేదు. దిమ్మరి పెనుబాధతో అరుస్తున్నాడు. ‘దేవుడా... నా ఎముకల్లో చలి దూరిపోయింది... కాపాడు తండ్రీ’... సెయింట్ మరేమీ ఆలోచించలేదు. తన బట్టలన్నీ విప్పి నగ్నంగా మారి ఆ దిమ్మరిని కావలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే తన శరీరంలోని ఉష్ణమంతా అతడిలోకి ప్రవహించాలి. కాని అప్పుడు తెలిసింది. అతడు దిమ్మరి కాదు. కుష్టువాడు. దేహమంతా కృశించి... వ్రణాలతో స్రవించి... సెయింట్ ఆగలేదు. మరింత  కౌగలించుకున్నాడు. తన పాపాలకు ఇదే నిష్కృతి ఏమో అన్నట్టుగా మరింత గట్టిగా కావలించుకున్నాడు. దైవం ఎలాగైతే కావలించుకుంటుందో అలా కావలించుకున్నాడు.

 వాస్తవంలో జరిగిన ఈ ఘటనను..... ఖీజ్ఛి ఔ్ఛజ్ఛఛీ ౌజ ్చజ్టీ ఒఠజ్చీ ఖీజ్ఛి ఏౌటఞజ్ట్చ్చీట పేరుతో ఫ్లోబేర్ రాశాడు. అచ్చయ్యింది. లక్షల మంది చదివారు. కాని ఒకడు జవాబు పలికాడు. ఫ్లోబేర్‌తో సమానంగా కంపించాడు.

 గోర్కి!

ఈ కథకు అతడి ప్రతిస్పందనే ‘మరపురాని రాత్రి’ కథ .  ఏమిటా కథ?

దివాలా తీసిన ఒక నగరంలో ఒక దిక్కుమాలిన చలికాలం. రాత్రి... పైగా వానా... ఆకలితో నకనకలాడుతున్న కుర్రాడొకడు ఒక బిచ్చెగత్తెకు తారసపడ్డాడు. ఇద్దరి దగ్గరా కాణీ లేదు. రాత్రి గడిపే దారీ లేదు. బిచ్చగత్తె  దొంగ. ఆమె అతడితో కలిసి ఒక బంకును పెళ్లగిస్తుంది. కొంచెం రొట్టె ముక్కలాంటిది దొరుకుతుంది. రాత్రి మరింత చిక్కబడుతుంది. చలి- దాపున ఉన్న పులిలా గాండ్రిస్తూ ఉంటుంది. ఇద్దరూ సముద్రం ఒడ్డున బోర్లించిన పడవలోకి చేరారు. ఏమిటిది? ఈ రాత్రి.. ఈ బీభత్సం.. ఈ నైరాశ్యం... కుర్రవాడికి లోకం కొట్టే దెబ్బలు ఇంకా  తెలియలేదు. ఇప్పుడిప్పుడే తెలిసి వణుకుతున్నాడు. చలికి కూడా. అయితే ఇలాంటి ప్రతి సందర్భాన్ని ఒక మనిషి సాటిమనిషి సాయంతో దాటిపోయాడు. ఆ కుర్రవాడికి కూడా ఈ క్షణంలో ఒక భరోసా కావాలి. బిచ్చగత్తె అది గమనించింది. మెల్లగా అతడిని దగ్గరకు తీసుకుంది. కావలించుకుంది. వెచ్చదనం. చలి నుంచి- వర్షపు చినుకుల నుంచి- ఆకలి నుంచి- సకల భవిష్యత్ భయాల నుంచి కాసింత వెచ్చదనం. అంతే.

 పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ వెనుక ఈ నేపథ్యమంతా ఉంది. ముఖ్యంగా ‘మరపురాని రాత్రి’కీ ‘గాలివాన’కూ దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మరపురాని రాత్రిలో కుర్రవాడికి వ్యవస్థ మీద నమ్మకం కూలిపోయింది. గాలివానలో రావుగారికి తన కల్పిత తాత్త్విక విశ్వాసాల మీద ఉన్న భేషజం కూలిపోయింది. రెండు కథల్లోనూ అట్టడుగున మిగిలేది ఉన్నత మానవ స్పందనలే. గోర్కి కుష్టువాడికి బదులు బిచ్చగత్తెను తీసుకున్నాడు. పద్మరాజుగారు అదే బిచ్చగత్తెకు విరాట్ రూపం ఇచ్చి తీర్చి దిద్దారు. ఇరువురి కథల్లోనూ ఆమె దొంగే. అయితే మన నేపథ్యానికి చలి కుదర్దు. మనది అంత చలి ఉండే ప్రాంతమూ లేదు. కనుక గాలివాన అవసరమైంది. వానకు తడిస్తే, తడిసి ముద్దయితే మరి చలి తప్పదు. రాయడమే కష్టం అనుకుంటే దాని కంటే బాగా రాయాలనుకోవడం ఎంత కష్టం. మూలం కంటే గోర్కి, గోర్కి కంటే  పద్మరాజు ఆ కథకు అమరత్వం తీసుకువచ్చారు. అవి వారి సొంత కథలే. మూలం ఒక మిష.
 అయితే ఇది ఇంతటితో ఆగలేదు. ఇదే కథ మన భారతీయాంగ్ల సాహిత్యంలో ఇంకోలా అనునాదం చెందింది. 

ఏమిటా కథ?

ఢిల్లీ. గడ్డ కట్టే చలికాలం. భయంకరమైన శీతగాలులు. అలాంటి సమయంలో బాగా స్థితిమంతుడైన కుర్రాడొకడు తండ్రితో మాట పొసగక మీరట్‌లోని తన ఇంటి నుంచి బయటపడి ఢిల్లీ చేరుకున్నాడు. సాయంత్రమైంది. వాళ్లింటికీ వీళ్లింటికీ వెళ్లాడు. కాని ఆదుకుంటారన్న నమ్మకముంచిన ప్రతి ఒక్కరూ ముంచారు. తండ్రి సంపదను వదిలి వచ్చిన పనికిమాలినవాడితో పనేంటి? రాత్రయ్యింది. ఒకవైపు చలి. మరోవైపు ఆకలి. ఇంకోవైపు జ్వరం. నిలువ నీడలేదు. చలి పెరిగింది. ఎముకల్లో దూరిపోతోంది. ఒళ్లు ఎగిరెగిరి పడుతోంది. చచ్చిపోతాడా ఏం? కాని- ఇంతలో- మినుకుమినుకుమంటూ సూది మొనంత వెలుగు కనిపించింది. బీడీ రవ్వ. ఒక బిచ్చగత్తె. ఇతణ్ణి చూసింది. ఎవరతడు? బంధువు కాదు. పెనిమిటి కాదు. తోబుట్టువూ కాదు. సాటి మనిషి! చలికి ఒణుకుతున్నాడు. చచ్చిపోయేలా ఉన్నాడు. బిచ్చగత్తె ఆలోచించలేదు. తల్లిలాగా కదిలింది. రండి బాబూ రండి... దగ్గర కూచోబెట్టుకుంది. ఒణికిపోతున్నాడు. అయ్యో... దగ్గరకు తీసుకొంది. గట్టిగా కౌగలించుకుంది. ఇంకా గట్టిగా. ఆ క్షణంలో అక్కడ ఒక మనిషి నుంచి మరో మనిషిలోకి ప్రవహిస్తున్నది వేడి కాదు. నమ్మకం. మనుషుల మీద నమ్మకం.

అతడిలో నాగరీకులందరూ పోగొట్టిన ఆ నమ్మకాన్ని ఒక ఛీకొట్టాల్సిన మనిషి- దిక్కుమాలిన మనిషి- బిచ్చగత్తె- ఆ శీతవేళ నిలబెట్టింది. దీనిని కె.ఎ.అబ్బాస్ రాశాడు. శ్రీ 420 రైటర్. ‘బ్లిట్జ్’  జర్నలిస్ట్. అబ్బాస్ బతికినంత కాలం ముంబైలో ఉన్నాడు. కాని ముంబైలో ఇంత చలి ఉండదు. అందుకే కథను ఢిల్లీకి మార్చాడు. అయినా సరే కథ శవాన్ని పరుండబెట్టే ఐస్‌లా ఉండదు. కొండ చరియను సహజంగా పెనవేసే హిమధారలా ఉంటుంది. అబ్బాస్ చాలా కథలు రాశాడు. ఇది మణిమకుటం.

ఎవరూ దీనిని తప్పించుకోలేరు. మహామహులైనా సరే తప్పించుకోవాల్సిన అవసరమూ లేదు. ఓ.హెన్రీ- గిఫ్ట్ ఆఫ్ మేగీ స్పర్శ చా.సో- వాయులీనంలో కనిపించలేదా?  హెమింగ్వే- ‘ఓల్డ్ మేన్ అండ్ సీ’ కేశవరెడ్డి- అతడు అడవిని జయించాడుగా రూపాంతరం చెందలేదా? మనందరం ఆరాధించే త్రిపుర- జేమ్స్ థర్బర్ రాసిన ‘ది సీక్రెట్ ఆఫ్ వాల్టర్ మిట్టీ’ కథను ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’ పేరుతో సృజించలేదా? నిన్న మొన్న- ప్రేమ్‌చంద్ ‘షత్రంజ్ కే ఖిలాడీ’ కథ స్ట్రక్చర్‌లో వాడ్రేవు చినవీరభద్రుడు ‘పాఠాంతరం’ అనే మంచి కథను రాయలేదా? కంపనం తాకేంత వరకే జడత్వం.  తాకిన వెంటనే కథ.
 ప్లాస్టిక్ బిడ్డకు నొప్పులక్కర్లేదు.

 కాని  ప్రాణమున్న బిడ్డకు అంత కష్టమూ పడాల్సిందే.
 ప్రభావాల చేత అయినా సరే అలాంటి ప్రాణమున్న కథలు రాసిన వారికి వందనాలు. వేయి లైకులు.
 - ఖదీర్.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement