రంది: వెలుగు తెప్పించే తెలంగాణ కథలు...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ నుంచి స్వతంత్రంగా వెలువడిన తొలి కథా సంకలనం రంది
కొన్ని కథలు చదివితే కొన్నిసార్లు వెలుగు వస్తుంది. చీకటిలో ఉన్న కొందరిలో వెలుగు వస్తుంది. వెలుగనేదే చూడని వారిలో వెలుగు వస్తుంది. తెలుగు కథలో తెలంగాణ కథను చాలాకాలం చీకటిలో ఉంచారు. ఆ మాటకొస్తే తెలుగు కథలో మంచి కథకులైన చాలామందిని చాలాకాలంగా చీకటిలోనే ఉంచుతూ వస్తూ ఉన్నారు. రెండు మూడు పేర్లను జపియించి జపియించి తెలుగు కథ అంటే ఈ రెండు మూడు బిందువుల మధ్య తిరుగాడే బంతిగా మలచిన సంగతి సత్యదూరం కాదు. వేలెత్తి చూపకుండా వదలాల్సిన విషయం ఎంత మాత్రమూ కాదు. పూసపాటి కృష్ణంరాజు, భూషణం, అల్లం శేషగిరిరావు, బలివాడ కాంతారావు, రామకోటి వీళ్లను ఎన్నడైనా గానం చేసి ఎరిగామా? కె.ఎన్.వై.పతంజలికి సన్మానాలు జరిపి సంతోషించామా? అద్భుతమైన కథలు రాసిన ఆర్.వసుంధరాదేవి, కల్యాణ సుందరీ జగన్నాథ్‌లకు ఏ పట్టువస్త్రాలు కప్పాము గనక? విశాలాంధ్ర కథ పేరుతో వెలువరించిన బృహత్ కథా సంకలనంలో అత్యుత్తమ తెలుగు కథకుడు సి.రామచంద్రరావుకు చోటు దక్కలేదంటే ఈ చీకటి నిర్మాణం చేసిందెవరు? తెలుగు కథకులు వేరు, ప్రాంతీయ కథకులు వేరు అనే తెలివైన విభజన చేసి ‘మరి రాయలసీమకు వస్తే మధురాంతకం రాజారాం’... అంటూ ఆ గొప్ప రచయితను ఉపశ్రేణిలో ఉంచలేదా? మరో గొప్ప కథకుడు మహేంద్ర మీద ఒక్క వ్యాసమైనా తటస్థించిందా? శారద ఆకలిచావుకు ఎవరు ఏడ్చారని?
ఈ పరిస్థితి తెలంగాణకు వచ్చేసరికి ఇంకా అన్యాయంగా మారింది.
కనీసం వట్టికోట ఆళ్వారుస్వామి పేరు వినడానికి కూడా సీమాంధ్ర పాఠకులు చాలాకాలం నోచుకోలేదు. నెల్లూరు కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, ఇల్లిందల సరస్వతీదేవి, పి.యశోదారెడ్డి, గూడూరి సీతారాం... వీళ్ల పేర్లు తలచినవారు సీమాంధ్రలో ఒక్కరు లేరు. ఉద్యమం మొగ్గతొడిగి 2000 సంవత్సరం నుంచి తెలంగాణ సాహితీకారులు పదే పదే చెప్తే తప్ప వీరున్నారు వీరూ ఉన్నారు అని తెలియరాలేదు. ఇక ‘ప్రజల మనిషి’, ‘చిల్లర దేవుళ్లు’, ‘మోదుగుపూలు’, ‘ప్రవాహంలో పూచిక పుల్లలు’ వంటి తెలంగాణ ప్రాంత నవలల ప్రస్తావన ఏమాత్రం జరిగిందని? ఇవన్నీ సహజంగానే అసంతృప్తికి కారణమయ్యాయి. ఉద్యమం వచ్చింది. విభజనా వచ్చింది. ఇక తెలంగాణ కథ స్వతంత్రమయ్యింది. అది ఎవరికీ సామంతం కాదు. ఎవరి మెహర్బానీలూ దానికి అక్కర్లేదు. వేరెవరో గుర్తిస్తే ఏంటి? గుర్తించకపోతే ఏంటి? అది తన పాటికి తాను ఎదుగుతుంది. తన ప్రజల దగ్గరికి వెళుతుంది. తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఈ మొత్తం నేపథ్యం ‘రంది’ కథా సంకలనానికి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ నుంచి స్వతంత్రంగా వెలువడిన తొలి కథా సంకలనం రంది. 2014లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలవారివి మంచి కథలు ఎంచి సంకలనంగా వెలువరించారు. మొత్తం 18 కథలు. ఈ అంకె చూస్తేనే సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర రోజుల్లో ఉత్తమ వార్షిక కథా సంకలనాల్లో తెలంగాణ కథల వాటా రెండు మూడు కథలకు మించేది కాదు. ఇప్పుడైనా అన్ని ప్రాంతాల తాకిడిలో ఈ సంఖ్య దాదాపుగా మించబోదు. కనుక తెలంగాణ కథను తెలంగాణ వారు ప్రచురించుకుంటేనే అందరు రచయితలకూ చోటు దొరుకుతుంది. కథ ముందుకు సాగుతుంది.
ఇందులోని కథలు దాదాపుగా నిమ్నవర్గాల జీవనాన్ని చూపుతున్నాయి. సంపాదకుల ఎంపిక ఉద్దేశం కూడా అదేగా కనిపిస్తుంది. దళిత, బహుజన, ముస్లిం వర్గాల నుంచి కొత్తగా రాస్తున్నవారినీ కొత్త జీవితాలను చూపుతున్నవారినీ ఎంచి సంకలన పరచడం మెచ్చుకోదగ్గ అంశం. పర్కపెల్లి యాదగిరి (ఉసురు), గాదె వెంకటేశ్ (బత్తెం), చెన్నూరి సుదర్శన్ (ఝాన్సీ హెచ్.ఎం), కవిత.కె (సంగీత), బూతం ముత్యాలు (బుగాడ), మన్నె ఏలియా (మర్రిచెట్టు), డా.కె.నాగేశ్వరాచారి (గద్వాల్జాతర) వంటి కథకులు, కథలు తెలుగు పాఠకలోకానికి ఈ సంకలనం ద్వారా చేరువకావడం- ఇదిగో వీరంతా గట్టిగా రాస్తున్నారు అని తెలియజేయడం చాలా మంచి సంగతి. డా.కాంచనపల్లి వంటి సీనియర్లు రాసిన ‘నాన్న.. ఒక వర్షం రోజు’ వంటి కథలు శిల్పం రీత్యా, వస్తువు రీత్యా తెలంగాణ కథ చేస్తున్న ప్రయోగాలకు తార్కాణం. ఈ సంకలనంలోనే గ్రామీణకళలు కాలక్రమంలో ఎలా అంతరించి పోతున్నాయో వివరిస్తూ డా.పసునూరి రవీందర్ రాసిన ‘పెంజీకటి’ అనే కథ ఉంది. చాలా స్థానికమైన వస్తువును, అట్టడుగు భాషనూ తీసుకుని కథ పేరు మాత్రం ‘పెంజీకటి’ అని పెట్టడం శిల్పదోషం. అంతకు సమానమైన తెలంగాణ పదం పెట్టి ఉంటే బాగుండేది.
ఈ సంకలనంలోని సీనియర్ కథకుల కథలు బలమైనవి. చివరి చూపు (కె.వి.నరేందర్), పరాయిగ్రహం (బెజ్జారపు రవీందర్), బిల్లి (షాజహానా), సాహిల్ వస్తాడు (అఫ్సర్), నల్లజెండా (జూపాక సుభద్ర), దారి తెలిసిన వేకువ (బెజ్జారపు వినోద్‌కుమార్), బిందెడు నీళ్లు (పెద్దింటి అశోక్‌కుమార్), బిడ్డ పురిటికొచ్చింది (హనీఫ్), అంటు (స్కైబాబ) తెలంగాణలోని విస్తృత శ్రేణుల విభిన్న పార్శ్వాలను పట్టి ఇస్తాయి. అయితే పెద్దింటి అశోక్‌కుమార్ ‘బిందెడు నీళ్లు’ కథ చదివితే ఆ నాటకీయతకు ఈ రచయిత నాటకాలు రాస్తే ఇంకా గొప్పగా ఉంటుంది కదా అనిపిస్తుంది. సంకలనంలో ప్రతి రచయిత పరిచయమూ ఇచ్చారు. కాని ఒక సూత్రం అంటూ పాటించకపోవడం వల్ల కొందరి గురించి చాలా విపులంగా కొందరి గురించి అతి క్లుప్తంగా ఉంది. కె.వి.నరేందర్, అఫ్సర్, బెజ్జారపు రవీందర్, వినోద్‌కుమార్‌ల పరిచయాలు మూడు ముక్కల్లో ముగించేంత చిన్నవైతే కాదు. అలాగే ప్రతి రచయితా ఉద్యమసమయంలో ఏమేమీ పోరాటాలు చేశారో వివరించారు. అంటే ఉద్యమంలో ఏ కారణం చేతనైనా పాల్గొనక నిశ్శబ్ద మద్దతు తెలిపినా లేదా ‘సాహిత్యం కొరకే సాహిత్యం’ అని ఊరుకున్నా ఈ సంకలనంలో చోటు ఉండదా అనే సందేహం వస్తోంది. ఏమైనా ముందే చెప్పినట్టు ఇవి చీకటిని ఛిద్రం చేసే కథలు. తెలుగుకథలో కొత్త వెలుతురు నింపే కథలు.
రంది- తెలంగాణ కత 2013
‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ప్రచురణ; సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ; వెల- రూ.60; ప్రతులకు: 9849220321