
నింద.. నేను.. భరత్
రాతల్ని ఏం చేయగలం? భరత్ రాతను మార్చగలిగామా?
ఆడుతూ పాడుతూ ఎదిగారు. కష్టసుఖాలలో కలిసి పెరిగారు.
రవితేజ పిల్లలు భరత్‌ని ‘నాన్నా’ అని పిలిచేవాళ్లు.
అమ్మకు భరత్ ముద్దుబిడ్డ. ఇంతమందికి ఇప్పుడు రవితేజ భరోసా కావాలి.
ఒక అన్న ఒక తమ్ముడి చోటును నింపాలి.
బాధ పెరికేస్తున్నా కళ్లల్లో కన్నీరు కనపడకూడదు.
దుఃఖం చిదిమేస్తున్నా చిరునవ్వులే కనపడాలి.
నిందలు నిప్పుల మీద నడిపించినా.. ఆ నిప్పులతోనే నిందల్ని కడిగేయాలి.
దానికి మీరే ‘సాక్షి’ అంటున్నారు రవితేజ.
మామూలుగా ఎప్పుడు ఇంటర్వ్యూకెళ్లినా రవితేజ చాలా హుషారుగా పలకరించేవారు. ఇప్పుడు మాత్రం ‘ఏంటండీ.. ఇలా వచ్చారు?’ అన్నారు.
♦ కాసేపు మీతో మాట్లాడాలని రవిగారూ..
ఇంటర్వ్యూనా? అబ్బే... మనసేం బాగాలేదండీ. ఇప్పుడు కష్టమే.
♦ మీ బాధ అర్థం కాక కాదు. తమ్ముణ్ణి పోగొట్టుకున్న బాధ ఒకవైపు.. ఆయన అంత్యక్రియలు దగ్గరుండి జరిపించలేదనే నింద ఓ వైపు.. అసలు తమ్ముణ్ణి చివరి చూపు ఎందుకు చూడలేదో చెప్పేస్తే మీ మీద పడిన నింద పోతుంది కదా..
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందండీ. చెప్పడానికి ఏముంటుంది? అవతలివాళ్లు ఏ పొజిషన్‌లో ఉన్నారో కూడా ఆలోచించకుండా ఎంత మాట పడితే అంత మాట అనేయడం, ఏది పడితే అది రాసేయడం.. మీరే చెప్పండి ఎంత బాధగా ఉంటుందో? నేనందర్నీ అనడంలేదు. మా బాధలో మేం ఉంటే, సోషల్ మీడియాలో కొంతమంది ‘హిట్స్’ కోసం ఇంత రాద్ధాంతం చేస్తారనుకోలేదు. ఆలోచించకుండా నిందించారు. ఆ నిందలకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేను.
♦ మీ తమ్ముళ్లను ఎంత బాగా చూసుకున్నారో ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అలాంటప్పుడు నిందలు మోయడం దేనికి అని?
మా పరిస్థితి అర్థం చేసుకుని అడిగారు కాబట్టి, చెబుతున్నాను. భరత్ యాక్సిడెంట్‌లో చనిపోయాడనే కబురు విని, ఇంటిల్లిపాదీ షాకయ్యాం. మా నాన్నగారి వయసు 85ఏళ్లు పైనే. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. ఈ వార్త విన్న తర్వాత అదోలా అయిపోయారు. కన్న కొడుకు చనిపోయాడని వింటే ఏ తల్లి మామూలుగా ఉంటుంది చెప్పండి. అమ్మ కుప్పకూలిపోయింది. నాన్న పరిస్థితి కొంచెం ఆందోళనగానే అనిపించింది. అమ్మను సముదాయించి, నాన్నను మామూలు స్థితికి తీసుకు రావడానికి ప్రయత్నించాం. ఈలోపు చిన్న తమ్ముడు రఘుని హాస్పిటల్‌కి వెళ్లి, మిగతా కార్యక్రమాలను చూడమన్నాం. భరత్ ముఖానికి బలమైన గాయాలు తగిలాయని తెలిసి, మేం వాణ్ణి అలా చూడకూడదనుకున్నాం. అందుకే వెళ్లలేదు. ఎంత బాధ ఉండి ఉంటుందో ఊహించండి. అమ్మానాన్న ఎప్పుడు మామూలు మనుషులవుతారో చెప్పలేను. మా ఇంటి పరిస్థితి అలా ఉంది.
♦ మీరు కూడా ఇంకా తేరుకున్నట్లు లేరు?
అవునండీ. మా బాధ రోజుల్లో తీరేది కాదు. కలిసి పెరిగాం. కష్టసుఖాలు పంచుకున్నాం. ఇవాళ మాలో ఒకడు లేడంటే తలుచుకోడానికే బాధగా ఉంది. ఏవండీ.. మనకు తెలిసినవాళ్ల ఇళ్లల్లో ఎవరైనా పోయారని తెలిస్తే ఎంత బాధపడతాం. అలాంటిది ఇంటి మనిషి పోతే ఇక ఆ బాధ మాటల్లో చెప్పలేం. మామూలుగా షూటింగ్ అయిపోగానే నేను ఫ్రెండ్స్‌తో కాసేపు కాలక్షేపం చేస్తుంటాను. ఇప్పుడు మీరు చూశారుగా, డైరెక్టర్ పేకప్ చెప్పగానే ఇంటికి వెళ్లడానికి ఎంత ఆరాటపడుతున్నానో? ఎందుకంటే మా అమ్మానాన్నలతో కలిసి ఉండటానికి. తమ్ముడు పోయినప్పట్నుంచి నాకు వేరే వ్యాపకం లేదు. ఇల్లు, షూటింగ్ అంతే. అమ్మానాన్నల ముందు మామూలుగా ఉండటానికి ప్రయ త్నిస్తూ్త, వాళ్లను మామూలు స్థితికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా.
♦ భరత్‌గారి అంత్యక్రియలు ఎవరితోనో చేయించారనీ, అవి చేసిన వ్యక్తికి రూ. 1,500 ఇచ్చారనీ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేసింది..
ఎంత దారుణమండీ. మా తమ్ముడి చివరి కార్యక్రమాలను అపరిచితులతో చేయించాల్సిన ఖర్మ మాకేంటండీ? నేను మా అమ్మానాన్నల దగ్గరుండిపోయా. రఘు చేత చేయించకూడదన్నారు. అందుకని మా బాబాయ్ (రవితేజ తల్లి సోదరి భర్త)తో అంత్యక్రియలు చేయించాం. ఆయనెవరో బయట జనానికి తెలియదు. కానీ, ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. భరత్‌ను అనాథలా పంపించామంటూ మమ్మల్ని అవమానించారు. మా గురించి సరే.. చనిపోయిన వ్యక్తి గురించి ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఆ వ్యక్తి గౌరవాన్ని కించపరిచేలా కామెంట్లు చేయకూడదు. ఇంత అమానుషంగా కూడా ఉంటారాండీ?
♦ స్వయంగా వెళ్లలేదు... టీవీల్లో భరత్‌గారి అంత్య క్రియలు చూశారా?
చెబితే నమ్మరేమో. సోషల్ మీడియాలో కానీ, టీవీలో కానీ భరత్ యాక్సిడెంట్ ఫొటోలను చూడలేదు. మేం చూడలేం. ఎందుకంటే భరత్ మా ఊహల్లో ‘హ్యాపీ’గా నిలిచిపోయాడు. తను మాకెప్పటికీ అలానే గుర్తుండిపోవాలనుకున్నాం. ప్రతి మనిషికీ ఏదో ఒక ఫోబియా ఉంటుంది. చనిపోయినవాళ్లను నేను చూడలేను. భయంగా ఉంటుంది. మీరు గమనిస్తే.. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్లినవాళ్లల్లో నేను కనిపించను. ఆ తర్వాత వెళ్లి, ఆ కుటుంబ సభ్యులను పలకరించేవాణ్ణి. శ్రీహరిగారు చనిపోయినప్పుడు గుండె దిటవు చేసుకుని, ధైర్యం కూడగట్టుకుని చూడ్డానికి వెళ్లాను. ఆయన ఇంటి దగ్గరకు కారు సమీపించగానే నాకదోలా అయిపోయింది. గుండెలో దడ మొదలైంది. చూడకుండానే వెనక్కి తిరిగి వచ్చేశాను. నాకున్న వీక్‌నెస్ అది. తెలిసినవాళ్లనే ఆ స్థితిలో చూడలేకపోతే.. ఇక సొంత తమ్ముణ్ణి ఎలా చూస్తాను? ఎంత సినిమా ఆర్టిస్టులైనా, సెలబ్రిటీలైనా మా ఎమోషన్స్ మాకుంటాయి. భయాలుంటాయి. అవేం తెలుసుకోకుండా నిందలు వేయడం బాధాకరం.
♦ మర్నాడు మీరు షూటింగ్‌కి వెళ్లిపోవడాన్ని చాలామంది విమర్శించారు?
సోషల్ మీడియాలో రకరకాలుగా రాశారని విన్నాను. లొకేషన్‌లో ఎంతమంది ఆర్టిస్టులున్నారో ఇవాళ (శుక్రవారం) చూశారుగా. ఆ రోజు (27.06.17) కూడా అంతకంటే ఎక్కువమందే ఉన్నారు. అంతమంది డేట్స్ సెట్ చేసుకుని, షూటింగ్ చేయడం అంటే ఈజీ కాదు. నా కారణంగా నిర్మాత నష్టపోవడం, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇబ్బందులపాలవ్వడం ఇష్టపడక షూటింగ్‌కి వెళ్లాను. సినిమా అనేది కోట్ల వ్యాపారం. ఒక్క రోజు తేడా వచ్చినా నష్టం ఎక్కువ ఉంటుంది. భరత్ ఎవరో పరాయివాడు కాదండి. నా సొంత తమ్ముడు. బాధ దిగమింగుకుని షూటింగ్‌కి వెళ్లానే తప్ప.. ఆనందంగా వెళ్లలేదు.
♦ భరత్‌గారు మీ అందరికీ దూరంగా ఉండేవారని, మాటలు కూడా లేవన్నది చాలామంది ఊహ..
ఇది కూడా తప్పే. చనిపోయే నాలుగురోజుల ముందు మా ఇంట్లో మేం బర్త్‌డే పార్టీ చేసుకున్నాం. ఆ రోజు భరత్ బర్త్‌డే. కేక్ కట్ చేయడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఆ రోజు మాత్రం ‘నేను కేక్ కట్ చేస్తా’ అని సందడి చేశాడు. చాలా హ్యాపీగా గడిపాం. నేనూ, మా అమ్మానాన్న ఆ భరత్‌ని గుర్తుపెట్టుకోవాలనుకున్నాం.
♦ భరత్‌గారితో మీ పిల్లలు ఎలా ఉండేవాళ్లు?
నా ఇద్దరు పిల్లలు నన్ను పిలిచినట్లే నా తమ్ముళ్లను నాన్నా అని పిలుస్తారు. భరత్ చనిపోయాడని తెలిసి, పిల్లలు బాగా ఏడ్చారు. వాళ్లిద్ద్దర్నీ ఓదార్చడం మావల్ల కాలేదు. వాళ్ల బాబాయ్ అంటే అంత ఇష్టం. అదేంటో కానీ, ఆ లారీ మావాడి కోసమే ఆక్కడ బ్రేక్‌డౌన్ అయిందేమో అనిపిస్తోంది. లేకపోతే ఇలా జరిగి ఉండేది కాదు.
♦ భరత్‌గారు కొంచెం ప్రాపర్‌గా లైఫ్‌ని ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదేమో కదా?
ఎన్నోసార్లు చెప్పాను. కానీ, అవన్నీ ఎందుకులెండి. మనిషే లేడు. ఎవరి లైఫ్ ఎలా రాసి పెట్టి ఉందో? వ్యక్తిగా చాలా మంచివాడు. ఏం చేస్తాం? ఒకటి మాత్రం చెబుతాను. మా ఇంట్లో బ్యాడ్ నేచర్ ఉన్నవాళ్లు ఎవరూ లేరు. ఒకరికి హాని చేసే మనస్తత్వం ఎవరికీ లేదు. అది మా అదృష్టం.
♦ చివరిగా మీ తమ్ముణ్ణి ఎప్పుడు కలిశారు?
భరత్ బర్త్‌డే రోజునే. ఆ రోజు మాట్లాడినదే.
♦ ఫైనల్లీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు?
నా సినిమాలతో నేనెప్పుడూ బిజీ. అమ్మతో ఎక్కువగా స్పెండ్ చేసేవాణ్ణి కాదు. భరత్ ఎక్కువగా అమ్మతో ఉండేవాడు. ఇప్పుడు తన ప్లేస్‌ని నేను తీసుకున్నాను. ఇంట్లో ఉన్నంతసేపూ అమ్మ దగ్గరే. కన్నబిడ్డ చనిపోతే ఏ తల్లైనా మామూలుగా ఉంటుందా? ఏదో అలా ఉన్నారు.
– డి.జి. భవాని
జరిగింది ఒకటి...రాసింది మరొకటి!