పురిటి మంటలు | special story to Nizamabad woman delivers healthy baby | Sakshi
Sakshi News home page

పురిటి మంటలు

Published Fri, Apr 21 2017 11:39 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగం - Sakshi

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగం

ఎక్కడైనా... పురిటి నొప్పులు ఉంటాయి!
మరి... ఈ ‘పురిటి మంటలు’ ఏంటి?!
సనా బేగం నిండు గర్భిణి.
ఈ క్షణమో మరుక్షణమో కాన్పు అన్నట్టుగా ఉంది.
అప్పుడొచ్చాడు భర్త... కాల యముడిలా!
కాదు కాదు... కట్న యుముడిలా వచ్చాడు.
భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు!
ఆ నిప్పుల్లోనే బిడ్డను కనింది సనా!
ప్రసవం స్త్రీకి పునర్జన్మ అంటారు.
సనా బేగంకి రెండు పునర్జన్మలు.
ఒకటి పురిటి నొప్పుల పునర్జన్మ!
ఇంకోటి పురిటి మంటల పునర్జన్మ!
సనా పురుడు పోసుకుంది... సరే...
న్యాయం ఎప్పుడు పురుడు పోసుకుంటుంది?
ప్రసవ వేదనను మించిన ‘వరకట్న వేదన’ నుంచి స్త్రీకి
విముక్తి ఎప్పుడు లభిస్తుంది?


శరీరం ఉడికిపోతోంది... ఒంటిమీది కాలిన గాయాల మంట నరకాన్ని చూపిస్తోంది. మూలుగుతోంది. భరించలేక కాదు... గర్భంలో ఉన్న బిడ్డను సురక్షితంగా ఈ భూమ్మీద పడేయడానికి. తన ఒంటికి అంటిన నిప్పు పసిప్రాణాన్ని నుసి చేయకముందే బయటకు వచ్చేయాలి. ఊడిన చర్మం... తేలిన మాంసం ఆ తల్లిని నిలువనీయడం లేదు. అయినా ఆమె ఆలోచన పుట్టబోయే తన బిడ్డ మీదే. వాడు ఆరోగ్యంగా పుట్టాలి... వాడికేం కావద్దు... అనుకుంటూనే అ..మ్మీ.... అంటూ అరిచింది. కేర్‌మంటూ పసిప్రాణం ఏడుపు. శరీరం మీద వేలగ్యాలన్ల నీళ్లు పడ్డట్టు చల్లబడిపోయింది ఆమె. మంట తగ్గిన అనుభూతి. చెవుల్లో పడిన ఆ కూన ఏడుపు మహత్తో ఏమో... ఆ తల్లి ప్రశాంత నిద్రలోకి జారుకుంది. కొంతసేపే. శరీరంలోని మంట ఆమెను నిద్రలేపింది. బతుకుతో పోరాడ్డానికి ఐసీయూలోకి చేర్చింది. ఎనిమిదినెలలకే పుట్టిన ఆ పిల్లాడూ ఇన్‌క్యూబేటర్‌లో ఉన్నాడు ఊపిరిని గట్టిచేసుకోవడానికి.

అసలు విషయమేంటి?
ఆ అమ్మ పేరు సనాబేగం. 23 ఏళ్లు. ఊరు... నిజామాబాద్‌. అక్కడి నిజాంకాలనీలో భర్త ముజీబ్‌తో కలిసి ఉంటోంది. అతను ఆటో డ్రైవర్‌. షేక్‌ రజాక్, ఆజ్‌గిరి బేగంల నాలుగో సంతానం సనాబేగం. ఆమెకు ఇద్దరన్నలు, ఒక అక్క. ఇంట్లో అందరికన్నా చిన్నది కావడంవల్ల అల్లారుముద్దుగా పెరిగింది. తల్లిదండ్రులకు, తోబుట్టువులకు సనా అంటే ప్రాణం. వీళ్ల సొంతూరు నిర్మల్‌ జిల్లా, తానూర్‌ మండలం, కోలూరు. కొద్దిపాటి వ్యవసాయ భూమి తప్ప ఇంకే ఆస్తులూ లేవు సనా తల్లిగారికి. అదే ఆ కుటుంబానికి ఆర్థిక ఆధారం. బంధువుల సంబంధమని.. కూతురు హాయిగా, భద్రంగా ఉంటుందని కిందటేడు (2016, ఏప్రిల్‌ 25) ముజీబ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. తన తాహతుకు మించే అయినా ఒకటిన్నర లక్షల కట్నం, 75 వేల రూపాయల విలువ చేసే టూవీలర్, ఐదు తులాల బంగారం, 30 తులాల వెండి, ఇంటి ఫర్నిచర్‌ ఇచ్చి కూతురిని అత్తారింటికి సాగనంపారు.

పెళ్లయిన మూడునెలల నుంచే...
సనా తల్లిదండ్రుల ఆశలు వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. పెళ్లయిన మూడునెలలకే అల్లుడు ముజీబ్‌ అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు. అదనంగా మరింత కట్నం కావాలంటూ సనాను వేధించసాగాడు. తనకెంత కష్టమైనా సరే బిడ్డ కంటకన్నీరు ఒలకద్దని... ముజీబ్‌ కోరినట్టు ఒకసారి 50 వేల రూపాయలు, మరోసారి మరో పదివేల రూపాయల కానుకలు అల్లుడికి ముట్టజెప్పాడు సనా తండ్రి. అయినా అల్లుడు శాంతించలేదు. సనాను ఇబ్బంది పెట్టడం మానలేదు. తరచుగా ఆమెను కొట్టేవాడు. భర్త ప్రవర్తనతో కలతపడ్డ సనా తల్లిగారింటికి వెళ్లింది. భర్త పెడుతున్న యాతనను తల్లిదండ్రితో పంచుకుంది. ‘తెలిసిన సంబంధమైతే కూతురుని బాగా చూసుకుంటారనుకుంటే ఇదేంటి? తన బిడ్డను ఇంత కష్టపెడుతున్నాడు అల్లుడు?’ రజాక్, ఆజ్‌గిరి బాధపడ్డారు. పెద్దవాళ్లతో చెప్పిస్తే వింటాడేమోనని బంధువులను పిలిపించి పంచాయితీ పెట్టించారు. పెద్దలు, ఇరువైపు బంధువులు ముజీబ్‌కు బుద్ధిచెప్పి, సనాకు నచ్చజెప్పి ఇద్దరిని ఒక్కటి చేసి కాపురానికి పంపారు.

అయినా మార్పులేదు!
రోజులు గడుస్తున్నాయి కాని ముజీబ్‌లో మార్పులేదు. ఇంతలోకే సనా గర్భవతి అయింది. ఆజ్‌గిరి, రజాక్‌ సంతోషానికి అవధుల్లేవు. పురిటికి బిడ్డను పుట్టింటికి తీసుకెళ్తామని కొండంత ఆశతో అల్లుడి ఇంటికి వచ్చారు. భార్యను పుట్టింటికి పంపిస్తే తనకు భోజనానికి కష్టమవుతుందని సనాను పంపించనన్నాడు. నిరాశతో వచ్చిన దారినే ఇంటిబాట పట్టారు రజాక్‌. తొమ్మిదో నెల పడగానే తీసుకెళ్లొచ్చులే అని సర్దిచెప్పుకున్నారు.

ఈలోపే...
మొన్న 18వతేదీ మంగళవారం రాత్రి పదిగంటలకు.. చిన్నగా గొడవ మొదలు పెట్టాడు ముజీబ్‌. ‘పెళ్లప్పుడు ఇచ్చిన కట్నం సరిపోలేదు... ఇంకా కట్నం కావాలి... తీసుకురా’ అంటూ నస మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక భార్య ఎనిమిదినెలల గర్భిణి అనే విచక్షణ కూడా మరిచిపోయి ఆమెను విపరీతంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని సనా కోలూర్‌లో ఉన్న తండ్రికి ఫోన్‌ చేసింది. ‘నా భర్త కొడుతున్నాడు. నా వల్ల కావడంలేదు. తొందరగా రా నాన్నా.. నన్ను తీసుకెళ్లు’ అంటూ మొరపెట్టుకుంది ఏడుస్తూ! తండ్రి మనసు విలవిల్లాడింది. ‘ఇప్పుడే బయలుదేరుతా తల్లీ’ అని ఫోన్‌ పెట్టేసి ఉన్నపళంగా ప్రయాణమయ్యాడు రజాక్‌. తండ్రి ఇచ్చిన భరోసాతో వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని ఆయన రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

ఆ ఎదురుచూపులతోనే ఆ బిడ్డకు నిద్రపట్టింది. పడుకుంది. 12.30 గంటలప్రాంతంలో... ఒళ్లంతా ఒక్కసారిగా తడిచిపోయినట్టు అనిపించడంతో దిగ్గున లేచికూర్చుంది. కిరోసిన్‌ వాసన ముక్కుపుటాలను అదరగొట్టింది. ఏం జరుగుతుందో అర్థమై తేరుకునే లోపే ముజీబ్‌ సనా ఒంటికి నిప్పంటించి బయటకు వెళ్లిపోయాడు గదికి బయట నుంచి తాళం వేసి మరీ. మంటల వేడికి తాళలేక సనా వేసిన కేకలు చుట్టుపక్కల వారిని నిద్రలేపాయి. హుటాహుటిన వచ్చి తాళం పగలగొట్టి ఆమెను నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

కాలిన గాయాలు... పురుటి నొప్పులు...
భర్త క్రూరత్వం సనా ఒంటిని 60 శాతానికి పైగా కాల్చేసింది. ఆ గాయాలకు ఒకవైపు చికిత్స పొందుతూ ఉంది. మరోవంక పురిటి నొప్పులు మొదలయ్యాయి. అంత మంటనూ పంటి బిగువున పట్టి ఉంచి పురుటి నొప్పులు తీసింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

బాగున్నాడా బిడ్డ?
స్పృహ వచ్చిన మరుక్షణం ఆ తల్లి... మేరా బచ్చా అచ్ఛా హై క్యా? కహా హై? మేరేకు బతావ్‌... బచ్చేకా కాన్‌మే అజా దియే క్యా? (నా బిడ్డ బాగున్నాడా? ఎక్కడున్నాడు? నాకు చూపించు. బిడ్డ చెవిలో అల్లా పేరు చెప్పారా?’ అని అడిగింది ఆత్రంగా. ఓ వైపు ప్రాణాలతో పోరాడుతూ బిడ్డ కోసం తపించిపోతున్నా తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సనా తల్లిదండ్రులు. ‘నా బిడ్డ బాగుండాలని... నా శక్తికి మించైనా సరే అల్లుడు అడిగింది ఇచ్చా. అయినా నా బిడ్డను పొట్టన పెట్టుకోవాలనుకున్నాడు. నా కూతురికి నరకం చూపించాడు. గర్భవతి అని కూడా చూడకుండా, కనీస కనికరం లేకుండా ఇంత దారుణానికి ఒటిగట్టిన ముజీబ్‌ను కఠినంగా శిక్షించాలి. నాలాంటి బిడ్డ మీకూ ఉంటుంది. అతనిని ఊరికే వదిలేయొద్దు’ అంటూ సనాబేగం తండ్రి షేక్‌ రజాక్‌ చేస్తున్న రోదన కలిచివేస్తోంది.

పసివాడి ప్రాణం
సనాబేగం జన్మనిచ్చిన పసి బిడ్డ ఆరోగ్యం బాగుందని, బాబు నెల రోజుల ముందు పుట్టడంతో ఎస్‌ఎన్‌బీసీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో సనాబేగం అదే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

సనాబేగం ప్రసవించిన మగబిడ్డ
– పాత బాలప్రసాద్, సాక్షి, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement