మాస్కోలో తెలుగును వెలిగించినవాడు.....
స్మరణీయులు
‘నేను సామాన్యులలోకెల్లా సామాన్యుడిని. అయినా సరే వినకుండా నా ఆత్మకథ రాయమంటున్నారు. అందుకే రాస్తున్నాను’ అని చెప్పుకున్నారు వుప్పల లక్ష్మణరావు తన ఆత్మకథ ‘బతుకు పుస్తకం’లో. ఆ కాలం మనుషులు అలాగే ఉండేవారు. అసామాన్యమైన పనులు చేసినా సామాన్యమైనవిగా భావిస్తూ వినమ్రంగా ఉండేవారు. నిజంగా వుప్పల లక్ష్మణరావు చేసిన పనులు సామాన్యమైనవా?
ఎక్కడి బరంపురం? ఎక్కడి సబర్మతి? ఎక్కడి ఎడిన్‌బరో? వుప్పల లక్ష్మణరావు ఒక బిందువు నుంచి మరో బిందువుకు చేసిన ప్రయాణం విలక్షణమైనది. పొందిన సాక్షాత్కారం కూడా. ఆయన చదువు వృక్షశాస్త్రం. అందులోనే డాక్టరేట్ చేశారు. దానినే విద్యార్థులకు బోధించారు. అయితే సంతృప్తి కలగలేదు. జాతీయోద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన ఊరికే ఉండలేకపోయారు. బోధనను పక్కన పెట్టారు. నేరుగా సబర్మతి ఆశ్రమానికి చేరుకుని అక్కడ ఖాదీ పరిశ్రమ మీద పరిశోధన సాగించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి అనేక ఇంజనీరింగ్ సంస్థలపై పరిశోధనలు సాగించారు. మళ్లీ వృక్షశాస్త్రం కోసం జర్మనీ వెళ్లి అక్కడ ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పరిశోధనలు సాగించారు. అనేక దేశాల విశ్వ విద్యాలయాలు ఆయన ప్రతిభను గుర్తించాయి. విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించాయి. అయినా ఆయనకు సంతృప్తి కలగలేదు. తన మనసు నిమగ్నమై ఉన్నది సాహిత్యంలోనే అని చివరకు కనిపెట్టగలిగారు. ఆ తర్వాత మడమ తిప్పలేదు. సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేశారు.
వుప్పల లక్ష్మణరావు జీవితంలో కీలక మలుపు ఆయన 1958లో మాస్కో చేరుకోవడం. అప్పటి నుంచి 1970 వరకూ అక్కడే ఉన్నారు. ‘ప్రగతి’ ప్రచురణాలయంలో అనువాదకునిగా ఉంటూ అక్కడి వారికి తెలుగు నేర్పించడం, తెలుగు పుస్తకాల ప్రచురణకు విస్తృతి కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇక్కడ ఒక సంఘటన చెబుతారు. లెనిన్‌గ్రాడ్‌లో సోవియెట్ విజ్ఞానకేంద్రం నిర్వహించిన ఒక ఇష్టాగోష్టిలో వుప్పల లక్ష్మణరావుకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సోవియెట్‌వారు భారతదేశం అంటే ఉత్తరాది భాషలే అని భావిస్తున్నారని, ద్రవిడ భాషల సారస్వతాన్ని పట్టించుకోవడం లేదని అభ్యంతరం ప్రకటించారు. ఆ తర్వాతనే సోవియెట్‌లో తెలుగుకు ప్రాముఖ్యం పెరిగిందనీ మాస్కో రేడియోలో ఇతర భాషలతో పాటు తెలుగు వాణి వినిపించిందనీ తెలుగువారందరూ ఇందుకు లక్ష్మణరావుకు రుణపడి ఉండాలనీ అంటారు.
మాస్కోలో ఉండగా వుప్పల లక్ష్మణరావు దాదాపు నలభై రష్యన్ పుస్తకాలకు తెలుగు అనువాదం చేశారు. వాటిలో మాక్సిమ్ గోర్కి ‘నా బాల్యం’, చెంగిజ్ ఐత్‌మాతోవ్ ‘జమీల్యా’, ‘తల్లి భూదేవి’ ముఖ్యమైనవి. ద్మీత్రియ్ మెద్వేదేవ్ ‘దిటవు గుండెలు’ కూడా. ఇవి గాక ఆర్మేనియన్ సాహిత్యాన్ని చాలా ఇష్టంగా తెలుగులోకి తీసుకువచ్చారు. ‘ఎందరు రచయితలు ఉన్నా గోర్కియే నా అభిమాన రచయిత. వాస్తవిక దృష్టి లేకుండా రచనలు చేయరాదని ఆయన చెప్పాడు. ఒకసారి గోర్కి ఒక రచయితల సమావేశంలో- మీ గుండెల మీద తుపాకీ పెట్టి కాలిస్తే ముందుకు పడిపోతారా వెనక్కు పడిపోతారా? అని అడిగాడు. చాలా మంది వెనక్కు పడిపోతామని చెప్పారు. కాని గోర్కి- కాదు. ముందుకే పడిపోతాం. నేనలా ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ముందుకే పడ్డాను అని చెప్పాడు. దీనర్థం ప్రతిదీ తెలుసుకొని చేయాలని కాదు. ప్రతిదీ ఊహించరాదని’ అంటారు లక్ష్మణరావు.
తెలుగు నేల వుప్పల లక్ష్మణరావును కేవలం అనువాదకునిగానే చూడలేదు. ఆయన నవల ‘అతడు-ఆమె’కు విశిష్టస్థానం ఇచ్చి అక్కున జేర్చుకుంది. భారత స్వాతంత్య్ర పోరాటం నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఈ నవల సాకల్యంగా ముసుగులు లేకుండా పాఠకుల ముందు పరుస్తుంది. ఆ విధంగా వుప్పల లక్ష్మణరావు తెలుగు సాహిత్యంలో రాజకీయాలను నేరుగా సాహిత్యం చేసిన మహీధర రామమోహనరావు తర్వాతి స్థానాన్ని అందుకున్నారు. ‘అతడు-ఆమె’ నవలలో లక్ష్మణరావు పాటించిన టెక్నిక్ కూడా వినూత్నమైనదే. అది ‘డైరీ టెక్నిక్’. ఒక స్త్రీ, ఒక పురుషుడు డైరీ రాసుకున్నట్టుగా సాగే ఈ నవలలో- అది డైరీ కనుక- వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకోకుండా నిజాయితీగా అభిప్రాయాలు సాగుతాయి. ఉద్వేగ సమయాల్లో ఉద్వేగం కలుగుతుంది. విచార సమయాల్లో విచారం. పాత్రలు తమకు తాముగా ప్రజాస్వామికంగా ఎదగడం అంటే ఏమిటో ఈ నవల చదివితే తెలుస్తుంది.
లక్ష్మణరావులో ఉండే జిజ్ఞాస అసామాన్యమైనదని అంటారు. ఆయన తన అరవయ్యవ ఏట రష్యన్ అక్షరాలు దిద్ది, నేర్చుకుని, తయారు చేసిన రష్యన్-తెలుగు నిఘంటువును అందుకు ఉదాహరణగా చూపుతారు. మంచి ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడం, కొత్త రచయితలను ఉత్సాహపరచడం ఆయన వ్యక్తిత్వంలో భాగం.
లక్ష్మణరావు స్విస్ వనిత మెల్లి శాలింజర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు సమాజానికి విడ్డూరమైన సంగతే అయినా వారి కుటుంబం ఆమెను స్వీకరించింది. ‘అందుకు నా ఇద్దరు తమ్ముళ్లకూ మరదళ్లకూ కృతజ్ఞుడనై ఉంటాను’ అంటారాయన. అంతేకాదు తన ఆత్మకథ ‘బతుకు పుస్తకం’ను వారికే అంకితం ఇచ్చారు.
1970లో మాస్కో నుంచి తిరిగి వచ్చాక లక్ష్మణరావు బరంపురంలోనే ఉండిపోయారు. విజయనగరం, రాయగఢ్, జయపురం వంటి చోట్ల సాహిత్య కార్యక్రమాలు చురుగ్గా సాగేలా కృషి చేశారు. ఇన్ని చేసినా ఆయన ఏనాడూ తన ఘనతలు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. అవార్డులు, రివార్డుల కోసం పట్టుపట్టలేదు.
ఒక చెట్టు నిశ్శబ్దంగా ఎదిగి నీడనిచ్చి, ఫలాలనిచ్చి, కలపనిచ్చి ఏమీ ఆశించకనే తన కర్తవ్యాన్ని ముగించుకుంటుంది.
బహుశా లక్ష్మణరావు కూడా అంతే. ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు ‘మీరు రాసినదానికీ మీ నిజ జీవితానికీ తేడా ఉందా?’ అని?.
దానికి ఆయన జవాబు- ‘నా బతుకు పుస్తకం చదవండి. మీకే తెలుస్తుంది’.
మహా మహా విజేతలు కూడా తలెత్తి చూడక తప్పని నిరాడంబరులు- సామాన్యులు- వుప్పల లక్ష్మణరావుగారు.
- సాక్షి సాహిత్యం
లక్ష్మణరావులో ఉండే జిజ్ఞాస కూడా అసామాన్యమైనదని అంటారు. ఆయన తన అరవయ్యవ ఏట రష్యన్ అక్షరాలు దిద్ది, నేర్చుకుని తయారు చేసిన రష్యన్- తెలుగు నిఘంటువును అందుకు ఉదాహరణగా చూపుతారు.
వుప్పల లక్ష్మణరావు