తెలుగు కథలో తాజాశ్వాస ప్రాతినిధ్య 2013
ఈ సంకలనం కోసం వస్తువును మాత్రమే పరిగణించకుండా కథను ‘మొత్తం కథ’గా చూడటం వల్ల కూడా మంచి కథలు దొరికాయనిపిస్తోంది.
తెలుగు కథకు ఒక సంస్కారం ఉంది. అది గురజాడ నుంచి అందిన సంస్కారం. శ్రీపాద నుంచి, చలం నుంచి, చాసో నుంచి, కొ.కు, రావిశాస్త్రి, మధురాంతకం రాజారాం, రంగనాయకమ్మ... ఇంకా ఎందరెందరి నుంచో అందిన సంస్కారం. ఆ సంస్కారం- ప్రశ్నించడం కావచ్చు. ఘర్షణ పడటం కావచ్చు. తిరుగుబాటు చేయడం కావచ్చు. సరిదిద్దడం కావచ్చు. తప్పుని తప్పు అని, ఒప్పుని ఒప్పు అని చెప్పడం కావచ్చు. బాధితుల వైపు, పీడితుల వైపు, అల్పవర్గాల వైపు, ఆడవాళ్ల వైపు, అధికుల పడగ మీద కాలు పెట్టి అణచ ప్రయత్నించే వీరుల వైపు నిలబడటం కావచ్చు. నియంతల గండభేరుండాల ప్రేవులను పదునైన పాళీతో బయల్పడేలా చేయడానికి చూపే తెగువ కావచ్చు. తెలుగు కథకు ఒక సంస్కారం ఉంది. ఒక తరం వెళ్లింది మరో తరం వచ్చింది ఆ రోజులు ఇప్పుడెక్కడివి అనే వీలు లేకుండా ఆ సంస్కారం చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది. ఆ కాగడాను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా అందుకునే కథకులు వస్తూనే ఉన్నారు. అందుకు మరో తార్కాణం ‘ప్రాతినిధ్య - 2013’.
పసునూరి రవీందర్, పి.వి.సునీల్ కుమార్, అల్లం వంశీ, కిన్నెర, ఉణుదుర్తి సుధాకర్, బెడదకోట సుజాత, దీపిక ఉప్పులూరి, వనజ తాతినేని, చింతకింది శ్రీనివాసరావు... ఎవరు వీరంతా? కొత్త కథకులు. తెలుగు కథావరణంలో ప్రవేశించిన తాజా కథకులు. తమ ఉనికి కోసం కథను వాడుకుంటున్న కథకులు కాదు. కథ వెలుగు కోసం తమ సృజనకు రాపిడి పెట్టడానికి వచ్చిన కథకులు. వినోదమా వీరి లక్ష్యం? కాదు. ప్రశ్నించడం. నిలదీయడం. తలపడటం. అవసరమైతే బుజ్జగించి చెప్తాం వింటే వినండి. లేకుంటే అక్షరాలను మండిస్తాం భస్మమయ్యి అడ్డు తొలగండి అని పంతం పట్టినట్టు కనిపిస్తున్న కథకులు. వస్తువును ఎంచుకోవడం, కుదురుగా చెప్పడం, దృక్పథాన్ని వెల్లడి చేయడం, పాఠకుణ్ణి నిద్ర లేపి వెలుగులోకి నడిపించడం... ఎవ్వరూ మానలేదు. ఈ కొత్త కథకులు ఈ పనిని ఇంత బాగా ఎలా చేయగలిగారు? బహుశా ఇది తెలుగు కథ అందించిన సంస్కారం. ఆ బాట ఏర్పరిచిన సంస్కారం.
కులం- అవును నాది ఈ కులమే! మతం- అవునయ్యా నీది ఈ మతమే! వర్తమానం- ఇది ఆరోగ్యకరమైన సంఘం ప్రదర్శిస్తున్న వర్తమానం కాదు, మరబొమ్మలుగా మారిన మనుషుల విషాద విధ్వంసం! భాష- చూడు బాబూ తెలుగు కూడా భాషే. ఇంగ్లిష్ మాత్రమే కాదమ్మా! కుటుంబం- రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతే కొమ్మలొచ్చిన చెట్లనే ఆసరా చేసుకోక తప్పదు. విప్లవం- ఏం.. ట్రిగ్గర్ నొక్కే వేళ్లు తెగిపడవలసిందేనా? వాటికి ఒక బుగ్గను తాకే అదృష్టం లేనట్టేనా? ఉగ్రవాదం- మిత్రమా... దాని రంగు ఆకుపచ్చ కాదు. చరిత్ర- రాళ్లెత్తిన కూలిలెవ్వరు? ఆహారం- ఏది నీచం? ఏది నీచు? ప్రవాసం- నిర్బంధ కొత్త బానిసత్వం... పదానికి ఒక కథ రాశారు. పరిపరి విధాలుగా ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ సంకలనంలో రెండు ప్రేమ కథలున్నాయి. చిత్రంగా రెంటి మధ్యా సామ్యముంది. రెండూ విఫల ప్రేమకథలే. అనామక వీరుల జీవిత కథలే. రెంటినీ రచయితలు అద్భుతంగా నడిపారు. ఒకరు: ఉణుదుర్తి సుధాకర్. కథ పేరు వార్తాహరులు. స్వాతంత్య్రపోరాటంలో బ్రిటిష్‌వారు కొత్తగా టెలిగ్రాఫ్ యంత్రాలు పట్టుకొచ్చి ఉద్యమాన్ని అణిచివేసే ఎత్తుగడ పన్నుతున్న కాలంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు బ్రిటిష్ అధికారి దగ్గర పనివాళ్లుగా చేరి ఆ సంగతి తెలుసుకొని ఆ టెలిగ్రాఫ్ యంత్రాలను ధ్వంసం చేద్దామనుకుంటారు. ఎంతో భవిష్యత్తు, ఆయుష్షు, జీవితం ఉన్న ప్రేమికులు వాళ్లు. కాని దేశం ముందు వాటికి ఏం విలువ? ప్రయత్నించారు. విఫలమయ్యారు. ఆ తర్వాత ఏమయ్యారో? ఎవరికి తెలుసు. వారి త్యాగం? ఎవరికి తెలుసు. వారిద్దరూ హిందూ ముస్లింలు. ఈ సమష్టి శక్తిని చీల్చడానికి బ్రిటిష్‌వారు చేసిన పన్నాగంలో ఇంకా కునారిల్లడం లేదు మనం? ఇలాంటిదే మరో కథ. పేరు: మార్తా ప్రేమ కథ. రచయిత: విమల. విప్లవోద్యమంలో వారిరువురూ ప్రేమికులు. దంపతులు. అడవిని ఇల్లుగా చేసుకున్నవారు. ప్రజల్ని బంధువులుగా మార్చుకున్నవాళ్లు. కాని అలా అనుకుంటే ఇంకేమైనా ఉందా? స్టేట్‌కు భయం వేస్తుంది. నీ స్వార్థం నువ్వు చూసుకోవాలి. అంతే తప్ప నిస్వార్థంగా పని చేయాలనుకుంటే ప్రతిఘటించాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? అతడు జైలు పాలయ్యాడు. ఆమె ఏకాకిగా బయట మిగిలిపోయింది. ఇలా ఎందరో ఎవరికి తెలుసు. జనం మీద సముద్రమంత ప్రేమ పెట్టుకున్నవారు తమ ప్రేమల్ని ఎలా బలిపెట్టారో ఎవరికి తెలుసు. కనిపించని కానలలోన వికసించిన పువ్వుల అందం- ఆ అందాన్ని చూపిన కథలు ఇవి.
కులాన్ని చర్చించిన కథలు మూడు ఉన్నాయి. మీసాలోడు- పసునూరి రవీందర్, మీరెట్ల వెజ్జులు?- జూపాక సుభద్ర, దమయంతి- దీపికా ఉప్పులూరి. మొదటి కథలో పెళ్లి పంక్తిలో దళితుడికి అవమానం జరుగుతుంది. రెండవ కథలో ఆఫీసులో డైనింగ్ టేబుల్ వద్ద. దళితుడు మొదటి పంక్తిలో కూచుని తినేంత యోగ్యుడు ఇవాళ్టికీ కాని పరిస్థితి ఊళ్లలో. లే.. లే.. అని లేపేయడమే. ఏం తప్పు చేశాడని? ఈ వివక్ష నగరాల్లో ఇంకోలా సాగుతుంది. మీరూ మాతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారా... అయితే ఆహారం దగ్గర పైచేయి సాధిస్తాం అని శాకాహారాన్ని ఒక విలువగా ముందుకు తేవడం. అది సాకుగా తీసుకొని హింసించడం. శాకాహారం ఒక మంచి అలవాటు కావచ్చు. కాని విలువ మాత్రం కాదు. ముఖ్యంగా దాని ఆధారంగా ఎదుటి మనిషిని తక్కువ చేయదగ్గ విలువ ఎంత మాత్రం కాదు. అందుకే మూడో కథలో ముఖ్యపాత్ర ఇలా అంటుంది- అమ్మమ్మా... అంటరానిది అని ఆ పిల్లతో నన్ను చిన్నప్పుడు ఆడుకోనివ్వలేదు. శరీరం తాకితే కడిగావు. కాని ఆ పిల్ల నా మనసును తాకిందే... ఏం చేస్తావ్? మెలకువలోకి తీసుకురావడం ఇది. కొత్త సంస్కారాల త్రోవ.
మతం ముఖ్యం. ఇప్పుడు మరీ ముఖ్యం. దానిని చర్చించిన కథలు మూడు ఉన్నాయి. అమ్మ బొమ్మ- వేంపల్లె షరీఫ్, సాహిల్ వస్తాడు- అఫ్సర్, సంస్కారం- వనజ తాతినేని. మూడూ సున్నితమైన కథలు. సున్నితమైన అంశాన్ని చాలా కన్విన్సింగ్‌గా ఓర్పుగా చెప్పే కథలు. ఈ దేశంలో పాఠ్యాంశాలకు మతం ఉంది. అది మెజారిటీలదైతే కనుక మైనారిటీలను అభద్రతలో నెట్టేస్తుంది. ఈ దేశంలో ‘అపవాదు నిర్మాణం’ ఉంది. అది మెజారిటీలు నిర్మించేదైతే గనక మైనారిటీలకు మృత్యుపాశం అవుతుంది. ఈ దేశంలో స్వేచ్ఛగా మతం ఎంచుకోవడంలో పురుషుల పెత్తనం ఉంది. అది మెజారిటీలదైతే గనుక మైనారిటీలకు పెనుగులాటగా మారుతుంది. ముగ్గురూ బాగా రాశారు. వనజ తాతినేని ఇంకా బాగా.
ఈ సంకలనంలో ఉన్న మరో మంచి కథ సుజాత బెడదకోట రాసిన ‘అమ్మ- నాన్న- అమెరికా’. కాన్పులకీ, పెంపకాలకీ అమెరికాకు వెళ్లే అమ్మమ్మల, నాయనమ్మల అవస్థను చాలా చక్కగా- కొడుకులూ కోడళ్లూ సెన్సిటైజ్ అయ్యే స్థాయిలో- చెప్పిన కథ ఇది. ఈ కథ చదివినవారు వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను తమ అవసరాల కోసం అమెరికాకు పిలిచి హింసించడం ఆపేస్తారు. ఇక పి.వి.సునీల్ కుమార్, అల్లం వంశీ, ఎ.వి.రమణ ప్రసాద్‌ల కథలు, ఆ కథల్లోని ‘ఈజ్’ చూస్తే పాఠకులకు ఇక వీళ్లతో దిగులు లేదు అనే నిశ్చింత కలుగుతుంది.
ముసునూరు ప్రమీలతో కలిసి ఈ సంకలనానికి సంపాదకత్వం వహించిన డా.సామాన్య స్వయంగా రచయిత. అయితే సంపాదకురాలిగా కూడా ఆమెకు తాను ఏ కథలను ఎంచుకుంటున్నదో ఎందుకు ఎంచుకుంటున్నదో స్పష్టత ఉందనిపిస్తుంది ఈ సంకలనం చూస్తే. వస్తువును మాత్రమే పరిగణించకుండా కథను ‘మొత్తం కథ’గా చూడటం వల్ల కూడా మంచి కథలు దొరికాయనిపిస్తోంది.
ప్రయాణం మొదలయ్యింది. ఇక ఈ సంపాదకులుగాని, రచయితలుగాని చేయవలసిన గమనం చాలానే ఉంది.
ఇరువురూ నిరాశ పరచరనీ మధ్యలోనే తప్పిపోరని ఆశిద్దాం.
- నెటిజన్ కిశోర్