ఆనాటి నెల్లూరోళ్లు...
ఏ ప్రాంతానికైనా దానిదైన గొప్పతనం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉద్భవించిన మహానుభావులూ ఉంటారు. ఒక ప్రాంతం ఒకదాని కంటే తక్కువ కాదు. ఒక ప్రాంత మహనీయులు మరోప్రాంత మహనీయుల కంటే ఎక్కువా కాదు. కాని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాన్ని, ఆ ప్రాంతానికి వన్నెతెచ్చిన ముద్దుబిడ్డలను తలచుకోవడానికి ఇష్టపడతారు. భావితరాలకు వారి గురించి చెప్ప ప్రయత్నిస్తారు. అలాంటి పుస్తకమే ‘ఆనాటి నెల్లూరోళ్లు’. ఇందులో ఉన్నది కేవలం ‘నెల్లూరోళ్లు’ కాదు.
వీరంతా సొంత ప్రాంత పరిధులు దాటిన తెలుగుజాతి రత్నాలు. పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రజానేతలు, నెల్లూరు వెంకట్రామానాయుడు, ఖాసా సుబ్బారావు, జి.కె.రెడ్డి వంటి పత్రికారంగ పెద్దలు, గిరిజనోద్ధారకులు వెన్నెలకంటి రాఘవయ్య, యాత్రా సాహిత్యకారులు ఏనుగుల వీరాస్వామయ్య వీరంతా నెల్లూరు కన్నబిడ్డలు. ఇక సాహిత్యానికి వస్తే తన ఇరవయ్యో ఏట సంస్కృతం నేర్చుకుని జీవితాన్ని కవిత్వానికి అంకితం చేసిన దావూదు కవి, మరుపూరు కోదండరామిరెడ్డి, కరుణకుమార, దువ్వూరు రామిరెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ, పఠాబి, కె.వి.ఆర్... సినిమా రంగం నుంచి ఘంటసాల బలరామయ్య, నెల్లూరు కాంతారావు, ఆత్రేయ, రాజనాల, కె.ఎస్.ఆర్.దాస్... ఇంకా అనేకమంది.
రచయిత ఈతకోట సుబ్బారావు తన శక్తిమేరకు సేకరించి ప్రచురించారు. ఇంకా చాలామంది నెల్లూరోళ్లు ఇందులో లేరు. కాని తక్షణ పరిశీలనకు ఇది ఉపయోగపడుతుంది. తన ప్రాంతం మీద ప్రేమతో శ్రమకోర్చి చేసిన ఈ పనికి రచయిత అభినందనీయుడు.
ఆనాటి నెల్లూరోళ్లు - ఈతకోట సుబ్బారావు
వెల: రూ.200 ప్రతులకు: 9440529785