మీకు పుణ్యం ఉంటుంది! | Will be handled for you! | Sakshi
Sakshi News home page

మీకు పుణ్యం ఉంటుంది!

Published Tue, Oct 27 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

మీకు పుణ్యం ఉంటుంది!

మీకు పుణ్యం ఉంటుంది!

అనారోగ్యంతో మృతి చెందిన భర్త
క్యాన్సర్ వ్యాధితో భార్య
మంచంపట్టి ఉన్న పెద్దకుమార్తె
మగ దిక్కులేని కుటుంబం
తల్లడిల్లుతున్న పిల్లలు
 

మరో జన్మ లేకపోవడమే మోక్షం.అలాంటి మోక్షం కోసం మనిషి తపిస్తాడు. ఏదీ... మనలాగా కొద్దోగొప్పో మంచి జీవితం ఉన్నవాళ్లే తపిస్తారు. ఓ రకంగా మనం మోక్షం కోరుకోవడం అత్యాశేనేమో! కానీ... చిట్టెమ్మలాంటి వాళ్లు మళ్లీ మనిషి పుట్టుక వద్దు అని కోరుకోవడం
 ఆశ కాదు... అవసరం అనిపిస్తుంది. మూట కట్టుకున్న పుణ్యం వల్ల మోక్షం కలుగుతుందో లేదో తెలియదు కానీ... చిట్టెమ్మకు ఇవాళ్టి కష్టాల నుండి మోక్షం కలిగించగలిగితే  మనం తప్పకుండా పుణ్యం మూటకట్టుకుంటాం.
 
 పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి వ్యాధులు ఆవేదనను మిగిల్చాయి. పెద్ద కుమార్తె మతిస్థిమితం లేకుండా, అవయవాలు పనిచేయకుండా మంచానికే పరిమితమైంది. అంతుచిక్కని వ్యాధితో నాలుగేళ్ళ క్రితం భర్త మరణించాడు. గర్భసంచి క్యాన్సర్ సోకి ఆమె తల్లడిల్లుతోంది. వైద్యం చేయించుకునేందుకు చేతులో చిల్లిగవ్వ లేక సమాజం వైపు నీరింకిన కళ్ళతో చూస్తోంది. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టలేని దీనస్థితిలో ఆ తల్లి కుమిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో సంతపాకలకు చెందిన ముర్తిపేట చిట్టెమ్మ కన్నీటి గాథ ఇది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముర్తిపేట సత్తిబాబు, చిట్టెమ్మలు పొట్టకూటి కోసం పాతికేళ్ళ క్రితం వేలేరుపాడులో ఓ రైస్‌మిల్లులో పనిచేయడానికి వచ్చారు. అప్పటి నుండి ఇక్కడే స్థిరపడిపోయారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.

అంతుచిక్కని రోగాలు...
పెద్ద కుమార్తె దుర్గ. ఇప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. మతిస్థిమితం లేదు. నడుము, కాళ్లు పనిచేయవు. దీంతో లేవలేని స్థితిలో ఉన్న ఆమెకు తల్లి వెంటే ఉండే సపర్యలు చేయాలి. అయినా భర్త ఉన్నన్నాళ్లూ పిల్లల పోషణ చిట్టెమ్మకు భారం కాలేదు. కానీ, నాలుగేళ్ళ క్రితం అంతుచిక్కని వ్యాధితో భర్త సత్తిబాబు మృతి చెందాడు. పుట్టెడు శోకంతో బతుకుబండి లాగుతున్న చిట్టెమ్మకు ఆ తర్వాతి ఏడాదే గర్భసంచి క్యాన్సర్ వచ్చిందని తెల్సింది. ముగ్గురు ఆడపిల్లలను ఎలా పోషించాలో, తనకు వైద్యం ఎలా చేయించుకోవాలో... దిక్కుతోచలేదు చిట్టెమ్మకు. అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి మూడునెలలకోసారి వెళ్లి, వైద్యం చేయించుకునేది.

చార్జీలకు డబ్బుల్లేక...
ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం ఉచితమే అయినా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ ఆసుపత్రికి వెళ్లాలంటే ఆమెకు పోను పోను భారంగా మారింది. మూడునెలలకొకసారి కోబాల్ట్ కీమోథెరపీ చేయించుకోవాలి. బస్సుచార్జీలకు కూడా డబ్బుల్లేక వైద్యం మానుకొని ఇంటి వద్దనే ఉంటోంది. సరైన వైద్యం అందక ఆరునెలల నుంచి ఒంటి నిండా కురుపులు వచ్చాయి. నీరసించి నడవలేకపోతోంది. గతంలో కుటుంబ పోషణ కోసం కూలి పనికె ళ్లేది. ఇప్పుడు కూలిపనులకు వెళ్లలేని పరిస్థితిలో పెద్దకూతురు దుర్గకు కాపలాగా ఉంటోంది.

వారంలో నాలుగు రోజులు పస్తులే...
 ఈ కుటుంబానికి తెల్లరేషన్ కార్డు ఉండటంతో నెలకు 20 కేజీల బియ్యం వస్తున్నాయి. పెద్ద కుమార్తె దుర్గకు వికలాంగుల పెన్షన్ కింద నెలకు 15 వందల రూపాయలు వస్తాయి. వేలేరేపాడు మండలం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి ఇక్కడ వితంతు పెన్షన్లు అందడం లేదు. ఆ విధంగా చిట్టెమ్మకు ఆ ఆసరా కూడా లేకపోయింది. కేవలం 1500 రూపాయలతోనే ఇల్లు గడవాలి. ఉన్న కాసిన్ని డబ్బులు దేనికీ సరిపోవడం లేదని మందులూ కొనడంలేదు. ఇవే నెలంతటికీ సరిపోక వారంలో నాలుగురోజులు పస్తులుంటున్నారు.
 
మధ్యాహ్న భోజనానికే పాఠశాలకు...
 చిట్టెమ్మ రెండవ కుమార్తె పరిమళ. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో 6వ తరగతి, చిన్నకూతురు మరియమ్మ నాలుగవ తరగతి చదువుతూ తల్లికి అండగా ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం దొరుకుతుందనే ఆశతో పరిమళ, దుర్గ పాఠశాలకు వెళ్తున్నారు. వారిద్దరికీ ఒక పూట భోజనం అక్కడే గడిచిపోతోంది. కానీ, రాత్రులు పస్తులు ఉన్న రోజులు ఎన్నో. అక్క దుర్గకు కూడా భోజనం పాఠశాల నుంచే  తీసుకెళ్తారు.
 
సంతలో కుళ్లిన కూరగాయలు...
 ప్రతీ శుక్రవారం వీరి ఇంటికి దగ్గరలో వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతలో కూరగాయలు అమ్మే వ్యాపారులు సంతలో అమ్మగా, అందులో కుళ్ళిన కూరగాయలను అక్కడే పడేస్తారు. వీటిని పరిమళ, మరియమ్మలు సేకరించుకొని ఇంటికి తీసుకెళ్తారు. వాటినే వండుకొని తింటున్నారు.
 - ఎం.ఏ.సమీర్, సాక్షి, వేలేరుపాడు
 
 ఎవరూ లేరు...

 నాకు అయినవారు ఎవరూ లేరయ్యా! నా భర్త బతికి ఉన్నంతకాలం బాగానే గడిచింది. అంతుచిక్కని జబ్బుతో మంచం పట్టాడు. ఆయన్ను బతికించుకోవడం  కోసం కూలి పనులు చేసి, ఎంతో కష్టించా. అయినా బతికించుకోలేకపోయాను. ఆయన చనిపోయాక, నాకు క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడు పోతానో తెలియదు. నా  పిల్లల కడుపుకింత తిండిపెట్టలేక నరకయాతన పడుతున్నా. నా  బాధను ఆ దేవుడే  తీర్చాలి...!! (కన్నీళ్లతో చెప్పింది చిట్టెమ్మ)
 - చిట్టెమ్మ
 
 చేయూతనందించాలనుకునే వారికోసం...
 చిట్టెమ్మ ముత్తుపేట - A.C.No.: 73054816819
 IFSC Code: SBIN0RRAPGB
 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్‌బ్యాంక్ (NGB),
 వేలేరుపాడు బ్రాంచ్.
 ఫోన్ నెం: 9666368979
 
 చూసి చలించా...
 ఈ కుటుంబానికి వచ్చిన కష్టం పగవారికి కూడా రావద్దని మొక్కనివారు లేరు ఇక్కడ. మూడేళ్ళుగా ఈ కుటుంబం పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తున్నా. పస్తులున్న రోజున బియ్యం, కూరగాయలు ఇస్తూ వచ్చాను. చిట్టెమ్మకు వైద్యం అందేలా, ఆ పిల్లలకు ఇంత అండ దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
 - కొండేపూడి విజయ్‌కుమార్, వేలేరుపాడు వాస్తవ్యుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement