నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం | Your personality, your books | Sakshi
Sakshi News home page

నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం

Feb 13 2015 11:03 PM | Updated on Sep 2 2017 9:16 PM

నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం

నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో అల్బెర్టో మాంగ్యుయెల్‌ని కలవడం ఎవరికైనా చాలా సంతోషాన్నిచ్చే సంగతి. అల్బెర్టో అనేక విధాలుగా గొప్పవాడు.

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో అల్బెర్టో మాంగ్యుయెల్‌ని కలవడం ఎవరికైనా చాలా సంతోషాన్నిచ్చే సంగతి. అల్బెర్టో అనేక విధాలుగా గొప్పవాడు. ఇతడు చిన్నప్పుడు పాకెట్ మనీ కోసం ఒక బుక్‌స్టాల్‌లో పని చేస్తుంటే ప్రఖ్యాత రచయిత బోర్హెస్ వచ్చి (అప్పటికి పుస్తకాలు చదివీ చదివీ ఆయన చూపు పోయింది) అబ్బాయ్... అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి పుస్తకాలు చదివి వినిపించవచ్చు కదా అని అడిగాడట. అల్బెర్టో చాలాసార్లు బోర్హెస్ ఇంటికెళ్లి ఆ పని చేసి వచ్చాడు. ఆ సంగతి విని అసూయపడని వాడు లేదు. బోర్సెస్‌ని చూడటమే పెద్ద విషయం.

ఆయనతో గడపడం ఇంకా. అర్జెంటీనాలో పుట్టి పెరిగిన అల్బెర్టో వ్యాసకర్త, రచయిత అనే విషయం కన్నా ఆయన పుస్తకాల సేకర్త అన్న విషయమే ఎక్కువమందిని ఆయన వైపు లాగుతుంది. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్‌లో ఒక మారుమూల పల్లెలో తన ముప్పై నలభై వేల పుస్తకాల నడుమ హాయిగా చదువుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకం ‘ది హిస్టరీ ఆఫ్ బుక్ రీడింగ్’ చాలా విలువైనది. ప్రతి ఉత్తమ సాహిత్యాభిలాషీ చదవదగ్గది. ఆయన ఈ ఫెస్టివల్‌లో చాలా విలువైన విషయాలు చెప్పాడు. వాటిలో కొన్ని...
 
 ‘ఎవరికీ పుస్తకం ఇవ్వకండి. అంతగా అయితే కొత్తది కొని కానుకగా ఇవ్వండి. మీ పుస్తకం ఇచ్చారంటే మీరు ఎదుటివ్యక్తిని దొంగతనానికి పురిగొల్పుతున్నట్టే. ఆ పుస్తకం మరి తిరిగి రాదు. నా దృష్టిలో సాహిత్య చరిత్ర అంటే అది రచయితలు నిర్మించిన చరిత్ర కాదు. పాఠకులు నిర్మించిన చరిత్ర. పాఠకులు తమకు ఏ పుస్తకాలు కావాలనుకున్నారో వాటినే నిలబెట్టుకున్నారు. ఆ పుస్తకాలే చరిత్రగా మిగిలాయి. మనం ఎంత ప్రయత్నించినా పాఠకులు కోరనిదే పుస్తకాన్ని నిలబెట్టుకోలేము. ఒక మనిషి తన ఇంట్లో పర్సనల్ లైబ్రరీని తయారు చేసుకున్నాడంటే అతడు దాదాపుగా తన ఆత్మకథ రాస్తున్నట్టే లెక్క. ఆ పుస్తకాల్లో ఏవో కొన్ని స్లిప్పులు దాస్తాడు. రసీదులు దాస్తాడు. ఎవరెవరివో ఫోన్  నంబర్లు నోట్ చేస్తాడు. ఫొటోలు... ఇవన్నీ జ్ఞాపకాలుగా మారి ఒక ఆత్మకథను రచించినంత పని చేస్తాయి. ఇంకా ఏమంటానంటే మీ లైబ్రరీయే మీ ముఖచిత్రం. అంటే మీ పుస్తకాలను చూసి మీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు. నేను ఎవరి ఇంటికైనా వెళితే ఆ పెద్దమనిషి పుస్తకాల ర్యాక్‌లో ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారి పుస్తకాలు కనిపించాయనుకోండి... అతడు స్నేహశీలి అని అర్థం చేసుకుంటాను. పాలోకోయిలో పుస్తకాలు కనిపించాయనుకోండి... ఇక మాట్లాడటం అనవసరం అని నిశ్చయించుకుంటాను. (పాలోకోయిలో అధమస్థాయి రచయిత అని అల్బెర్టో ఉద్దేశం). నేను చిన్నప్పటి నుంచి చాలా చదివాను. అలా అని నాకు పేరుంది. పుస్తకాలను చదివినవారిని మాత్రమే నేను గౌరవిస్తాను. ఇంటికి ఆహ్వానిస్తాను.

ఏ రాత్రయినా చక్కటి విందు ఏర్పాటు చేయాలంటే నేను ఆహ్వానించదలుచుకునే గొప్ప గొప్ప చదువరులు- ఒకడు బోర్హెస్... రెండు (కవి) రూమీ... మూడు వర్జీనియా వూల్ఫ్. పుస్తకాలంటే ఏం పుస్తకాలు? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి చదివి మనం దేనిని మన మెదళ్లలోకి పంపుతున్నామో అప్రమత్తంగా ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఇది తెలుసుకునే ఇంగితాన్ని ఇచ్చే పని మనం పుస్తకాలతో చేయాలి. అక్షరాలతో చేయాలి. మతం, జ్ఞానం, అధికారం కంటే మంచి చెడుల విచక్షణ తెలుసుకుని మంచివైపు నిలబడటం నేర్పడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రపంచంలో చాలా హింస తగ్గుతుంది. మనం కొంచెం నాగరికులం అవుతాం. సరిగ్గా జీవించగలుగుతాం’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement