లె మిజరాబ్
‘ఈ లోకంలో అన్యాయం, అక్రమం,పేదరికం, దోపిడీ ఉన్నంతకాలం అలకాపురులలోని కుబేరుల పక్కనే నరక కూపాలలో నరులు నివసించినంత కాలం, అజ్ఞానాంధకారంలో మనుషులు దివాంధాల్లా కొట్టుమిట్టాడినంత కాలం యిలాంటి పుస్తకాల అవసరం ఉంటుంది’ ఇదీ ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో (1802-1885) లె మిజరాబ్‌కు రాసిన ముందుమాట. ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేసిన ఫలితంగా దేశబహిష్కరణకు గురై హ్యూగో ప్రవాసంలో ఉన్నప్పుడు 1862లో వెలువడిన నవల లె మిజరాబ్. ఒకేసారి ఎనిమిది నగరాల్లో ప్రచురించబడింది. పదేళ్ల పాటు ఫ్రాన్స్ రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్ని, వర్గ సంబంధాలను అధ్యయనం చేసి తన పరిశోధనా ఫలితాన్ని ఒక మెలోడ్రమటిక్ కథగా మలిచాడు రచయిత.
అప్పుడప్పుడే ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని పరిశీలించిన హ్యూగో ఈ సమాజంలోని సమస్యలన్నింటికీ మూలం డబ్బే అనే నిర్ధారణకు వచ్చాడు. ‘పేదవాళ్లకే ఎందుకిన్ని కష్టాలు? ఎందుకింత మిజరీ? ఈ మిజరబుల్ జనజీవితం బాగుపడేదెప్పుడు? పేదవాళ్లు నేరాలు చేస్తారనటం సబబు కాదు. అసలు నేరప్రవృత్తి సంపన్నుల జీవిత పద్ధతిలోనే ఉంది. ఆ సంపద ఎన్ని నేరాల ఫలితమో. ప్రభుత్వం దోచుకుంటుంది. ధనవంతులు దోచుకుంటారు. తోటిమనుషులు దోచుకుంటారు. పేదల బతుకంతా దోపిడీయే’ అంటూ ఆక్రోశిస్తాడు హ్యూగో. నూటయాభై ఏళ్ల క్రితం ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.
- ముక్తవరం పార్థసారథి