ఆకుపచ్చ సూర్యోదయం | Nation continued their run in the British flag | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యోదయం

Published Sat, Jan 28 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

ఆకుపచ్చ  సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం

మే నెల 7, 1924

ఎండ– వలసదేశంలో బ్రిటిష్‌ జెండాలా చెలరేగిపోతోంది తూర్పు కనుమల మీద.నిప్పుల ముసుగు లాంటి ఆకాశం కింద పూర్తిగా ఆకు రాల్చిన  కొన్ని చెట్లు పతాకాలను అవనతం చేసిన కొయ్యలను గుర్తుకు తెస్తున్నాయి. విశాఖమన్యంలో ఆ రోజు, ఆమారుమూలకు గ్రామం కృష్ణదేవిపేటలో జరగబోతున్న ఓ ఘోరకలి పతాక సన్నివేశాన్ని ముందే ఊహిస్తున్నట్టున్నాయి.అదిగో! దావాగ్నిలో ఓ చిరు నాలుక వంటి ఈ నాందీవాక్యం ఆ సన్నివేశంలోదే......‘‘శ్రీరామరాజొస్తన్నాడ్రా... శ్రీరామరాజు...  రండి ...! పాలూ పళ్లూ పట్టుకురండి...!  హారతులివ్వండి!’’అకస్మాత్తుగా పొలికేకలు, వీధి మొగలో.కానీ, పేలిన తూటాలు చెవిని తాకుతూ వెళ్లినట్టయింది. అంత భయపెట్టాయి, ఆ కేకలు.అక్కడంతా భయమే. ఒక్కొక్కటిగా వచ్చి వాలిపోతుంటే, పెరిగిపోతున్న రాబందుల గుంపును చూసి సగం చచ్చిన గొడ్డు కళ్లల్లో అలుముకుంటున్న భయం లాంటి భయం.అదిరిపడి అటే చూశారందరూ.చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఆ కానిస్టేబుల్‌ గొంతు నుంచే వచ్చాయా కేకలు. వెర్రికేకలు.అరుపులతో ఉబ్బిన అతడి కంఠనాళాలు ఇంకా అలాగే ఉన్నాయి. అంతులేని కసితో, గొంతు పగిలేలా అరిచాడు.ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతమే అయినా రోహిణి ఎండ చురచురలాడిస్తోంది. వడగాలీ చెలరేగిపోతోంది. ఇసుకరేణువుల బరువుతో భారంగా కదులుతున్నాయి ఎండుటాకులు. ఎర్రకొండల ధూళి సుడులు సుడులుగా ఊరంతా స్వైరవిహారం చేస్తోంది.

థక్‌...థక్‌...థక్‌...థక్‌... థక్‌.. థక్‌... కొండలలో మట్టిబాట మీద బూటు కాళ్ల అడుగుల సవ్వడి.కర్కశమైన, కర్ణకఠోరమైన ఆ శబ్దం నెల తరువాత నెల పెరిగిపోతూనే ఉంది. అది పెరుగుతూ భయాన్నీ పెంచింది. ఒకటి కాదు, రెండు కాదు... ఇరవైమూడు నెలలుగా.... నాలుగు దిక్కులూ తుపాకీ పేలుళ్లతో పగలూ రాత్రీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.నిన్న తెల్లవారు జామునే... బ్యాటరీ లైట్లు, పెట్రోమాక్స్‌ లైట్ల వెలుగులలో పరుగులు తీస్తూ పోలీసులు పెట్టిన ఆ పెడబొబ్బలూ, అరుపులూ ఊరివాళ్ల చెవులలో ఇప్పటికీ గింగురుమంటూనే ఉన్నాయి, ‘శ్రీరామరాజు దొరికిపోయాడు, దొరికిపోయాడు.. శ్రీరామరాజు దొరికిపోయాడు’ అంటూ.వణికిపోయింది కృష్ణదేవిపేట. కానీ పది నిమిషాలలోనే అంతా గప్‌చుప్‌.వేటాడిన జంతువును తెచ్చినట్టు ఒళ్లంతా గాయాలతో ఉన్న ఓ గడ్డం మనిషిని మోటారుబండిలో పడేసి తెచ్చారు. వెంటనే రాజవొమ్మంగి తీసుకుపోయారని చెప్పుకున్నారు. ఆపై ఏమైందో తెలియలేదు.ఎవరో అగ్గిరాజట, శ్రీరామరాజే అనుకుని అతడిని బంధించి తీసుకువచ్చారట.ఇది జరిగి ఇరవైనాలుగు గంటలైనా గడవలేదు. మళ్లీ ఈ బీభత్సం....లాఠీలతో ఇద్దరు చింతపల్లి పోలీసులూ, వారి వెనుకే భుజాల మీద 303 తుపాకులతో ఐదుగురు అస్సాం రైఫిల్స్‌ దళ సభ్యులూ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు, నడివీధిలో.ప్రపంచ యుద్ధంలో పనిచేశామన్న పొగరు ఆ ఐదుగురి నడకలో. జర్మనీ యుద్ధోన్మాదంలో రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం తునాతునకలైపోకుండా తామే రక్షించామన్న అతిశయం ఆ  ముఖాల నిండా. ఆ గతంతో పాటు, ప్రస్తుతం కళ్లెదుట కనిపిస్తున్న క్రూరత్వం జనాన్ని వణికిస్తున్నాయి. గ్రామచావడి, రామాలయం ఉన్న ఆ వీధిలోనే వడివడిగా అడుగులేస్తున్నారు ఆ ఏడుగురు. ఊరి శివార్లలో ఉన్న దలే బెన్నయ్య సారా దుకాణంలో పది నిమిషాల క్రితం రెండేసి డ్రాముల వంతున తాగిన సారా కైపెక్కించడం ఆరంభించినట్టుంది.అప్పుడే, పూనకం వచ్చినట్టు నాలుగు అంగలు లంఘించి, లాఠీ సహా కుడిచేయి పైకెత్తి ఉన్మాద స్థితిలోకొచ్చేసి అరవడం మొదలుపెట్టాడా చింతపల్లి పోలీసు.‘‘మీ సీతారామరాజొస్తన్నాడ్రోయ్‌....!  శ్రీశ్రీశ్రీ అల్లూరి శ్రీరామరాజు గారొస్తన్నారరేయ్‌... !!’’
ఆపకుండా అరుస్తూనే ఉన్నాడతడు.‘‘కేడీపేట జనులారా! మీ దేవుడు.. మీ రామరాజు... నిజంగా దొరికిపోయాడొహోయ్‌!’’ తుపాకీ మోత వినపడిన పక్షుల గుంపులా, గ్రామ చావడిలో కూర్చుని మాట్టాడుకుంటున్న ఆ ఎనిమిదిమంది నడివయస్కులు వాళ్ల కంట పడకుండా తప్పించుకునేందుకు ఒక్క ఉదుటన దూకారు.  మళ్లీ పెనుకేక, హిందీలో..... వాళ్లని ఉద్దేశించే – ‘‘టైరో...!’’

 ఆగలేదు ఆ గ్రామీణులు.‘‘టైరో... టైరో....ఠైరో..ట్టయ్‌రో, బద్మాష్‌ ....!’’ వెనుక నుంచి అస్సాం దళసభ్యుల కేకలు, మండుతున్న దుంగలు ఒరుసుకుంటున్నట్టు.‘‘ఆగండెహె!’’ అస్సాం రైఫిల్స్‌ సభ్యుల కరకు ఆదేశాన్ని చింతపల్లి పోలీసులలో ఒకడు అనువదించాడు. ఈ నాలుగయిదు మాసాల సాహచర్యంతో అబ్బిన హిందీ ముక్కల ప్రభావం.కన్నుమూసి తెరిచేలోగానే అలా జరిగిపోయింది – మొదట కేకపెట్టిన అస్సాం రైఫిల్స్‌ సభ్యుడే దుమ్ము రేపుకుంటూ, కొద్దిగా తూలతున్నా కూడా అత్యంత లాఘవంగా దూసుకెళ్లి ఆ గ్రామీణలకు అడ్డంగా నిలబడ్డాడు. భుజం మీద ఉన్న ఆ రైఫిల్‌ని ఎప్పుడు ఎలా తీశాడో మరి, దానినే వాళ్లకి అడ్డం పెట్టాడు.

పడగెత్తిన నాగుపాముని చూసినట్టు రెండడుగులు వెనక్కి వేశారు వాళ్లు, తుపాకీని చూసి.రెండు సెకన్ల తరువాత తుపాకీ భుజం మీద వాల్చి, ఒక్కసారిగా అటెన్షన్‌లోకొచ్చి నిలబడ్డాడు. కుడి బూటుకాలిని బలంగా నేలకు తాడించి సెల్యూట్‌ చేశాడు.గుండెలదిరిపోయాయి వాళ్లకి.‘‘అస్సాం రైఫిల్స్‌.... ఈ పేరు విన్నార్రా? మేమెవరమో తెలుసురా బాడ్ఖోవ్‌. మహాయుద్ధంలో... ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడిని ఉచ్చ పోయించినవాళ్లం..’’పళ్లు పటపట కొరుకుతూ, కోపంతో ఊగిపోతూ అన్నాడు హిందీలో. గుప్పుమంది సారా వాసన. మత్తుతో నాలుక మడతపడుతోంది. మాట మాటకీ పెరుగుతోంది ఆవేశం. ఆవేశం గొంతును పెంచుతోంది. కళ్లలో ఎరుపు కూడా పెరిగిపోతోంది. అప్పటికి మిగిలిన పోలీసులు కూడా ఆ గ్రామీణులని  చుట్టుముట్టారు.ఖాకీచొక్కాలు పూర్తిగా తడిసిపోయాయి, చెమటతో. ముదురుతున్న ఎండతో ముఖాలన్నీ చెమట పట్టేసి, ఇంకాస్త భయపెడుతున్నాయి, ఆ ఎర్రటి దుమ్ము పేరుకుని. కురుచ జుట్టు మీద పెట్టుకున్న బిగుతు టోపీలో నుంచి ధారలుగా కారుతోంది చెమట. గాడ్పులకి వాడిపోయి ఉన్నాయి వాళ్ల  ముఖాలన్నీ. సగమే తెరిచినట్టు కనిపిస్తూ చింత నిప్పుల్లా ఉండే అస్సాం రైఫిల్స్‌ వాళ్ల కళ్లు మానుతున్న కత్తిగాట్లలాగే ఉన్నాయి, తెల్లటి ముఖాల మీద. ఆ గుంపును ఆపినవాడే, పెద్ద రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా మొదలు పెట్టి ఒక్కసారిగా రెచ్చిపోయాడు.‘‘తిరుగుబాటు చేస్తార్రా?! ఫితూరీలు చేస్తార్రా, ఫితూరీలు?! లోడ్‌ చేయని గన్‌ని చూస్తేనే కాళ్లు తడుపుకుంటారు, మీర్రా తిరగబడేది... లంజాకొడకల్లారా!’’ తుపాకీ మడమలతో గొడ్లను బాదినట్టు బాదడం మొదలుపెట్టారు ఆ గ్రామస్థులని, అస్సాం రైఫిల్స్‌ వాళ్లు.. ‘‘మాకేం తెలీదు దొరా! ఫితూరీ మాదికాదు...కొండోళ్లది దొరా! నిజం దొరా!’’ ఏడుస్తూనే చెబుతున్నారు గ్రామీణులు. అదేమీ వినకుండా ప్రతాపం చూపిస్తున్నారు పోలీసులు. వాళ్లు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే మోకాళ్ల మీద బూటుకాళ్లతో బలం కొద్దీ తన్నుతున్నారు. చర్మం పగిలి రక్తం కారుతోంది కొందరికి. గుండెలవిసిపోయేలా రోదించడం మొదలుపెట్టారు. ఆ ఏడుపులతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం ప్రతిధ్వనిస్తోంది.

అక్కడికి కొంచెం దూరంలోనే అప్పటిదాకా అరుగు మీద కూర్చుని ఉన్న ఆ కుటుంబ సభ్యులు – ఆడా, మొగ ఒక్క ఉదుటన లోపలికి ఉరికి తలుపులు బిగించుకున్నారు. మరుక్షణంలో ఆ వీధిలో ఉన్న ఇళ్ల తలుపులన్నీ పెనుగాలికి ఎడా పెడా కొట్టుకున్నట్టు కొట్టుకుని, చివరికి మూసుకున్నాయి.దెబ్బలు తిన్నవాళ్లు ఆ చిన్న సందు దాటి, మునసబు లగుడు సత్యనారాయణ ఇల్లు ఉన్న వీధిలోకి వచ్చి పడ్డారు. మెదళ్లు మొద్దుబారిపోయాయి– అక్కడా అదే దృశ్యం.ఇక్కడ అస్సాం రైఫిల్స్‌ సాయుధులు. అక్కడ మలబార్‌ స్పెషల్‌ పోలీసులు.
కూరలు తరుగుతూ వదిలేసిన గిన్నీ, కత్తిపీట, ఎవరో విసురుకున్న తాటాకు విసినెకర్ర, పక్కనే నీళ్లతో ఉన్న మరచెంబు... అన్నింటినీ బలంకొద్దీ తన్నుతూ రంకెలు వేస్తున్నారు– మలయాళీ ప్రభావంతో, తెలుగులోనే.‘‘మీ రాజు.... శ్రీరామ్రాజు వస్తుంది... తళుపుళు వేస్తారేం? రాండి... చూడ్డానికి రావాళి.... పళ్లూ, పూళూ, తేనె పట్కరావాళ్రా. జేజేలు కొట్టాళి...!’’అక్కడ రెండు నిమిషాలు బీభత్సం సృష్టించి పక్క ఇంటివైపు నడిచారు.ఇక్కడ– రామాలయానికి కొంచెం దగ్గరగా, ఓ ఆర్తనాదం హృదయ విదారకంగా. అది కూడా మహిళ  గొంతు నుంచి.ఆ ఎనిమిది మందిని వదిలాక ఈమెను పట్టుకున్నారు అస్సాం రైఫిల్స్‌ పోలీసులు.ఒకడు ఆమె జుట్టు ఒడిసి పట్టుకుని ముఖంలో ముఖం పెట్టి హిందీలో అడుగుతున్నాడు.‘‘రామమందిరానికా?’’ పూజా సామాగ్రి పెట్టుకున్న పూలసజ్జతోనే రెండు చేతులూ జోడించి నిస్సహాయంగా బావురుమన్నదా  మధ్యవయస్కురాలు. ఆపాదమస్తకం వణికిపోతోంది. ‘‘చుప్‌....! మందిర్‌కేనా?’’ మళ్లీ అరిచాడా సాయుధుడు, జుట్టు మరింత గుంజుతూ. తలూపిందామె, ప్రాణం పోతుందేమోనన్నంత భీతితో. అప్పుడు పూలసజ్జ కేసి చూస్తూ ఆదేశం ఇస్తున్నట్టు అన్నాడు. ‘‘హారతి కర్పూరం మాత్రం వెలిగించకు. మీ దేముడొస్తున్నాడు. వాడికి హారతివ్వాలి.’’ అంతలోనే ఆవేశంతో పెచ్చరిల్లిపోతూ, జుట్టు ఇంకాస్త గట్టిగా బిగించి ఒక రాక్షసానందంతో అన్నాడు, ‘‘మీ రామ్రాజ్‌ వస్తున్నాడు, తెలుసా?!’’
స్పృహ కోల్పోతున్నట్టు కూలిపోయిందామె అక్కడే.
ఆమెను అలాగే వదిలేసి అక్కడికి కొద్దిదూరంలోనే ఉన్న గ్రామ పెద్ద చిటికెల భాస్కరనాయుడిగారింటి వైపు నడిచారంతా. అక్కడ నుంచి మూడు నిమిషాల నడక.అప్పటికే ఆ వీధిలో ఉన్న ఇళ్ల తలుపులన్నీ మూసుకుపోయాయి.ఆగి ఆగి వీస్తోంది వడగాలి. «థక్‌.. థక్‌... థక్‌.. £ý క్‌... ఆ హోరులో బూట్ల అడుగుల సవ్వడి.బాట పక్కగా కొంచెం దిగువన ఉంది భాస్కరనాయుడిగారి ఇల్లు. పెద్ద లోగిలి.ఆ ఇంటి తలుపులు కూడా మూసేసి ఉన్నాయి.చింతపల్లి కానిస్టేబుల్‌ పెద్ద పెద్ద అంగలతో వెళ్లి, చేత్తోనే తలుపు తట్టాడు, అసహనంగా.జవాబు లేదు.ఈసారి లాఠీతో మోదాడు తలుపు మీద. అయినా జవాబు రాలేదు.‘‘భాస్కరనాయుడు! మీరు లోపలే ఉన్నారు. మాకు తెలుసు. తలుపు తీయాలి!’’ అరిచాడు.అప్పుడు తెరుచుకున్నాయి తలుపులు.బయటకొచ్చారు భాస్కరుడుగారు. నుదుటి మీద తిరునామం. పసుపురంగు పంచె కట్టుకొని, తెల్ల చొక్కా మీద కాషాయ ఉత్తరీయం నిండుగా కప్పుకుని ఉన్నారు. నలభయ్‌ సంవత్సరాలుంటాయి.
ఏం జరిగినా భగవదేచ్ఛ అన్న నిర్వికార భావన మొహంలో.అనిష్టంగానే అన్నారాయన, ‘‘నమస్కారం!’’

తలుపు చాటునే నిలబడి భయం భయంగా చూస్తోంది భాస్కరుడిగారి తల్లి సోమమ్మ.కొంచెం తగ్గి అన్నాడు కానిస్టేబులు. ‘‘నమస్కారం. గ్రామపెద్దలు కూడా ఇలా చాటుమాటుగా ఉంటే కష్టం నాయుడుగారు! మీరు దొరతనం వారికి సహకరించాలి. సరే, ఇవాళ మీరు ఇంట్లోనే ఉండంyì ! డిప్యూటీ æతాసీల్దార్‌ మూర్తెన్నపంతులు దొరవారు మీకు చెప్పిరమ్మన్నారు. స్పెషల్‌ కమిషనర్‌ దొరవారు కూడా వస్తున్నారు. పెద్ద దొరవారు కబురెడతారు, మీరు వెంటనే హాజరు కావాలి. మళ్లీ మేం చెప్పేదాకా మీరు అందుబాటులో ఉండాలి. మునసబు లగుడు సత్యనారాయణగారికి కూడా కబురు వెళ్లింది.’’ మత్తు మత్తుగా వస్తున్నా, ఆ గొంతులోని దర్పం భయపెడుతోంది. అందుకే చిన్న గొంతుతో అన్నారు భాస్కరుడు, ‘‘స్పెషల్‌ కమిషనర్‌ దొరవారిని రెండో తేదీనే కలుసుకున్నాను.....మళ్లీ...’’
‘‘ఇప్పుడెందుకంటారా?’’ అందుకుని అన్నాడు కానిస్టేబుల్‌. ‘‘ఎంత అమాయకులండీ తమరు? శ్రీరామరాజుగారొస్తన్నారండీ! తీసుకొస్తన్నారండీ బాబూ! మరి, గ్రామపెద్దలు. తమరు లేకపోతే ఎలాగ?!’’ వంకర నవ్వు నవ్వుతూ ఎగాదిగా చూస్తూ బాటమీదకు వచ్చాడు ఆ కానిస్టేబులు.పోలీసులంతా వెనుదిరిగారు, వేగంగా.వాళ్లు వెళ్లినవైపే చూస్తున్నారు భాస్కరుడు గారు నిర్వికారంగా.‘‘ఏయ్‌ ముసలీ! పాలు తీసుకుపోతున్నావా?! తీస్కపో. ఇంట్లో ఉట్టె మీద భద్రంగా పెట్టు. మీ రాజుగోరు వస్తన్నారు. తాగించుదూ గానీ....’’ చింతపల్లి పోలీసువాడిదే అరుపు, కొంచెం దూరంగా.రెండు నిమిషాల తరువాత ఇంటి వెనుక నుంచి భాస్కరుడిగారికి వరసకు తమ్ముడు– నారాయణమూర్తి, ఇంటి చాకలి గంజేటి నూకాలు వచ్చి నిలబడ్డారు. వాళ్ల ముఖాల నిండా అంతులేని కలవరం.సోమమ్మ కూడా గడప దాటి బయటకొచ్చి, కొడుకు సమీపంగా నిలబడింది మౌనంగా.అదేం గమనించలేదు భాస్కరుడు. అవే అవే ప్రశ్నలు బుర్ర నిండా–‘రామరాజు వస్తున్నాడా? ఎలా?! అరెస్టు చేసి తీసుకువస్తున్నారా?అంటే...దొరికిపోయినట్టేనా?’ఆధ్యాత్మిక చింతన అతడిని ఈ కొండల దగ్గరికి నడిపించుకుంటూ వచ్చింది.అనూహ్యంగా ఆయుధం పట్టి కొండలలోకి వెళ్లిపోయాడు, ఇక్కడ నుంచే.‘దొరికితే ప్రాణాలతో ఉంచుతారా.....?’ అంతకు మించి ఆలోచించలేకపోయారు భాస్కరుడు.అక్కడే ఉన్న పేము కుర్చీలో కూలబడ్డారాయన.ఉదయం నుంచి ఏవేవో సంగతులు వింటున్నా ఒక పోలీసు నోటి నుంచి అదే నేరుగా వినడంతో కాళ్ల కింద భూమి తప్పుకున్నట్టయింది.నారాయణమూర్తి స్తంభాన్ని ఆనుకుని నిలబడ్డాడు. నూకాలు చూరు కిందే చేతులు కట్టుకుని నిలబడి ఉండిపోయాడు.ఇరవై నిమిషాల గడిచిపోయాయి– ఎవరితో ఎవరూ మాట్లాడుకోలేదు. అంతా మౌనం.అక్కడ ఆ ఏడుగురు పోలీసులు ఆ  గుడారాలలో ఒకదానిలోకి వెళ్లారు. లోపల కొందరు పోలీసులు యూనిఫారాలలోనే హడావుడిగా కనిపిస్తున్నారు. కృష్ణదేవిపేట పోలీస్‌ ఠాణా అధిపతి ఫర్బీస్‌ కూడా ఉత్కంఠతో వైర్‌లెస్‌ సెట్‌ ముందే కూర్చుని ఉన్నాడు.రామరాజు అరెస్టయిన సంగతిని ఇప్పటికీ వాళ్లలో చాలామంది నమ్మలేకపోతున్నారు.ఆ గుడారంలోనే ఉంది వైర్‌లెస్‌ సెట్‌. ఆగి ఆగి మోగుతోంది.‘‘హలో– కేడీపేట క్యాంప్‌– ఓవర్‌’, ‘హలో–కేడీపేట క్యాంప్‌ – ఓవర్‌’’ గట్టిగా అన్నాడుఫర్బీస్‌.నాలుగైదు సెకన్ల తరువాత అవతల నుంచి వినిపించింది.‘‘ఎస్‌... హలో.... నర్సీపట్నం హెడ్‌క్వార్టర్స్‌.. ఓవర్‌’’ ఆ కంఠం విశాఖపట్నం డీఎస్‌పీ ట్రేమన్‌హేర్‌ది.‘‘మిస్టర్‌ ట్రేమన్‌హేర్‌ .... నేను, ఫర్బీస్‌..కేడీపేట క్యాంప్‌.... ఓవర్‌.’’‘‘అర్థమైంది. ఆపరేషన్‌ మొత్తం కేడీపేట కేంద్రంగా జరగాలని స్పెషల్‌ కమిషనర్‌ ఆర్డర్‌. ఓవర్‌.’’‘‘అద్భుతం! ఆ రామరాజు కథ ఇక్కడే మొదలైంది. ఇక్కడ నుంచే వాడు కథంతా నడిపాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఎంతమంది ఎలాంటి కథలు, ఎక్కడ మొదలుపెట్టినా వాటికి ముగింపు మనమే ఇస్తాం. కదా!. ఓవర్‌.’’అవతల బిగ్గరగా నవ్వు.‘‘అక్కడే ఉండి సమన్వయం చేసే బాధ్యత మిమ్మల్ని తీసుకోమని చెప్పారు స్పెషల్‌ కమిషనర్‌. ఓవర్‌.’’‘‘ఎస్‌...ఎస్‌.... ఆ పనిలోనే ఉన్నాను. ఓవర్‌.’’ ఉత్సాహంగా చెప్పాడు ఫర్బీస్‌.చిన్న శబ్దంతో వైర్‌లెస్‌ కట్‌ అయింది. వైర్‌లెస్‌ వాడుకలోకి తెచ్చిన మాటే– ‘కేడీపేట’.అరగంట గడిచింది. పోలీసు డేరాలలో హడావుడి విరామం ప్రకటించుకుంది.

స్వచ్ఛంద నిషేధాజ్ఞలని ప్రకటించుకుందేమోనన్నంత నిశ్శబ్దం ఊరంతా.ఇక్కడ– పదిహేను నిమిషాల తరువాత ఇక్కడ భాస్కరుడు గారి ఇంటి లోగిలిలోకి ఒక్కరొక్కరే రావడం మొదలుపెట్టారు, భయం భయంగానే. నరాలను పిండేస్తున్న ఉత్కంఠ ఇళ్లల్లో ఉండనివ్వడం లేదు.
అంతా మౌనం.ఆ మౌనాన్ని భరించే శక్తి ఇక లేదన్నట్టు నోరు విప్పి, చిన్న గొంతుతోనే అంది సోమమ్మ,‘‘ఎక్కడో పుట్టాడు మారాజు! ఇంత దేశం ఉండగా ఇక్కడకే ఎందుకొచ్చాడో?! అసలు ఈ ఇంటికే ఎందుకు పంపాడో మానాయన్ని– ఆ భగవంతుడు!? ఇప్పుడు ఈ అల్లరేంటో? అంతా లీల...!’’ డగ్గుత్తికతో అంటూనే లోపలికి వెళ్లిపోయిందామె.రాజుకున్న అడవిలా, ఆ క్షణంలో ఆ ఊరి హృదయం జ్ఞాపకాలతో దహించుకుపోకుండా ఉండడం ఎలా?

ఆధ్యాత్మిక చింతన అతడిని ఈ కొండల దగ్గరికి నడిపించుకుంటూ వచ్చింది. అనూహ్యంగా ఆయుధం పట్టి కొండలలోకి వెళ్లిపోయాడు, ఇక్కడ నుంచే. ‘దొరికితే ప్రాణాలతో ఉంచుతారా.....?’ అంతకు మించి ఆలోచించలేకపోయారు భాస్కరుడు.  అక్కడే ఉన్న పేము కుర్చీలో కూలబడ్డారాయన. ఉదయం నుంచి ఏవేవో సంగతులు వింటున్నా ఒక పోలీసు నోటి నుంచి అదే నేరుగా వినడంతో కాళ్ల కింద భూమి తప్పుకున్నట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement