బాహుబలి - భళిరా భళి | Super Hit Prabhas's Baahubali Movie | Sakshi
Sakshi News home page

బాహుబలి - భళిరా భళి

Published Sat, Jul 25 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

బాహుబలి - భళిరా భళి

బాహుబలి - భళిరా భళి

చిన్నప్పుడు ఎన్.టి.ఆర్., కాంతారావు కత్తి (లాంటి) సిన్మాలు నేల క్లాస్‌లో కూచుని, కళ్లు, నోరు తెరుచుకొని మరీ తెగ చూసే వాణ్ని. ఓ సిన్మాలో యుద్ధం సీనులో ఓ సైనికుడి చేతికి రిస్ట్‌వాచ్ కనపడితే, మా బాబాయిని అడిగాను. ‘నువ్విచ్చే అర్ధ రూపాయకి వాచ్ కాక బంగారు కంకణం కనపడుద్దేటిరా... మూసుకుని వాచ్‌ని చూడకుండా సినిమా వాచ్ చేయరా డింభకా’ అని క్లాస్ పీకాడు.
 
 కొంచెం పెద్దయినాక (బుర్ర కాదు - బాడీనే) - ‘దాన వీర శూర కర్ణ’లో తుమ్మెదలు ఎగురుతుంటే - వాటిని ఊపుతూ దారాలు కనపడితే, మళ్లీ అమాంతంగా బాధపడిపోయి - ఆ సిన్మా ‘దాన వీర శూర కర్ణ’లే అని నాకు నేనే సముదాయించుకుని సెలైంట్ అయి పోయాను. అదృష్టం - అప్పుడు బాబాయి లేడు.  గుంటూరు మెడికల్ కాలేజీ రోజుల్లో - వచ్చిన ప్రతి కమలహాసన్ సిన్మానీ నేనింకో కమల్‌లా ఫీల్ అయి, నాకూ, నా చుట్టూ ఉన్న అమ్మాయిలకీ టికెట్ సంపాదించడానికి చొక్కా చింపుకుని, ఆ తర్వాత ఏసీ లేని హాల్‌లో చొక్కా పిండుకొని - మొదటాట చూసిన రోజులు ఇంకా గుర్తే! కాకపోతే ఇప్పుడు మొదటాట చూడ్డంలో ఆ థ్రిల్ ఏదీ - చింపుకోకుండా, చంపుకోకుండా టికెట్స్ ఇంటికే పంపుతున్నారు కదా.

 అందుకనే బాహుబలి మొదటాట చూడలేదు. మొన్న ఆదివారం, రమారాజమౌళి నాకోసం, మా సన్‌షైన్ హాస్పిటల్ కోసం స్పెషల్ షో వేసింది. ‘అబ్బో మీరేమన్నా మహేష్‌బాబా పవన్‌కల్యాణా స్పెషల్ షో వేయడానికి’ అని మీరంతా తెగ అనుమానపడుతున్నారని తెలుసు నాకు. రమ నాకు స్వయానా బంధువు, వరుసకు చెల్లి. ఇంకా అనుమానించి నన్ను అవమానించొద్దు.
 
 మళ్లీ ఇన్నాళ్టికి, కళ్లూ నోరూ తెరుచుకుని చూసిన సిన్మా ఇది. సిన్మా కాదండీ బాబు - కళాఖండం. అయ్య బాబోయ్ - కాదండీ - కళాభాండం. కాదు కాదండీ బాబు కళా బ్రహ్మాండం. ‘ఆ! బంధువుల సిన్మాను ఆ మాత్రం పొగడకపోతే - నెక్స్‌ట్ సిన్మాకి స్పెషల్ షో ఉండదు కదా - అందుకనే ఈ సీను’ నుకుంటున్నారని మళ్లీ తెలుసు నాకు. ఒట్టు - నిజంగా చెప్తున్నాను.చందమామ, అమరచిత్ర కథలు చదివిన ప్రతివాడికీ ఈ సిన్మా ఎన్నోసార్లు బుర్రలో స్క్రీన్ అయ్యే ఉంటుంది. నా క్లాస్‌మేట్ సుగుణ అన్నట్లు - ‘చిన్నప్పుడు కథలు వినేవాళ్లం... కలలో రాజకుమారి కనబడితే - హీరో కొండలెక్కి, గుట్టలెక్కి సముద్రాలు దాటి వెళ్లి రాజకుమారిని కలిసేవాడని - అలానే ఉంది ఈ సిన్మాలో.
 
  బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో, ఆరు బయట చెట్లకింద క్లాసుల్లో... ‘కాళిదాసు కవిత్వం కొంత - ఆపైన నా పైత్యం మరికొంత’ అన్న టైప్‌లో వారాలు తరబడి సీరియల్ కథలు చెప్పిన నాకు మరీ బాగుంది ఈ సిన్మా.ఆ జలపాతాలు చాలు. అవి నిజమా, గ్రాఫిక్సా నాకక్కర్లేదు. మూడు గంటలు చూపించినా బాగుండు అనిపించింది. ఆ తీరు, జోరు, హోరు - గుండెల్లో జలపాతాల్ని సృష్టించింది. హీరో ఈ పక్క క్లిఫ్ మీద, హీరోయిన్ ఆ పక్క క్లిఫ్ మీద, ఆమెని చేరుకోవడానికి గాలిలో తేలిన వైనం - అద్భుతం. అంతకుముందు అదే విన్యాసంలో ఫెయిల్ అయ్యి - ఇప్పుడు అందమైన అమ్మాయి ప్రేమలో పడి, ఎక్స్‌ట్రా ఎనర్జీతో అవతలికి చేరుకున్న షాట్ - రాజమౌళి రసికతకు ఓ మచ్చు తునక.
 
 రాజమౌళికి క్రోధరసం మీద ఉన్న పట్టు, పనికట్టు శృంగార రసంలో లేదన్న నా అభిప్రాయం మారిపోయింది ఈసారి (నా అనుమానం నా సోదరి రమ డెరైక్ట్ చేసి ఉంటుంది ఈ సీన్). ‘నీకంత సీనులేదు బాబూ’ అని జోక్‌లు వేస్తుండటం మనకు పరిపాటి. ఆ మాట ఎవర్నయినా అనొచ్చేమో కానీ, రాజమౌళిని అనటం కుదరదు. తనకున్నదంతా సీనే. రమ్యకృష్ణ ఒక చేతిలో బిడ్డని సముదాయించడం, మరో చేత్తో కత్తితో తిరుగుబాటుదారుడి పీక కోసేయడం లాంటి సీన్, రాజమౌళికి సీనుందని చెప్పడానికి ఓ ఉదాహరణ.
 
 కానీ నెక్స్‌ట్ సీన్‌లో - రమ్యకృష్ణ రాజప్రాసాదంలో అందరిముందే - ఇద్దరి పిల్లలకీ పాలివ్వడం కొంచెం ఓవర్ అనిపించిందనుకోండి. బహుశా ఈ సీను అరవ తల్లుల కోసం సీనాడేమో!కట్టప్ప మోకాళ్ల మీద స్లైడ్ అయ్యి, ప్రభాస్ కాలు తనమీద పెట్టుకునే సీన్ అద్భుతహ. కాకపోతే  మోకాళ్లు దెబ్బతినకుండా,  ఆ సీన్ ఎలా తీశాడా అని - నాలోని మోకాళ్ల డాక్టరు చాలా కంగారుపడి పోయాడనుకోండి. కనీసం షూటింగ్ తర్వాతన్నా కట్టప్ప మోకాలిని ఈ సదరు గురవప్పకి చూపించి - ఆ తర్వాత టైటిల్స్‌లో - ‘మోకాలు సీన్‌కి సహకరించిన డా॥గురవారెడ్డి గారికి మోకాలు దండాలు’ అని వేసి ఉంటే అదిరిపోయే పబ్లిసిటీ వచ్చి, నా పేరు కూడా బాహుబలితో పాటు చరిత్ర పుటల్లో నిలిచిపోయేది కదా!
 
 (అన్నట్లు మగధీర టైటిల్స్‌లో రాజమౌళి ప్రేమగా నా పేరు వేశాడండోయ్ - పబ్లిసిటీ ఏమో కానీ - ఇన్‌కమ్ ట్యాక్స్‌వాళ్లు వచ్చారు మర్నాడే)కొంతమంది తెగులోళ్లు (సారీ తెలుగోళ్లు) ‘ఆ - కథేముందండీ’ అని ఒకడు, ‘పవర్‌ఫుల్ డైలాగులు ఏవండీ’ అని ఇంకోడు, ‘ఇదే హాలీవుడ్ అయితేనా?’ అని మరొకడు నసిగారు. వీళ్లంతా ఓ అరడజను బ్లాక్‌బస్టర్ సిన్మాలు తీసి పండిపోయి, ఎండిపోయిన వాళ్లయి ఉంటారేమో!c ‘అడ్డంగా నరికేస్తా - నిలువుగా పాతేస్తా’ లాంటి మాస్ డైలాగులు లేకుండా ‘వంద మందిని చంపితే వీరుడవుతాడు - ఒకడ్ని బ్రతికిస్తే దేవుడవుతాడు’, ‘నేను బ్రతికి కూడా చచ్చిపోయాను - నువ్వు చనిపోయి ప్రజల గుండెల్లో బ్రతికున్నావయ్యా’ లాంటి మర్మగర్భమైన డైలాగులు సినిమాని కల్ట్ స్టేటస్‌కి ఎలివేట్ చేశాయి.
 
 యుద్ధం సీన్లు నభూతో నభవిష్యత్. హాలీవుడ్‌వాళ్లు - మనోడి దగ్గర నేర్చుకోవాల్సిందే. రాణా గద చూసి స్వర్గంలో భీముడు కొంచెం ఫీల్ అయి ఉంటాడు - మా రోజుల్లో రాజమౌళి లేడే అని. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సిన్మాని ఎక్కడికో తీసుకెళ్లింది. పాటలు ఆడియోలో కంటే సిన్మాలో బాగా ఒదిగిపోయాయ నిపించింది. సెంథిల్ ఫొటోగ్రఫీ కనులపండుగ. అన్నట్లు మర్చిపోయాను - ‘అంత రాచరికం బ్యాక్‌డ్రాప్‌లో రవీంద్ర భారతిలో రోజూ చూసే భరతనాట్యాలు పెట్టావేంటయ్యా’. ఇంకా నయం - ఓ మూల నా పవన్ కల్యాణ్ డ్యాన్స్ కూడా పెట్టలేదు.
 
 నా ఫ్రెండ్ డా॥చందు శైలజ అని అద్భుతమైన సెటైర్ బ్లాగ్స్ రాస్తుంది. ఆమె రాసిన చక్కటి ముగింపు మాటలని నా మాటలుగా సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా కొట్టేసి రాస్తున్నాను.‘‘మూడేళ్లు మన ఊహకందనంతగా శ్రమించి తీసిన సిన్మాకు మూడు, మూడుం పాతిక అంటూ ముష్టివేసే టైప్‌లో రేటింగ్ ఇవ్వటం మహాపాపం. కొన్నింటికి రేటింగులు ఉండవు. త్రివిక్రమ్ స్టైల్‌లో చెప్పాలంటే అమ్మ చేసిన వంటకు, నాన్న పడిన శ్రమకు, తోబుట్టువుల అభిమానానికి రేటింగ్ ఇవ్వలేం. అలాగే ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వకూడదని నా అభిప్రాయం.’’ - రాజమౌళీ - భళిరా భళీ... ప్రతి తెలుగోడి గర్వం, గౌరవం నువ్వే!    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement