మీడియం ఏదైనా అర్హులే! | Any medium-deserved! | Sakshi
Sakshi News home page

మీడియం ఏదైనా అర్హులే!

Published Mon, Feb 6 2017 3:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

మీడియం ఏదైనా అర్హులే! - Sakshi

  • గురుకుల టీచర్‌ పోస్టుల నిబంధనలపై సర్కారు కసరత్తు
  • రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో ఏడు వేలకుపైగా గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేయనున్న నోటిఫికేషన్‌లో పొందుపరచాల్సిన నిబంధనలపై టీఎస్‌పీఎస్సీ, సంక్షేమశాఖలు కసరత్తు చేస్తున్నాయి. విద్యార్హతల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇంగ్లిషు మీడియం పాఠశాలలు అయినందున ఆంగ్ల మాధ్యమంలోనే చదివి ఉండాలన్న నిబంధన ఉంటుందా అనే ఆందోళన అనేక మంది అభ్యర్థుల్లో నెలకొన్న నేపథ్యంలో మీడియం విషయంలో ఆంక్షల్లేకుండా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.

    ఇంటర్మీడియెట్‌ డిగ్రీ, పీజీ, బీఎడ్‌ వంటి కోర్సులను ఇంగ్లిష్‌ మీడియంలో చదివినా, తెలుగు మీడియంలో చదివినా పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇంగ్లిష్‌ మీడియం మోడల్‌ స్కూళ్లలో టీచర్‌ పోస్టులకు ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివి ఉండాలన్న నిబంధనను పొందుపరిచిన విషయంలో సుప్రీంకోర్టు తప్పు పట్టింది.

    మీడియంతో సంబంధం లేకుండా అర్హతలు ఉన్నాయో లేదో చూడాలని, కావాలంటే వారు ఇంగ్లిష్‌లో బోధించగలుగుతారో లేదో తెలుసుకునేందుకు పరీక్ష పెట్టుకోవాలని సూచించింది. అప్పట్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినందున తెలుగు మీడియం వారిని ఆ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురుకుల టీచర్‌ పోస్టులకు కూడా మీడియంను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణీత అర్హతలు ఉన్నాయా లేదా అన్నదే చూడాలన్న నిర్ణయానికి టీఎస్‌పీఎస్సీ వచ్చినట్లు సమాచారం. దీనికితోడు ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలను పరీక్షించేందుకు పరీక్ష విధానంలో ఇంగ్లిష్‌ భాషకు సంబంధించిన ప్రశ్నలు అడిగేలా చర్యలు చేపట్టింది.

    అయితే ఈ పోస్టుల  భర్తీకి నిర్వహించే పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిష్‌లోనే ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. పాఠశాలల్లోకి వెళ్లి ఆంగ్లంలో బోధించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంలోనే ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో టెట్, దాని వెయిటేజీని కొనసాగించే దిశగానే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. దీనిపై రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement