
పురుగులున్న సెలైన్ ఎక్కించేశారు
► పురుగులున్న సెలైన్ బాటిల్
► ఆరేళ్ల పాపకు ఎక్కించేశారు
► గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఆరేళ్ల బాలిక పాలిట శాపమైంది. పురుగుల అవశేషాలు ఉన్న సెలైన్ బాటిల్‌ను ఎక్కించడంతో ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆస్పత్రి సిబ్బంది కనీసం సెలైన్ బాటిల్‌ను పరిశీలించకుండానే ఎక్కించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు బిక్షపతి, సుమలతతో పాటు బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు పురుగుల అవశేషాలున్న సెలైన్ బాటిల్‌ను పరీక్షలకు పంపారు. మిగిలిన వాటిని సీజ్ చేశారు. గాంధీలో వెలుగు చూసిన ఘటనతో ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, సహా ఇతర ఆస్పత్రుల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి స్టోర్‌రూమ్‌లో ఫంగస్, బ్యాక్టీరియా ఉన్న వాటిని గుర్తించి, వినియోగానికి దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆయా ఆస్పత్రులు సిబ్బంది అదే పనిలో నిమగ్నమయ్యారు.
పరిశీలించకుండానే రోగికి సరఫరా
జనగాం జిల్లా కొడకల్ మండలం మైదం చెరువుతండాకు చెందిన సాయి ప్రవళిక (6)గత కొంతకాలంగా మెదడుకు సంబంధించిన ‘న్యూరోనల్ సెరాయిడ్ లిపో ఫ్యూసినోసిస్’అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. చికిత్సలో భాగంగా పలుమార్లు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఈమె ఈ నెల 7న పీడియాట్రిక్ విభాగంలో చేరింది. గురువారం ఉదయం డెక్స్‌ట్రోస్ 10 శాతం (500 ఎంఎల్)ఐవీ ఫ్లూయిడ్ బ్యాటిల్‌ను ఏర్పాటు చేశారు. అర్ధగంట తర్వాత బాలిక శరీరం రంగు మారడంతో పాటు ప్రాణాపాయస్థితికి చేరుకుంది. సెలైన్ బాటిల్ తీసి చూడగా అందులో పురుగుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి డ్రగ్‌స్టోర్‌లోని సిబ్బంది, వార్డులోని నర్సులు కూడా బాటిల్‌ను పరిశీలించకపోవడం విశేషం. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఫంగస్ ఉన్న సెలైన్ వల్ల 13 మంది కళ్లు పోయిన ఘటనను మరిచిపోకముందే మళ్లీ అలాంటి దారుణమే గాంధీలో బయటపడటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాకు సంబంధం లేదు: టీఎస్‌ఎంఐడీసీ
పురుగుల అవశేషాలు బయటపడిన డెక్స్‌ట్రోస్ ఐవీ ప్లూయిడ్ బాటిళ్లను మాత్రం తాము సరఫరా చేయలేదని, వీటితో మాకు ఎలాంటి సంబంధం లేదని టీఎస్‌ఎంఐడీసీ ఎండీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఎంపిక చేసే కొనుగోలు చేశాంః డాక్టర్ జేవీరెడ్డి, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి
రోగులకు అవసరమైన అన్ని మందులూ టీఎస్‌ఎంఐడీసీ సరఫరా చేయడం లేదు. కొన్ని అత్యవసర మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. ఇదే తరహాలో పుణేకు చెందిన ప్రెసినియస్‌కాబి కంపెనీకి చెందిన డెక్స్‌ట్రోస్ 10 శాతం(500 ఎంల్)సెలైన్ బాటిళ్లు కొనుగోలు చేశాం. బాటిల్లో పురుగుల అవశేషాలు బయటపడిన అంశంపై విచారణకు ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాదు ఆస్పత్రి స్టోర్ రూమ్‌లోని(బ్యాచ్ నంబర్ 82కేఈ107602)ఫ్లూయిడ్ బ్యాటిళ్లను పక్కకు పెట్టాం. బాలికకు ఎక్కించిన ఫ్లూయిడ్‌తో పాటు ఇతర బాటిళ్లను కూడా పరీక్షలకు పంపాం.
గాంధీలో ఆందోళనకు దిగిన బాలిక బంధువులు
ప్రవళికకు చికిత్స అందించే విషయంలో ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోగి తరపు బంధువులు ఆరోపించారు. తక్షణమే సెలైన్ బ్యాటిళ్లను తయారు చేసిన సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.