బంజారాహిల్స్ : తన భార్యను తనకు అప్పగించాలని అడిగినందుకు మద్యం సీసాతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరాంనగర్‌లో నివసించే సబీల్(23) చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. అయిదేళ్ల క్రితం రేష్మతో పెళ్లయింది. ఒక కూతురు కూడా ఉంది. అయితే ఏడాది క్రితం విజయవాడకు చెందిన రెడ్డినాయుడు(23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి విజయవాడకు వెళ్లి పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టారు. తన భార్యను అప్పగించాల్సిందిగా సబీల్ ఎన్నోసార్లు రెడ్డినాయుడును వేడుకున్నాడు.
కనీసం కన్నకూతురు చూడటానికైనా అంగీకరించాలని విజ్ఞప్తి చేశాడు. అయినాసరే నాయుడు, రేష్మ ఇద్దరూ ఒప్పుకోలేదు. సోమవారం రాత్రి శ్రీరాంనగర్‌లో తన అత్త ఇంట్లో ఉంటున్న కూతురిని చూసేందుకు సబీల్ వెళ్లగా అక్కడే నాయుడు మద్యం తాగుతూ ఉన్నాడు. ఒక్కసారిగా సబీల్‌ను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యను అప్పగించాల్సిందిగా సబీల్ కోరగా తాగుతున్న మద్యం బాటిల్‌తో తలపై బలంగా మోదాడు. దీంతో సబీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు.
భార్యను తనతో పంపాలని అడిగితే..
Published Tue, Apr 5 2016 6:59 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement