పోలీసుల అదుపులో ఆర్కే? | maoist leader rk is in police custody, should be produced in court, demands varavara rao | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఆర్కే?

Published Thu, Oct 27 2016 3:20 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

పోలీసుల అదుపులో ఆర్కే? - Sakshi

పోలీసుల అదుపులో ఆర్కే?

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఆంధ్రా ఒడిషా సరిహద్దులలోని మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ సందర్భంగానే ఆర్కే సహా పలువురు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విరసం నాయకుడు వరవరరావు ఆరోపించారు. వాళ్లందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేకు ఏం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ డెమొక్రాటిక్ ఫోరం కన్వీనర్లు ప్రొఫెసర్ హరగోపాల్, పీఎపల్ విశ్వేశ్వరరావు, జైని మాలయ్య, జస్టిస్ చంద్రకుమార్, చిక్కుడు ప్రభాకర్, బండి దుర్గాప్రసాద్, బళ్ల రవీందర్, కోట శ్రీనివాస్ తదితరులు కూడా ఆర్కేను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.  అయితే.. ఆర్కే తమ అదుపులో లేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఇంతకుముందు చెప్పారు.
 
ఎన్‌కౌంటర్ నుంచి ఆర్కే, గాజర్ల రవి తదితరులు తప్పించుకున్నారని తొలుత కథనాలు వచ్చాయి. ప్రధానంగా ఆర్కేనే టార్గెట్ చేసి ఈ ఎన్‌కౌంటర్ ప్లాన్ చేసినా, చివరి నిమిషంలో ఆయన అక్కడినుంచి సురక్షితంగా వెళ్లిపోయారని అన్నారు. కానీ ఇప్పుడు ఆర్కే ఆచూకీ తెలియకపోవడం.. మృతదేహాల్లో కూడా అగ్రనాయకులు ఎవరివీ లేకపోవడంతో.. ఆర్కే తదితరులు పోలీసుల అదుపులోనే ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ప్రభుత్వం జరిపిన చర్చలకు మావోయిస్టుల ప్రతినిధిగా కూడా ఆర్కే హాజరైన విషయం తెలిసిందే. ఏఓబీ ప్రాంతంలోనే ఆర్కే తిరుగుతున్నారన్న పక్కా సమాచారం ఉండటం వల్లే ఈ ఎన్‌కౌంటర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆర్కే ఆచూకీ తెలియకపోవడంతో విప్లవ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement