కేటీఆర్ చేతికి మున్సిపల్ శాఖ..
హైదరాబాద్: ఇప్పటికే రెండు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తోన్న కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు మరో శాఖను అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తూ కేటీఆర్ నగర ప్రజల అభిమానాన్ని చురగొన్నాడని, గ్రేటర్ అభివృద్ధి దృష్ట్యా కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖ కేటాయిస్తానని శనివారం పెరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో సీఎం పేర్కొన్నారు. 'నా కొడుకు కేటీ రామారావు గ్రేటర్ లో ఒక్కతీరుగ తిరుగుతున్నడు. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. నగర అభివృద్ధిలో మున్సిపల్ శాఖది కీలక పాత్ర. ప్రస్తుతం నా దగ్గరే ఉన్న మున్సిపల్ శాఖను కేటీఆర్ కు అప్పజెప్పుతా' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి మినహా 17 మంది సభ్యులున్న తెలంగాణ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీలు డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎస్సీ , మైనారిటీల అభివృద్ధి శాఖతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, బొగ్గు, సాధారణ పరిపాలన శాఖలను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. మిగిలిన మంత్రుల్లో రెండు అంతకంటే ఎక్కువ విభిన్న శాఖలు నిర్వహిస్తోన్న మంత్రుల సంఖ్య 10.
కేటీఆర్- పంచాయితీరాజ్, ఐటీ
హరీశ్ రావు- నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖలు
నాయిని నర్సింహారెడ్డి- హోమ్, కార్మిక శాఖలు
జూపల్లి కృష్ణారావు- భారీ పరిశ్రమలు, చక్కెర, చేనేత శాఖలు
ఇంద్రకణ్ రెడ్డి- న్యాయ, దేవాదాయ శాఖలు
జోగు రామన్న- అటవీ, బీసీ సంక్షేమం
పద్మారావు- ఎక్సైజ్, యువజన సర్వీసులు
తుమ్మల నాగేశ్వర్ రావు- రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మహిళా శిశు సంక్షేమశాఖలు
తలసాని- వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ
అజ్మీరా చందూలాల్- పర్యాటకం, గిరిజన సంక్షేమశాఖలు