మంత్రుల శాఖల మార్పులు | Telangana ministers departments going to be change | Sakshi
Sakshi News home page

మంత్రుల శాఖల మార్పులు

Published Mon, Apr 25 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

మంత్రుల శాఖల మార్పులు

మంత్రుల శాఖల మార్పులు

తుది కసరత్తు పూర్తి చేసిన సీఎం కేసీఆర్
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్‌లో మార్పుచేర్పులకు రంగం సిద్ధమైంది! పలువురు మంత్రుల శాఖల మార్పుపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం తుది కసరత్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ.. కేవలం నాలుగు శాఖల మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా మిషన్ భగీరథకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి సారథ్యం వహించనున్నారు.

రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని అయిదేళ్లలో పూర్తి చేస్తామని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని సీఎం పలుమార్లు ఉద్ఘాటించారు. అందుకే ఈ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘తాగునీటి సరఫరా శాఖ‘ను ఏర్పాటు చేసి సారథ్యం వహించాలని సీఎం భావిస్తున్నారు. దీంతోపాటు వాణిజ్య పన్నుల శాఖను తన వద్ద ఉంచుకోవాలని యోచిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజల అంచనాలకు అనుగుణంగా ఆదాయ వనరులను సమకూర్చడం కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఏకంగా రూ.1.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో వాణిజ్య పన్నుల శాఖ అత్యధిక ఆదాయం తెచ్చి పెడుతుందని అంచనాలు వేశారు.

దీంతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో పాటు పన్ను వసూళ్లలో లొసుగులకు అడ్డుకట్ట వేయడం, పాత బకాయిలను రాబట్టడంతో మరింత మెరుగైన విధానాలను అనుసరించాల్సిన అవసరముందని సీఎం యోచిస్తున్నారు. అందుకే వాణిజ్య పన్నుల శాఖను సీఎం స్వయంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ శాఖకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన దగ్గరున్న సినిమాటోగ్రఫీ శాఖను యథాతథంగా ఉంచాలని, అదే సమయంలో బీసీ వర్గాలతో ఆయనకున్న అనుబంధాన్ని వినియోగించుకునేందుకు అదనంగా బీసీ సంక్షేమ శాఖను అప్పగించే ప్రతిపాదనను సీఎం పరిశీలనలో ఉంది.

కేటీఆర్ వద్ద కీలక శాఖలు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు మున్సిపల్, ఐటీ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు కొత్తగా పరిశ్రమల శాఖను కట్టబెట్టాలని సీఎం నిర్ణయించారు. పరిశ్రమలు, ఐటీ శాఖలు పట్టణాలు, నగరాల అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాలు కావటంతో ఇవన్నీ ఒకే మంత్రి దగ్గర ఉంచితే సత్ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖకు జూపల్లి కృష్ణారావు సారథ్యం వహిస్తున్నారు. తాజా మార్పుల్లో మంత్రి కేటీఆర్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లికి అప్పగించనున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన నాయకుడు కావటం, గ్రామాలపై పట్టు ఉండటంతో పరిశ్రమలకు బదులుగా ఈ శాఖను జూపల్లికి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement