హైదరాబాద్‌లో ఎందుకు వద్దన్నారు?
ఆంధ్రప్రదేశ్ కోటాలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్‌లో జరపొద్దని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ఎందుకు కోరినట్టు? రాజ్యసభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ కార్యదర్శి ఆ రకంగా నిర్ణయానికి రావడానికి కారణాలేంటి.. అధికార టీడీపీ ఒత్తిళ్లకు లొంగే ఆయన ఆ నిర్ణయానికి వచ్చారా?
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత మే నెల 12న షెడ్యూలు ప్రకటించింది. అందుకు సంబంధించి 24న నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఏపీ అసెంబ్లీకి ఇంచార్జి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఒక లేఖ రాశారు. రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్‌లో కాకుండా విజయవాడలో నిర్వహించాలని అందులో కోరారు.
అయితే ఆయన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆయన చెప్పిన కారణాలేవీ సహేతుకంగా లేవని తేల్చిచెప్పింది. ఇంతకు ఆయన చెప్పిన కారణాలేంటంటే... హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లోగానీ ఇతరత్రా అంశాల్లోగానీ తెలంగాణ ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని, ఆ కారణంగా ఎన్నికలను విజయవాడ కేంద్రంగా జరపాలన్నారు. విచిత్రమేమంటే... రాజ్యసభ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా శాంతి భద్రతల అంశం ఉత్పన్నం కాదు. అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు వినియోగించుకుంటారు. పైగా రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. శాసనసభ పరిధి మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. శాంతి భద్రతలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ అంతా ఏపీ ప్రభుత్వాధికారుల ఆధ్వర్యంలోనే ఉంటుంది.
అమరావతిలో కనీస సదుపాయాలు కూడా లేవని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అక్కడ ఏదైనా హోటల్లో లేదా మరేదైనా ప్రాంతంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకోవాలని ఒకసారి ప్రయత్నం చేసి విఫలమైన విషయమూ తెలిసిందే. వీటన్నింటికి తోడు... హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే ఇరు రాష్ట్రాల గవర్నర్ ఇక్కడే కొలువై ఉన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు కూడా అదే సమయంలో ఎన్నికలు జరుగుతున్నందున శాసనసభ పరిధిలో అధికార పార్టీలు జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అంతా కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం నడుచుకోవలసిందే. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే అసెంబ్లీ కార్యదర్శికి వాటి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడానికి కావలసినన్ని అధికారాలూ ఉంటాయి.
సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు వాటిని పరిశీలించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. కానీ రాజ్యసభ ఎన్నికల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. కనీసం ఆ ఛాయలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి అత్యంత రహస్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అది కూడా ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే కాకుండా నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత లేఖ రాశారు. అందులోని ఆంతర్యమేంటో చూస్తే దిమ్మతిరిగిపోతుంది.
ఓటుకు కోట్లే కారణమా...
సరిగ్గా ఏడాది కిందట తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. శాసనసభ్యుల కోటాలో జరిగిన ఆ ఎన్నికల్లో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎర చూపిన వైనం, 50 లక్షల రూపాయల నోట్లకట్టల బ్యాగుతో కెమెరాకు చిక్కిన ఘటన, ఆ వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపులు బయటకు పొక్కి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని చంద్రబాబు గానీ అధికార టీడీపీ నేతలు గానీ భయపడ్డారా? కొంతకాలంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 నుంచి 30 కోట్ల ఎరచూపి కొనుగోలు చేస్తున్నారని విమర్శలున్నాయి. అలా ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని ఓడించడానికి బలం లేకపోయినా చంద్రబాబు నాలుగో అభ్యర్థిని పోటీలోకి దింపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
విజయసాయి రెడ్డిని ఓడించి టీడీపీ నిలబెట్టే నాలుగో అభ్యర్థి గెలుపొందాలంటే మరో 19 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి. నయానో భయానో ఏదో రకంగా 19 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. ఒకటి కాదు రెండు కాదు... 19 మంది మద్దతు కూడగట్టడానికి రూ. 200 కోట్ల వరకు వెచ్చించే స్థాయి ఉన్న నెల్లూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తను బరిలోకి దింపి వ్యవహారం నడిపించాలన్న ప్రయత్నాలు జరిగినట్టు టీడీపీ నేతలే చెప్పుకొన్నారు.
హైదరాబాద్‌లో సాధ్యపడదనే...
ఇంతటి భారీ కొనుగోలు వ్యవహారం, రహస్య లావాదేవీలు, బెదిరింపు రాజకీయాలు హైదరాబాద్‌లో సాధ్యపడుతాయా అన్నది పక్కన పెడితే... ఏడాది కింద జరిగిన ఓటుకు నోటులో అడ్డంగా దొరికిపోయిన వైనం ఒక్కటే ఎన్నికల వేదికను విజయవాడకు మార్చడానికి పురికొల్పిందని రాజకీయాల్లో తలపండిన నేతలంతా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తమ చేతులకు మరకలు అంటొద్దని వ్యూహాత్మకంగా చంద్రబాబు అసెంబ్లీ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి ఆయన ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా కార్యదర్శి ఆ పని చేసి ఉండరన్న సంగతిని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి.. ఒక పార్టీకి ప్రయోజనం కలిగించే నిర్ణయాలు చేయొచ్చా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ కార్యదర్శి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించడంతో విజయసాయి రెడ్డిని ఓడించడానికి అప్పటివరకు విజయవాడ కేంద్రంగా సాగిన కుట్రకు ఒక రకంగా బ్రేక్ పడినట్టయింది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు 31తో ముగిసిపోతోందనగా.. 29న మహానాడు ముగిసిన తర్వాత తిరుపతిలో, 30న విజయవాడలో చంద్రబాబు పార్టీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేసి నాలుగో అభ్యర్థిని పోటీ దించాలని నిర్ణయించారు.
ఎన్నికల నిర్వహణను విజయవాడకు మార్చడానికి వీలులేదని సరిగ్గా 30వ తేదీ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాయడంతో మొత్తం కుట్రకు బ్రేక్ పడినట్టయింది. సరిగ్గా ఆ సమయానికి నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై చంద్రబాబు నాయుడు విజయవాడలో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉన్నారు. ఆ సమావేశంలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన లేఖ విషయాన్ని అసెంబ్లీ అధికారులు తెలియజేయడంతో ఇక చంద్రబాబు చేసేది లేక... మీరంతా హైదరాబాద్ వెళ్లండి... రేపు మాట్లాడుదాం... అంటూ ఆ సమావేశాన్ని వాయిదా వేశారని ఒక సీనియర్ నేత వివరించారు.