భగ్గుమన్న కశ్మీరం | 11 people died in the kashmir | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న కశ్మీరం

Published Sun, Jul 10 2016 3:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

భగ్గుమన్న కశ్మీరం - Sakshi

భగ్గుమన్న కశ్మీరం

బుర్హాన్ ఎన్‌కౌంటర్‌పై నిరసనలో హింస.. 11 మంది మృతి..
 
 శ్రీనగర్ : కశ్మీర్ లోయ మళ్లీ భగ్గుమంది. హిజ్బుల్ ముజాహిదీన్ కీలకనేత బుర్హాన్ ముజఫర్ వనీని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేయటాన్ని నిరసిస్తూ.. కశ్మీరీ యువకులు ఆందోళనకు దిగటంతో లోయ హింసాత్మకంగా మారింది. కశ్మీర్‌లో పలుచోట్ల చెలరేగిన ఘర్షణలో 11 మంది ఆందోళనకారులు మరణించగా.. 126 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 96 మంది భద్రతా బలగాలు, పోలీసులే. ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో లోయలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో మొబైల్ సేవలనూ ఆపేశారు. తాజా పరిణామాలతో అమర్‌నాథ్ యాత్రను జమ్మూ బేస్ క్యాంపు వద్దే ఆపేశారు.బుర్హాన్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా పుల్వామా జిల్లాలోని పోలీసు ఔట్‌పోస్టుపై దాడికి ఉగ్రవాదులు యత్నించగా భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.

 వనీ అంత్యక్రియలకు భారీగా జనం
 మరోవైపు, కశ్మీర్ లోయలోని త్రాల్ పట్టణంలో జరిగిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో యువత హాజరయ్యారు. 40వేల మందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొందరు యువకులు పాకిస్తాన్ జెండాలు పట్టుకున్నారు. లోయలో పలుచోట్ల యువకులు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి భద్రతాబలగాలపై రాళ్లు రువ్వారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా వెరినాగ్‌లో భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో అమీర్ బషీర్(25) అనే యువకుడు చనిపోయాడు. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. లోయలోని పలుచోట్ల పోలీసులతో ఘర్షణ కారణంగా మరో ఆరుగురు మృతిచెందారు. గణేశ్‌పురాలో ఆందోళనకారులను పట్టుకునేందుకు పోలీసులు వెంటపడగా.. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు జీలం నదిలో పడి చనిపోయాడు.   

 ప్రభుత్వాస్తులు, బీజేపీ ఆఫీసు దగ్ధం
 బుర్హాన్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆందోళన కారులు కుల్గాంలో బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. పోలీసు ఔట్‌పోస్టులు, స్టేషన్లకూ నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో ముగ్గురు పోలీసులు గల్లంతయ్యారు. బుర్హాన్ సొంత ఊరైన త్రాల్ పట్టణంలో రెండు ప్రభుత్వ ఆఫీసులు, మూడు బస్సులను తగలబెట్టారు. చాలాచోట్ల పోలీసులు, భద్రతాబలగాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితి హింసాత్మకంగా మారటంతో.. స్కూళ్లకు సెలవులు ప్రకటించటంతోపాటు.. వర్సిటీలో జరిగే పరీక్షలను వాయిదావేశారు. కాగా, భారత బలగాలు తమ యువకులను చంపటాన్ని నిరసిస్తూ ఆది, సోమవారాల్లోనూ ఆందోళన కొనసాగిస్తామని వేర్పాటువాదులు ప్రకటించారు. దీంతో జమ్మూ బేస్ క్యాంపునుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రను ఆపేశారు.

పరిస్థితి కుదుటపడేంతవరకు క్యాంపులోనే ఉండాలని యాత్రికులకు అధికారులు తెలియజేశారు. అయితే.. ఇప్పటికే కశ్మీర్‌లోని పహల్‌గామ్, బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్న యాత్రికులను గట్టి భద్రత నడుమ అమర్‌నాథ్‌కు అనుమతిస్తున్నారు. ఆందోళనల్లో పలువురు మృతిచెందడంపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర హోం శాఖ  మంత్రి రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. జనాన్ని నియంత్రించేందుకు ఎక్కువ బలగాలను వినియోగించవద్దని, శాంతిని పునరుద్ధరించాలని కోరారు.  
 
 ఉగ్ర ఆకర్షణలో దిట్ట
 కశ్మీర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హన్ ముజఫర్ వనీ 21 ఏళ్లకే ఉగ్రవాద సంస్థకు కశ్మీర్‌లో కీలక నేతగా ఎదిగాడు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పుట్టిన బుర్హన్ తండ్రి.. స్థానిక ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు. 15 ఏళ్ల వయసులోనే 2010 అక్టోబర్ 16న ఇంట్లోనుంచి పారిపోయి ఉగ్రవాదంలో చేరిన వనీ సామాజిక మాధ్యమం ద్వారా కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్శించటంలో దిట్ట. భారత్‌కు వ్యతిరేకంగా వీడియోలు పోస్టు చేయటం.. కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేయాలంటూ రెచ్చగొట్టడం ద్వారా చిన్న వయసులోనే కశ్మీరీ యువతలో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇదే 2011లో వనీని ఇండియన్ ముజాహిదీన్‌లో చేర్చుకునేందుకు కారణమైంది.

2015 ఏప్రిల్ 13న బుర్హన్ సోదరుడు ఖాలిద్‌ను ఉగ్ర సంబంధాల ఆరోపణలతో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. దీంతో మరింత రెచ్చిపోయిన బుర్హన్.. భారత ఆర్మీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. యూనిఫామ్‌లో ఉండే వారిని చంపటమే తన పనని ప్రకటించాడు. కశ్మీర్‌లో పండిట్లకు పునరావాసం కల్పించే కాలనీల్లోనూ విధ్వంసం తప్పదని ఇటీవలే వనీ హెచ్చరించాడు. దీంతో వనీపై భారత ప్రభుత్వం రూ.10లక్షల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూలై 8, 2016న విశ్వసనీయ సమాచారంతో భద్రతా బలగాలు వనీతోపాటు మరో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement