
పిల్లి పోయింది.. కుక్క భర్తగా వస్తోంది!
తన భర్త చనిపోవడంతో మరొకరిని వివాహమాడేందుకు సిద్ధమైంది డామినిక్యూ లెస్పిరెల్ అనే 41 ఏళ్ల మహిళ. చనిపోయిన ఆ మొదటి భర్త ఓ పిల్లి.. ఇప్పుడు ఆమె మరో పెళ్లి చేసుకోబోతుంది ఓ కుక్కని.
హాలండ్: తన భర్త చనిపోవడంతో మరొకరిని వివాహమాడేందుకు సిద్ధమైంది డామినిక్యూ లెస్పిరెల్ అనే 41 ఏళ్ల మహిళ. ఇందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా.. ఈ విషయం విన్నారంటే హవ్వ అనుకోవాల్సిందే. ఎందుకంటే చనిపోయిన ఆ మొదటి భర్త ఓ పిల్లి! ఇప్పుడు ఆమె మరో పెళ్లి చేసుకోబోతుంది ఓ కుక్కని!!
డామినిక్యూ లెస్పిరెల్ ఎనిమిదేళ్ల కిందట మొదటిసారి డొరాక్ అనే తన పెంపుడు పిల్లిని వివాహమాడింది. ఇన్నాళ్లు అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారి దాంపత్యం ఉన్నట్లుండి విషాదంగా మారింది. 19 ఏళ్ల డొరాక్ ఇటీవలే కిడ్నీ ఫెయిలవడంతో చనిపోయింది. దీంతో డోరాక్ ఉన్న సంబంధాన్ని ఆమె ఓసారి నెమరు వేసుకొంది. డొరాక్ తనకు మూడేళ్ల ప్రాయం నుంచి తెలుసని.. అయితే పదహారేళ్లపాటు తనతో సంతోషంగా గడపడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఇప్పుడు డొరాక్ లేకపోవడం తన మనసును కలిచివేసిందని.. అయితే, మరోసారి అనందమయ జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
ట్రావిస్ అనే తన పెంపుడు కుక్కను త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు డామినిక్యూ చెప్పింది. ట్రావిస్ తనకు సరైన జోడీ అని చెప్పిన ఆమె,, ఇప్పటికే తమ మధ్య మంచి అవగాహన ఉందని తెలిపింది. గ్రీస్లో ఉన్నప్పుడు తాను ట్రావిస్ను రక్షించి తీసుకొచ్చానని, తాను స్నానం చేస్తుంటే తన షూ, దుస్తులు ఎత్తుకెళ్లి అల్లరి చేస్తుందని, తనతో కలిసి స్నానం చేస్తుందని ఇలాంటి చేష్టలతో తన మనసు దోచుకుందని అందుకే పెళ్లాడాలని నిర్ణయించుకున్నట్లు డామినిక్యూ వివరించింది.