వీడ్కోలు ప్రసంగంలో ఉద్వేగానికి లోనైన ఒబామా
చికాగో: దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే సమయం వచ్చిందని, వారికి కృతజ్ఞతలు తెలిపేరోజు ఇది అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చివరి ప్రసంగంలో ఉద్వేగానికి లోనయయ్యారు. చికాగోలో నేటి ఆయన ప్రసంగం ఎంతో ఉద్వేగభరితంగా కొనసాగుతోంది. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఒబామాకు వీడ్కోలు ప్రసంగానికి డెమొక్రటిక్ పార్టీ నేతలు, ఇతర కీలక నేతలు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. విశ్వాసం అంటే ఏంటో తాను చికాగో ప్రజల నుంచి నేర్చుకున్నానని ఒబామా అన్నారు. ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటేనే ఉన్నానని, దేశ ప్రజలందరూ కలిసి తనను బెట్టర్ ప్రెసిడెంట్‌గా, ఉత్తమ వ్యక్తిగా చేశారని ఒబామా వ్యాఖ్యానించారు.
'మన దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుకునే సామర్థ్యం మనకు ఉంది. ప్రజల మద్ధతు వల్లే అధ్యక్షుడిని కాగలిగాను. గత కొన్నేళ్లుగా నన్ను, మిషెల్లీ ఒబామాను ఎంతగానో ఆదరించారు. అందుకు మీకు మరోసారి ధన్యావాదాలు తెలియజేసుకుంటున్నాను. గత పదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో మెరుగుపడింది. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు అనేది సాధ్యపడుతుంది. అందరూ కలిసికట్టుగా ఇదే తీరుగా భవిష్యత్తులోనూ పోరాటం సాగించాలి' అని ఒబామా పిలుపునిచ్చారు.