గతేడాది చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న మూడేళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం రెండు గంటల్లోనే కాపాడి శెభాష్ అనిపించుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన 18 నెలల చిన్నారి మీనాను మూడు రోజులైనా ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. చివరికి మృతదేహాన్ని అవశేషాలతో బయటకు తీయాల్సి వచ్చింది. తొలుత పాప కేవలం 40 అడుగుల లోతులో పడిపోయిందని త్వరగానే రక్షిస్తారని అందరూ భావించగా.. ఆపై 110 అడుగుల లోతుకు జారిందని శుక్రవారం అన్నారు. శనివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నారి మీనా 200 అడుగుల మేర ఉన్నట్లుగా కెమెరాలలో కనిపించక పోవడం విచారకరం .
చైనాలో అద్భుతమైన టెక్నాలజీ
ఆ వివరాలు.. గతేడాది మార్చి 31న తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్, వీఫాంగ్ లో మూడేళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అరగంటలో ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు, 12 మంది సిబ్బంది చేరుకున్నారు. 11 ఇంచుల వెడల్పున్న బోరు బావిలో పడ్డ చిన్నారి 300 అడుగుల లోతులో ఉన్నాడని సెన్సార్ల ద్వారా గుర్తించారు. సెన్సార్లతో పాటు ఆక్సిజన్ పైపును, చిన్నారికి కట్టేందుకు ఇతరత్రా పైపులను సిబ‍్బంది బోరులోకి పంపారు.
సెన్సార్ల సాయంతో వారి వద్ద ఉన్న మానిటర్లో బాలుడి కదలికలను గుర్తించారు. ఆపై బాబు ముక్కుకు ఆక్సిజన్ పైపు సెట్ చేశారు. అత్యాధునిక సెన్సార్ల సాయంతో బాబుకు ఓ పైపు చుట్టుకునేలా చేశారు. తమ వద్ద ఉన్న స్క్రీన్లో చూస్తూ చిన్నారికి కట్టిన పైపుతో పాటుగా ఆక్సిజన్, సెన్సార్ పైపులను పైకి లాగడం ప్రారంభించారు. ఇలా జాగ్రత్తగా రెండు గంటలపాటు ఎంతో శ్రమించిన సిబ్బంది బాలుడికి ఎలాంటి గాయాలు అవకుండానే బోరుబావి నుంచి రక్షించారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న అందరూ ఈ అద్బుతాన్ని వీక్షించారు.
బాలుడి తండ్రి చెంగ్ ఫైర్ సిబ్బందికి ధన్యావాదాలు తెలిపాడు. అంత లోతైన బోరుబావిలో పడినా.. నా కుమారుడికి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. అయితే భయంతో ఎంతోసేపు ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన టెక్నాలజీని వినియోగించిన కారణంగానే సిబ్బంది తమ కుమారుడిని రక్షించగలిగారని ఆనందభాష్పాలతో చెప్పడం స్థానికులు ఎప్పటికీ మరిచిపోరు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తే 300 అడుగుల లోతైన బోరు బావిలో పడిన చిన్నారుల ప్రాణాలను సైతం సులువుగా రక్షించవచ్చని చైనా వాసులు నిరూపించినా.. భారత్ లో మాత్రం 100 అడుగుల లోతైన బోరు బావిలో పడుతున్న చిన్నారులను రక్షించలేక పోవడం విచారకరమని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత కథనాలు
చిట్టితల్లీ క్షేమమేనా?