అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
► తెలుగు ఇంజనీర్ మృతి
► మరో తెలుగు వ్యక్తికి తీవ్ర గాయాలు
► బార్‌లో కాల్పులకు తెగబడిన దుండగుడు
► మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ వ్యాఖ్యలు
కన్సాస్: అమెరికాలో జాతి వివక్ష నెత్తికెక్కిన ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఇందులో ఒకరు మరణించారు. మృతుడిని శ్రీనివాస్ కూచిబొట్లగా గుర్తించారు. మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డారు. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఎన్‌టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ‘మా దేశం నుంచి వెళ్లిపోండి..’ ‘ఉగ్రవాదులారా.. ’ అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో దుండగుడు దూషించాడు. దీంతో బార్ యాజమాన్యం కలుగజేసుకొని అతడిని బయటకు పంపింది. కాసేపటికే అతడు తిరిగి వచ్చి తుపాకీతో వీరిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనకు సంబంధించి ఆడమ్ పూరింటన్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తెలుగు వారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
( చదవండి : అమెరికాలో వరంగల్ విద్యార్థి హత్య )