కాన్సాస్: అమెరికాలోని కాన్సాస్‌లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో ఓ అమెరికన్ పౌరుడు హీరో అయ్యాడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. అతడి చేతులోని తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తూటాల్లో రెండు అతడి ఒంట్లోకి దూసుకెళ్లాయి. అందులో ఒకటి చాతీలోకి మరొకటి చేతిలోకి. వివరాల్లోకి వెళితే.. అమెరికా నేవీలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్ పురింటన్ (51) ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు.
తమ దేశాన్ని విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ కాల్పులు కొనసాగించాడు. అదే సమయంలో అందులో బీర్ తాగేందుకు వచ్చిన ఇయాన్ గ్రిలియట్(24) వెంటనే పురింటన్‌పైకి దూకాడు. అతడిని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు ట్రిగర్ నొక్కడంతో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయినప్పటికీ అతడిపై విరోచితంగా పోరాడి కిందపడేశాడు. అయినప్పటికీ గాయాల కారణంగా గ్రిలియట్ స్పృహకోల్పోతుండగా పురింటన్ పారిపోయాడు. ఐదు గంటల అనంతరం పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. స్పృహకోల్పోయిన గ్రిలియట్‌ను ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
వాస్తవానికి అతడు అడ్డుకోకుంటే అలోక్ కూడా చనిపోయే పరిస్థితి ఉండేదట. ‘ఇతరులు ఏం చేయాలో నేను సరిగ్గా అదే చేశాను. అతడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతడు జాతి కూడా మాకు తెలియదు. కానీ మనందరం మనుషులం. నేను బ్రతికి బయటపడటం నిజంగా అదృష్టమే. ఇది చాలా గొప్ప విషయం. ఆ ఘటనను నేను వర్ణించలేను. అలోక్ మాదసాని నిన్న నన్ను పరామర్శించి వెళ్లాడు. అతడి భార్య ఐదు నెలల గర్భవతి అని చెప్పాడు. అతడికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది’ అంటూ గ్రిలియట్ ఆస్పత్రిలో బెడ్‌పై ఉండి మాట్లాడాడు.
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట