పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..!
ఇస్లామాబాద్: పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో బుధవారం చోటుచేసుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబ్ కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్(19) అనే స్కూల్ టీచర్ పై కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు.
ముందుగా యువతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె అంకుల్ తెలిపారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సదాఖత్ నేడు చనిపోయిందని తెలిపారు. సదాఖత్ ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్ గా పనిచేస్తుందని, ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు.
పెళ్లికొడుకు వయసు తనకంటే రెట్టింపు ఉందని, అతడు అది వరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీస్ అధికారి మజార్ ఇక్బాల్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.