విమానం ఆచూకీపై మరిన్ని ఆధారాలు!
హిందూ మహాసముద్రంలో ‘విమాన శకలాలు’
గుర్తించిన ఫ్రాన్స్ శాటిలైట్లు
16 రోజులవుతున్నా ఆచూకీ లేని మలేసియా విమానం
కౌలాలంపూర్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. తాజాగా దక్షిణ హిందూమహాసముద్రంలో ఈ విమానానివిగా భావిస్తున్న శకలాలను ఫ్రాన్స్ ఉపగ్రహాలు గుర్తించాయి. వాటికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఫ్రాన్స్ ఆదివారం మలేసియాకు అందజేసింది. ఇవి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి 2,300 కి.మీ దూరంలో తేలాడాయని, ఆ ప్రాంతంపై ఉపగ్రహాల నిఘా పరిధిని పెంచుతామని తెలిపింది. ఈ శకలాలను ఇటీవల చైనా, ఆస్ట్రేలియా శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన విమాన శకలాలుగా భావిస్తున్న వస్తువులున్న చోటికి ఉత్తరంగా 930 కి.మీ దూరంలో శుక్రవారం గుర్తించినట్లు మలేసియా అధికారి ఒకరు చెప్పారు. మరోపక్క.. దక్షిణ హిందూ మహాసముద్రంలో కార్గో చెక్క పలకను(ప్యాలెట్) గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. ఈ పలకతోపాటు దాని చుట్టుపక్కల సీట్లకు తగిలించుకునే రంగురంగుల బెల్టులు, ఇతర వస్తువులను తమ విమానం గుర్తించిందని, అయితే వాటి కోసం అక్కడికి వెళ్లిన న్యూజిలాండ్ విమానం ఏమీ కనుక్కోకుండానే తిరిగి వచ్చిందని చెప్పారు. విమానాల కింది భాగంలో ప్యాలెట్లను తరలిస్తుంటారని, అయితే షిప్పింగ్ పరిశ్రమలోనూ వాటిని వాడుతారు కనుక అప్పుడే ధ్రువీకరణకు రాకూడదని అన్నారు. ఈ వస్తువుల గుర్తింపుతో 16 రోజుల కిందట కనిపించకుండా పోయిన విమానం ఆచూకీ దొరుకుతుందేమోనని ఆశలు చిగురిస్తున్నాయి. గల్లంతైన విమానం కోసం ఆదివారం కూడా భారత్ సహా పలు దేశాలకు చెందిన నిఘా విమానాలు, నౌకలు గాలించినా ఫలితం లేకపోయింది.
‘ఏప్రిల్ 6 నాటికి ఆ ధ్వనులు ఆగిపోవచ్చు’
వాషింగ్టన్: మలేసియా విమానాన్ని కనుక్కోవడంలో విఫలమైతే అందులోని రెండు బ్లాక్స్‌బాక్సుల నుంచి పింగర్స్ విడుదల(తక్కువ నిడివి గల ధ్వనులు) ఏప్రిల్ 6 నాటికల్లా ఆగిపోయే అవకాశముందని వైమానిక నిపుణుడొకరు చెప్పారు. విమానంలోని బ్లాక్‌బాక్సుల బ్యాటరీల జీవితకాలం సగం ముగిసిందని మార్గనిర్దేశక పరికరాల తయారీ సంస్థ డుకేన్ సీకామ్ అధిపతి అనీశ్ పటేల్ తెలిపారు. ఏప్రిల్ 6 తర్వాత బోయింగ్ కాక్‌పిట్ వాయిస్ రికార్డులను కనుగొనడం కష్టమవుతుందని అన్నారు.