అడుక్కోడానికి వేళాపాళా లేదా అన్నాడు
ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసుకుని పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సవాల్‌లా తీసుకుంటారు. ‘చందమామ కథలు’లో భిక్షగాడి పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు కృష్ణేశ్వరరావు అలానే ఫీలయ్యారు. దాదాపు 1500 నాటక ప్రదర్శనలు, పలు నాటకాలకు కథ, మాటలు, భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా లాంటి చిత్రాలకు రచన, గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు తదితర చిత్రాల్లో నటన... సింపుల్‌గా ఇది కృష్ణేశ్వరరావు ట్రాక్ రికార్డ్. ‘చందమామ కథలు’లో చేసిన భిక్షగాడి పాత్ర ఆయన కెరీర్‌కు మంచి మలుపు అయ్యిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆదివారం పత్రికలవారితో తన ఆనందాన్ని కృష్ణేశ్వరరావు ఈ విధంగా పంచుకున్నారు...
నటనంటే ఇష్టం. అందుకే నాటక రంగంలోకి అడుగుపెట్టాను. పరిషత్తుల్లో పాల్గొన్నాను. అమ్మ నేపథ్యంలో సాగే ‘సంపద’ అనే నాటకాన్ని 150 సార్లు ప్రదర్శిస్తే అన్నిసార్లూ అపూర్వ స్పందన లభించింది. నటుడు జీవా నాకు మంచి మిత్రుడు. వంశీగారి దర్శకత్వంలో ఆయన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు, ఆ షూటింగ్‌కి వెళ్లేవాణ్ణి. తన ద్వారానే నాకు వంశీగారితో పరిచయమైంది. ‘నీలో మంచి నటుడు కనిపిస్తున్నాడు’ అని వంశీగారు ‘గోపి గోపిక గోదావరి’లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. విడుదలకు సిద్ధమైన ‘తను మొన్నే వెళ్లిపోయింది’లో కూడా నాది మంచి పాత్ర.
సూపర్‌స్టార్ కృష్ణ మెచ్చుకున్నారు
ఇక, ‘చందమామ కథలు’లో చేసిన భిక్షగాడి పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపయ్యిందనే చెప్పాలి. ఆ సినిమా చూసి, ఇద్దరు పెద్ద నిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నేను అడుక్కునే సన్నివేశాలను హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర తీశారు. షూటింగ్ అని చెప్పకుండా నిజంగా అడుక్కుంటున్నవాళ్లతో కలిసిపోయి, నేనూ అందరి దగ్గరి చెయ్యి చాపేవాణ్ణి. ‘మా ఏరియాకొచ్చావేంటి’? అంటూ అక్కడ భిక్షాటన చేస్తున్నవాళ్లు గుర్రుగా చూసేవాళ్లు. అలాగే ట్రైన్ ఎక్కే సన్నివేశం గురించి చెప్పాలి. నేను ట్రైన్ ఎక్కుతుంటే, ‘అడుక్కోడానికి వేళాపాళా లేదా’ అంటూ అక్కడున్న పోలీస్ తిట్టాడు.
కంపార్ట్‌మెంట్‌లో కింద కూర్చుని అడుక్కుంటుంటే ఒకడైతే కర్రతో కొట్టినంత పని చేశాడు. షూటింగ్ అనడంతో ఆగాడు. అవన్నీ నాకు మంచి అనుభూతులు. కృష్ణగారు, విజయనిర్మలగారు సినిమా చూసి ‘బాగా చేశావు’ అని అభినందించారు. వంశీగారి సినిమాల్లో కామెడీ టచ్ ఉన్న కేరక్టర్లు, ఎన్. శంకర్‌గారి సినిమాల్లో కొంచెం సీరియస్‌గా ఉండే పాత్రలు చేసిన నాకు ఈ భిక్షగాడి పాత్ర నాలో పూర్తి స్థాయి కేరక్టర్ నటుడున్నాడని నిరూపించింది. నా నాటక, సినీరంగ ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచి, ప్రోత్సహిస్తున్న నా మిత్రుడు తాడిశెట్టి వెంకట్రావుగారికి కృతజ్ఞతలు.