చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక | Chandrika Telugu Movie Review | Sakshi
Sakshi News home page

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక

Published Fri, Sep 25 2015 10:17 PM | Last Updated on Thu, Jul 25 2019 6:37 PM

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక - Sakshi

చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక

కొత్త సినిమా గురూ!చంద్రిక
  బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు బాగా పారుతున్న పాచిక - భయపెట్టడం! ఈ లేటెస్ట్ బాక్సాఫీస్ హార్రర్ సక్సెస్ ట్రెండ్‌లో ‘చంద్రకళ’, ‘పిశాచి’, గత వారం రిలీజ్ ‘మయూరి’ (తమిళంలో ‘మాయ’) తర్వాత వచ్చిన చిత్రం ‘చంద్రిక’. బంగళాలో భూతం!
 
 అర్జున్ (జయరామ్ కార్తీక్) అనే ప్రముఖ చిత్రకారుడు పెద్ద హవేలీని కొంటాడు. అతని గురువైన ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్) ఆ బంగళాలో ఒకప్పుడు నివసించేవాడు. ఈ ఏకలవ్య శిష్యుడు ఆ భవనం కొనడానికి కారణం అదే. అలా ఆ భవంతిలోకి అతను, అతని భార్య శిల్ప (టీవీ యాంకర్, నటి శ్రీముఖి) అడుగుపెడతారు. అయితే, ఆ బంగళాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి శిల్ప ప్రవర్తనలో చిత్రమైన మార్పులు మొదలవుతాయి. చివరకు ఆ బిల్డింగ్‌లో ఒకప్పుడు తాను గీసిన పెద్ద స్త్రీమూర్తి చిత్తరువులోని చంద్రికనే తానంటూ భార్యను పూనిన దయ్యం చెబుతుంది. అక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది.
 
 భార్యను పట్టిన ఆ బంగళాలోని దయ్యాన్ని వదిలించడానికి అర్జున్ ఒక మంత్రోపాసకుణ్ణి ఆశ్రయిస్తాడు. చంద్రికకూ, నీకూ సంబంధం ఏమిటన్న ఆ ఉపాసకుడి దగ్గర అర్జున్ తన ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేస్తాడు. చంద్రిక, తాను ఒకప్పటి ప్రేమికులమనీ, పీటల దాకా వచ్చి తమ పెళ్ళి ఆగిపోయిందనీ చెబుతాడు. అయితే, ఆ ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక కూడా చంద్రిక మరణం మిస్టరీ వీడదు. ఆ పజిల్‌ను సాల్వ్ చేయడానికి అర్జున్ అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణలో అతనికి తెలిసిందేమిటి? ఏమైందన్నది మిగతా సినిమా.
 
 కీలకంగా.. సౌండ్ ఎఫెక్ట్స్
 తెలుగు కన్నా ఒక రోజు ముందే కన్నడ వెర్షన్ రిలీజైన ‘చంద్రిక’ ప్రాథ మికంగా కన్నడ సినిమా. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వాళ్ళతో షూట్ చేసిన సీన్లు దీన్ని కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం చేశాయి. కానీ, కన్నడ తరహా టేకింగ్, ఆ నిర్మాణ విలువలు తెలిసిపోతుంటాయి. అర్జున్ పాత్రధారి మనకు కొత్త. కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపు. వారిద్దరి మధ్య ప్రణయగీతం మాత్రం ఇవాళ్టి సినిమాల్లోని ఐటమ్ సాంగ్‌లా మాస్‌ను ఆకట్టుకుంటుంది. ‘జులాయి’లో అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర పోషించిన టీవీ యాంకర్ శ్రీముఖిది సినిమాలో ప్రధానపాత్ర. గృహిణిగా, దయ్యంగా వేరియేషన్ బాగా చూపారు. ఇంటర్వెల్ ముందు ముగ్గులో విచిత్ర విన్యాసాలతో ఆమె నటన బాగుంది. మిగతా పాత్రలన్నీ కాసేపు కనిపించి పోయేవి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత ప్లస్. కెమేరా వర్క్ ఫరవాలేదు.
 
 సినిమా మొదలైన కాసేపటికే క్యారెక్టర్లు, దయ్యం విషయం పరిచయం అయిపోతుంది. కానీ, ముందే ఊహించగల సీన్లతోనే ఫస్టాఫంతా సాగు తుంది. ఇంటర్వెల్‌కి కానీ బండి పట్టాలెక్కదు. ఫ్లాష్‌బ్యాక్ నుంచి సెకండాఫ్ ఆసక్తిగా సాగాలి. అక్కడకొచ్చేసరికి, ప్రేమ సీన్ల లాగుడు. చివరకు ప్రాబ్లమ్ సాల్వ్ కావడాన్ని కూడా తేలిగ్గా తేల్చేశారు. భవంతిలోని దయ్యం హీరో మీద పగబట్టి ఉంటే, అతనక్కడికి వచ్చేదాకా ఏమీ చెయ్యదెందుకని? జరిగిన సంగతేదీ తెలియకుండా హీరో బతికేస్తున్నాడా? లాంటి ప్రశ్నలకు జవాబులు ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే! కథలోని సమస్యను పరిష్కరించడానికి సోకాల్డ్ హీరో చేసిందేమిటంటే జవాబు దొరకదు. కథలో బలమైన విలన్లు, ఆ విలన్లు చేసిన దుర్మార్గాలు, దుష్కృత్యాలూ లేవు. అందుకే, వ్యవహారమంతా ఉపరితల స్పర్శే. బలమైన హార్రర్ కథ కానీ, ఇటీవలి హార్రర్ కామెడీ కానీ కనిపించవు. రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా సినిమా చేయాలన్న బలమైన కోరిక మాత్రం అడుగడుగునా అర్థమవుతుంటుంది. అదే ఈ కథకు మైనస్సూ, ప్లస్సూ కూడా!
 
 చిత్రం - ‘చంద్రిక’, తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ, గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, మాటలు - నాగేశ్వరరావు, పాటలు - వనమాలి, సంగీతం - గుణ్వంత్, కెమెరా - కె. రాజేందర్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే - సాజిద్ ఖురేషీ, నిర్మాత - వి. ఆశ, దర్శకత్వం - యోగేశ్, నిడివి - దాదాపు 2 గంటలు, రిలీజ్ - 25 సెప్టెంబర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement