ఇదో బలహీన ప్రేమకథాచిత్రమ్
తారాగణం: సుమంత్ అశ్విన్, నందిత,
కెమేరా: మల్హర్ భట్ జోషీ, సంగీతం: జె.బి,
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, బి.మహేంద్ర బాబు,
దర్శకత్వం: హరినాథ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: మారుతి
కొన్ని కథలు వినడానికి బాగుంటాయి... మరికొన్ని చూడడానికి బాగుంటాయి. వినడానికి బాగున్నవన్నీ తెరపై చూసేందుకు సరిపడక పోవచ్చు. పదే పదే ఒక అబ్బాయి ప్రేమను భగ్నం చేసే అమ్మాయి. చివరకు ఆ అమ్మాయి, అబ్బాయే ప్రేమలో పడితే? వినడానికి బాగున్న ఈ ఇతివృత్తానికి మారుతి మార్కు వెండితెర రూపం - ‘లవర్‌స’.
కథ ఏమిటంటే... సిద్ధు (సుమంత్ అశ్విన్) ఇంటర్ చదువుతున్న రోజుల నుంచి ఒకరి తరువాత మరొకరుగా గీత (తేజస్వి), సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. కానీ, ఆ అమ్మాయిలకు ఫ్రెండ్ అయిన చిత్ర (‘ప్రేమకథా చిత్రవ్‌ు’ ఫేవ్‌ు నందిత) ‘అది నిజమైన ప్రేమ కాదు... ప్రేమ పేరిట ఉబుసుపోక కాలక్షేప (ఫ్లర్టింగ్)’మంటూ, ఆ ప్రేమల్ని చెడగొడుతుంది. తీరా ఇంజినీరింగ్ చదువుకొంటున్న రోజుల్లో ఆ చిత్రనే అనుకోకుండా హీరో ప్రేమిస్తాడు. ఆ విషయం తెలిశాక ఏమైంది, వాళ్ళ ప్రేమ ఫలించిందా అన్నది మిగతా సినిమా.
ఎలా నటించారంటే... హీరో సుమంత్ అశ్విన్ హుషారుగా నటించాడు, నర్తించాడు. కెమేరా లుక్స్ మీద, ఎంచుకొనే కథల మీద ఈ యువ నటుడు మరింత శ్రద్ధ పెట్టాలి. నందిత ఫరవాలేదనిపిస్తారు. మారుతి చిత్రాల్లో తరచూ కనిపించే సాయి పంపన హీరో ఫ్రెండ్‌గా మాటల హడావిడి చేశారు. సెకండాఫ్ లోని సప్తగిరి ఎపిసోడే ఈ బలహీనమైన కథ, కథనాల్లో కాస్త రిలీఫ్.
ఎలా ఉందంటే... సినిమా మొదలైనప్పుడు కాస్త ఆసక్తిగా అనిపించినా, చర్చి ఫాదర్ (ఎమ్మెస్ నారాయణ)తో హీరో తన మొదటి ప్రేమకథ చెప్పి, రెండో కథ మొదలుపెట్టేటప్పటికే ఆసక్తి పోతుంది. పాత్రల పరిచయం, అసలు హీరోయిన్‌తో హీరో ప్రేమ మొదలవడం - ఈ కొద్దిపాటి కథనే ఫస్టాఫ్ అంతా నడిపారు. ఇక, వారిద్దరి మధ్య ప్రేమను ఎలా ముందుకు నడపాలన్న దానిపై దర్శక, రచయితలకు కూడా ఒక స్పష్టత లేదు. దాంతో, ప్రధాన కథకు సంబంధం లేని పాత్రలను తెచ్చి, వాటి ద్వారా కామెడీ చేయిస్తూ, కథను ముగింపు దగ్గరకు తీసుకురావాలని విఫలయత్నం చేశారు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రేక్షకులప్పటికే డిస్‌కనెక్ట్ అయిపోతారు.
మారుతి సినిమాలన్నిటి లాగానే దీనిలోనూ అక్కడక్కడ ఆడియో కట్‌లను దాటుకొని వచ్చిన ద్వంద్వార్థపు డైలాగులు వినిపిస్తాయి. ఒకటీ అరా చోట్ల డైలాగులు సమకాలీన యువతరం ఆలోచనల్ని ప్రతిఫలిస్తూ, హాలులో జనాన్ని నవ్విస్తాయి. కెమేరా వర్‌క, సంగీతం లాంటి అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, పాత్రధారులకు టచప్ కూడా చేయకుండా తీసిన కొన్ని దృశ్యాలు, సాగదీత కథనం మధ్య వాటికి గ్రహణం పట్టేసింది.
కథను ఎలా ముగించాలో తెలియక కేవలం సెకండాఫ్‌లో పిచ్చివాడు గజిని పాత్రలో సప్తగిరితో వచ్చే కామెడీతోనే సినిమాను నడిపేయాలనుకోవడం దర్శక, రచయితల పొరపాటు. వెరసి, హాలులోకి వెళ్ళిన కాసేటికే కథ గ్రహించేసిన జనం పూర్తిగా రెండు గంటల పది నిమిషాల సినిమా బోర్ అనుకోకుండా చూడగలగడం కష్టం. అందుకే, హాల్లోంచి బయటకొస్తూ ఒక స్టూడెంట్ అన్నట్లు, ఈ ‘లవర్‌స’ - ప్రేక్షకుల చెవిలో దర్శక, నిర్మాతలు పెట్టిన ఫ్లవర్‌స.
బలాలు:
* హీరో హుషారు నటన
* లౌడ్‌గా అనిపించినా, కాసేపు నవ్వించే సప్తగిరి కామెడీ
* ఒకటి రెండు పాటలు
బలహీనతలు:
* సున్నా కథ
* మైనస్ కథనం
* కథలోని పాత్రలను ప్రవేశపెట్టి, వాటి మధ్య అనుబంధం తెలియజేయడానికే ఫస్టాఫ్ అయిపోవడం ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్‌లో కథ,
* కథనం.. మరీ పిల్లలాట లాగా ఉండడం
* దర్శకత్వం