అర గుండుకే అంత పేరు వస్తే.... | Dr sudarshan interview with sakshi | Sakshi
Sakshi News home page

అర గుండుకే అంత పేరు వస్తే....

Published Sat, Mar 21 2015 12:31 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అర గుండుకే అంత పేరు వస్తే.... - Sakshi

అర గుండుకే అంత పేరు వస్తే....

నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల. ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడు....నవ్వుతూ చావాలిరా....’ జీవితం చాలా చిన్నది. ఉన్ననాళ్లు హాయిగా నవ్వుతూ గడిపేయాలి. ఎటువంటి ఇగోలు, టెన్షన్స్ పెట్టుకోకుండా లైఫ్‌లో ముందుకు సాగిపోండి. ఒక్క చిన్న చిరునవ్వు చాలు. ఎదుటివాడు శత్రువైనా మిత్రుడిగా మారిపోతాడు. చిన్న నవ్వు చాలు... అవ్వవు అనుకున్న పనులు టక్కున అయిపోతాయి.
 
 నవ్వుకు అంత శక్తి ఉంది. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈ రోజు ఉగాది... తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం... ఉదయం లేచి పూజ చేసి ఉగాది పచ్చడి తయారుచేసుకుని తింటారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్టే జీవితంలో కూడా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. జీవితాంతం తీపిగా ఉండాలని ఈ రోజు కమెడియన్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ.... డా.సుదర్శన్ అంటే గుర్తు పట్టలేకపోవచ్చు గానీ ‘గుండు’ సుదర్శన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. మరిన్ని కామెడీ సంగతులు ఆయన మాటల్లోనే...
 
నేను పుట్టి పెరిగింది అంతా భీమవరంలో... సివిల్ ఇంజినీరింగ్ చేశాను. భీమవరంలో కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవాడిని. కానీ న న్ను చూసిన వాళ్లు అందరూ తెలుగు లెక్చరర్ అనుకుంటారు. నా భాష తీరు. సాహిత్యం మీద ఉన్న అవగాహన వల్ల అలా అనుకుంటూ ఉంటారు. నేను పనిచేసిన కాలేజీలోనే బ్రహ్మానందంగారు చదువుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో జరిగే పౌరాణిక నాటకాలు అన్నీ చూసేవాడిని. అలా పెద్దయ్యాక కొన్ని నాటకాలు కూడా వేశాను. అలా నేను బాపుగారి మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఫస్ట్ చేసిన సినిమా ఎన్టీఆర్‌తో అయినా రిలీజ్ అయ్యింది మాత్రం మిస్టర్ పెళ్లాం. ‘అంతా విష్ణు మాయ’ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. నాకు మంచి పేరు తెచ్చింది.
 
అదే గుర్తొస్తుంది
నేను ఇంతకు ముందు చాలాసార్లు విశాఖపట్నం వచ్చాను. గత 15 సంవత్సరాల నుంచి నాకు విశాఖపట్నంతో అనుబంధం ఉంది. చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ చేశాం. వెంకటేష్ మల్లీశ్వరి సినిమా ఇక్కడ బీచ్‌రోడ్‌లో షూట్ చేశాం. ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఒక్కో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒకసారి జేడీ చక్రవర్తి మంచి డెరైక్టర్... ‘ఆల్ ది బెస్ట్’ సినిమా ఇక్కడే షూట్ చేశాం.

నేను, కృష్ణ భగవాన్, తెలంగాణ శంకుతల... మా కాంబినేషన్‌లో సీన్ తీస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ టైంలో చాలా టెన్షన్ పడ్డాను. ఆ రోజు సాయంత్రం షూటింగ్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్లిపోవాలి. ఆ మరుసటి రోజు ఉదయం ఇంకో షూటింగ్ ఉంది. వాళ్లకి వస్తాను అని మాటిచ్చేశాను. అది ముందే వీళ్లకు చెప్పాను. టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాను. సీన్ చేస్తున్నారు. జేడీ చక్రవర్తిగారికి నచ్చిన విధంగా తీస్తున్నారు. ఆయన పర్ఫెక్ట్ అనుకునేంత వరకు తీస్తారు. టైం అయిపోతోంది.
 
నాకేమో టెన్షన్...బీపీ పెరిగిపోతోంది. ఎలా చెప్పాలో తెలియదు. మొత్తానికి అంతా అయిపోయేసరికి ట్రైన్ టైం అయిపోయింది. టికెట్ కూడా క్యాన్సిల్ చేసేశాను. తర్వాత వెళ్లడానికి వేరే ట్రైన్ లేదు. అదృష్టం బాగుండి ఆ రోజు రాత్రి ట్రైన్ లేట్ అయ్యింది. మొత్తానికి మరుసటి రోజు హైదరాబాద్ చేరాను. కానీ నేను ఎప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు వచ్చినా నాకు ఆనాటి సంఘటనే గుర్తొస్తుంది.
 
హారర్ కామెడీ సక్సెస్
మా అబ్బాయి హారర్ సినిమాలు దుప్పటి ముసుగు కప్పుకుని చూస్తాడు. అలా చూడడం ఎందుకో నాకు అర్ధం కాదు. భయపడుతున్నప్పుడు సినిమా చూడడం మానేయచ్చు కదా అంటాను. కానీ భయపడడం కూడా ఒక ఎంజాయ్‌మెంట్. అందుకే హారర్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. కానీ ప్యూర్ హారర్, సస్పెన్స్ సినిమాలు ఎప్పుడో చాలా మంది దర్శకులు తీసేశారు. అందుకే ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాలు తీస్తున్నారు. ప్రేమకథా చిత్రం, గీతాంజలి... ఇలా మంచి కాన్సెప్ట్స్‌తో కామెడీ మిక్స్ చేసి సినిమాలు తీస్తున్నారు. సక్సెస్ అవుతున్నాయి కూడా.
 
బాపుగారి కామెడీ
స్కిట్‌లో అయినా, కార్టూన్‌లో అయినా ఒక్క చిన్న మార్పు చాలు. మనకు ఇట్టే నవ్వొచ్చేస్తుంది. ఒకసారి రాగతి పండరిగారు ఒక కార్టూన్ గీశారు. ఒక వ్యక్తి తల మీద తువ్వాలు పెట్టుకుని ఉన్నట్లు....  ‘తల మీద ఆ గుడ్డ తీయండి. దివాలా తీశాం అనుకుంటాం.’ అని అతని భార్య అన్నట్లు ఉండే కార్టూన్ గీశారు. దానికి బాపు గారు చిన్న మార్పు చెప్పారు. వినాయక చవితి రోజు ఇంట్లో వినాయకుడి మండపం చిన్నది వేసి కిటికీ... దానిలో నుంచి చంద్రుడు వేయమన్నారు. చవితి రోజు చంద్రుడును చూడకూడదు కాబట్టి అక్షింతలు వేసుకున్నాడు కానీ గుండు కనుక అక్షింతలు జారిపోకుండా గుడ్డ వేసుకున్నాడు. ‘అక్షింతలు జారిపోవు గానీ గుడ్డ తీయండి. దివాలా తీశాం అనుకుంటారు’ అని మార్పించారు. ఇందులో చేసినదే చిన్న మార్పే కానీ సీన్ బాగా హైలైట్ అయ్యింది.
 
ఫుల్ గుండు అయితే...
 ఒక సభలో బ్రహ్మానందం,సునీల్,వేణుమాధవ్ ఇలా అందరం ఉన్నాం. ఎవరో ఒకతను అడిగారు ఎప్పుడూ గుండు ఎందుకు మెయింటెన్ చేస్తున్నారు అని. బ్రహ్మానందం అరగుండు పాత్ర చేశారు. అందుకే చమత్కారంగా...అరగుండుకే అంత పేరు వస్తే ఫుల్ గుండుకు ఇంకెంతో పేరు వస్తుందో అని ఇలా గుండు చేయించుకుని తిరుగుతున్నాను అని చెప్పాను. దానికి బ్రహ్మానందం బాగా ఎంజాయ్ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement