మహమ్మద్ రఫీని విస్మయానికి గురి చేసిన ఘంటసాల పాట
మహమ్మద్ రఫీని విస్మయానికి గురి చేసిన ఘంటసాల పాట
Published Wed, Dec 4 2013 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
వాయిద్యానికి ప్రాణం వచ్చి సాహిత్యాన్ని పలుకుతున్నట్లుంటుంది ఘంటసాల మాస్టారి గాత్రం. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు లోగిళ్లను పునీతం చేసిన కంఠం ఆయనది. తెలుగు సినిమా స్వర్ణయుగ వైభవానికి ప్రతీక ఘంటసాల పాట. గాయకునిగా, సంగీత దర్శకునిగా, నిర్మాతగా తెలుగు సినీ చరిత్రలో ఘంటసాలది ఓ సువర్ణాధ్యాయం. నేడు ఆ గానగంధర్వుడి జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మృతుల్ని కాసేపు నెమరువేసుకుందాం.
అక్కినేని, అంజలీదేవి జంటగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సువర్ణసుందరి’(1957) సినిమా ఆ రోజుల్లో ఓ సంగీత సంచలనం. ఆదినారాయణరావు స్వరపరిచిన ఈ సినిమా గీతాలు శ్రోతల్ని శ్రవణానందభరితుల్ని చేశాయి. ఇందులోని ప్రతి పాటా ఆణిముత్యమే అయినా... అందులో మేలిముత్యం మాత్రం ‘హాయి హాయిగా ఆమని సాగె’ పాట. రాగమాలికలో స్వరపరిచినఈ పాటను ఘంటసాల, జిక్కీ ఆలపించారు. సంగీత జ్ఞానుల ప్రశంసలందుకున్న పాట ఇది. ఘంటసాల గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే.. గాయకునిగా ఘంటసాల సామర్థ్యాన్ని తెలియజేసిందీ పాట.
1958లో ‘సువర్ణసుందరి’ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి తలపెట్టారు ఆ చిత్రానికి నిర్మాత కూడా అయిన ఆదినారాయణరావు. మద్రాసులో పాటల రికార్డింగ్ మొదలైంది. ‘హాయి హాయిగా ఆమని సాగె’ పాట హిందీ వెర్షన్‌ని మహమ్మద్ఫ్రీ, లతామంగేష్కర్‌లపై రికార్డ్ చేస్తున్నారు ఆదినారాయణరావు. ఎంతటి కష్టతరమైన గీతాన్నైనా సునాయాసంగా పాడేయగల మహా గాయకుడు రఫీ... రాగమాలికలో స్వరపరిచిన ఈ పాటను పాడటానికి ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ పాటను ఘంటసాల రెండే టేకుల్లో ఓకే చేశారని తెలిసి ఆయన విస్మయానికి లోనయ్యారు. ఈ పాటను అంత తేలిగ్గా ఘంటసాల ఎలా పాడగలిగారో రఫీకి అంతుపట్టలేదు. యాదృచ్ఛికంగా.. అప్పుడే... అదే రికార్డింగ్ థియేటర్‌లోకి అడుగుపెట్టారు ఘంటసాల. వేరే సినిమా పాటల రికార్డింగ్ పనిమీద ఆయన అక్కడకు రావడం జరిగింది.
ఒక్కసారిగా అక్కడ ఘంటసాలను చూడగానే రఫీ ఉద్వేగానికి లోనయ్యారు. గట్టిగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. అక్కడే ఉన్న లతాజీ అయితే... ఆ పాటను ఒక్కసారి తనతో కలిసి ఆలపించాలని ఘంటసాలను అభ్యర్థించారు. అయితే.. లతామంగేష్కర్ అభ్యర్థనను ఘంటసాల తోసిపుచ్చారు. ఆమె ఎంత బతిమాలినా ఘంటసాల ఏదో ఒక సాకు చెప్పి అక్కడ్నుంచీ తప్పుకున్నారు. ఇంటికెళ్లి ఈ విషయాన్ని తన భార్య సావిత్రమ్మకు చెప్పారు ఘంటసాల. ‘లతాజీ స్వయంగా పాడమని అడిగినప్పుడు... పాడొచ్చు కదా..’ అని అమె అంటే.. ‘‘రఫీగారు ఓ వైపు ఆ పాట పాడుతున్నప్పుడు.. నేనెళ్లి అదే పాటను లతాజీతో పాడటం రఫీగారిని అవమానించడమే అవుతుంది. అది సంస్కారం కాదు’’ అన్నారట ఘంటసాల. సరిగ్గా ఇది జరిగిన 11ఏళ్ల తర్వాత ఘంటసాల, రఫీల మధ్య మరో సంఘటన చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ ‘భలేతమ్ముడు’ సినిమాలోని పాటలను కొన్ని కారణాలవల్ల ఘంటసాలతో గాక, మహమ్మద్ఫ్రీతో పాడించాలని నిర్ణయించుకున్నారు ఆ చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య. ‘భలేతమ్ముడు’ పాటల పనిమీద మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రఫీ.. సరాసరి ఘంటసాల ఇంటికే వెళ్లారు. ‘మీరుండగా తెలుగు సినిమాకు నేను పాడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది’ అని రఫీ వాపోయారు. ‘మీ గొంతునుంచి జాలువారే తెలుగు పాట వినాలన్న ఆకాంక్ష.. మా శ్రోతలతో పాటు, నాకూ ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా పాడండి’ అని నచ్చజెప్పి రఫీని రికార్డింగ్ థియేటర్‌కి పంపారట ఘంటసాల. రఫీ పాటకు ఘంటసాల ఎలాగైతే అభిమానో... ఘంటసాల పాటకు రఫీ కూడా అంతే అభిమాని. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని మహమ్మద్ రఫీ వ్యక్తం చేశారు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఘంటసాల పాట ఉంటుంది. తెలుగు శ్రోతల హృదయాల్లో ఘంటసాల ఎప్పటికీ చిరంజీవే.
Advertisement
Advertisement