చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది: అరవింద్
సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెం.150 తొలిరోజు కలెక్షన్లు చూశాక.. ఇంత పెద్ద హిట్ సినిమా తర్వాత 151వ సినిమా చేయాలంటే తనకు భయమేస్తోందని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చెప్పారు. తొలిరోజు ఖైదీ నెం. 150 సినిమాకు 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 కోట్లు వచ్చిందని, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయని అన్నారు.
రెండో రోజు కూడా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదని, అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సాధారణంగా వారాంతంలో అయితే సినిమాలు బాగా ఆడతాయని, కానీ వారం మధ్యలో వచ్చినా సినిమాకు ఇంత బంపర్ కలెక్షన్లు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన స్పందనను బట్టి వారం మధ్యలో అయినా రిలీజ్ చేయొచ్చన్న నమ్మకం తమకు కుదిరిందన్నారు. ఇక్కడ బుకింగ్స్ ప్రారంభం కాకముందే ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు తెలుస్తాయి కాబట్టి.. అవి చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. అసలు ఎందుకంత ఆదరణ వచ్చిందో అర్థం కాలేదన్నారు.
దర్శకుడు వినాయక్ తనను క్షమించాలంటూ.. ఇందులో కథ, ఇతర విషయాల కంటే చిరంజీవిని చూడటానికే అంతమంది జనం వచ్చారని ఆయన అన్నారు. మస్కట్ లాంటి దేశాల్లో తెలుగువాళ్లు ఎక్కువగా పనిచేసే ఫ్యాక్టరీలకు సినిమా కోసం సెలవు కూడా ఇచ్చేశారని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవితో తదుపరి సినిమా చేసే అవకాశం తమకే ఉందని, దానికి బోయపాటి శ్రీనివాస్‌ను దర్శకుడిగా ఇప్పటికే అనుకున్నామని ఆయన వివరించారు. చిరంజీవి స్టామినా ఎంత ఉంటే అన్నాళ్ల పాటు సినిమా నడుస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.