ఈ వయసులో కొత్త ఉత్సాహం | In this age of new excitement | Sakshi
Sakshi News home page

ఈ వయసులో కొత్త ఉత్సాహం

Published Wed, Apr 16 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

ఈ వయసులో కొత్త ఉత్సాహం

ఈ వయసులో కొత్త ఉత్సాహం

ఈ అవార్డు  - సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్

 ‘‘ఎనభయ్యేళ్ళ వయసులో నాకు మళ్ళీ నూతనోత్సాహాన్నిచ్చిన అవార్డు ఇది’’ అని సీనియర్ సినీ జర్నలిస్టు నాదెళ్ళ నందగోపాల్ వ్యాఖ్యానించారు. అయిదేళ్లు శ్రమించి, ‘సినిమాగా సినిమా’ అంటూ ఆయన చేసిన రచన ‘ఉత్తమ సినీ గ్రంథం’గా జాతీయ అవార్డుకు ఎంపికైంది. బుధవారం సాయంత్రం ఈ అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే కలసిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఆయన తన స్పందనను తెలిపారు. మరో 2 తెలుగు సినీ గ్రంథాలతో సహా, దేశం నలుమూలల నుంచి వచ్చిన 43 ప్రముఖుల రచనల మధ్య పోటీలో నందగోపాల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ‘‘ఇంత పోటీలో, ఇందరు హేమాహేమీల మధ్య నాకు అవార్డు రాదేమో అని అనుకున్నా.
 
 కానీ, న్యాయం జరిగింది. నిష్పక్షపాతంగా అవార్డు ఎంపిక చేశారు’’ అని నందగోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నుంచి మన తెలుగు దాకా సినీ పరిశ్రమలోని వివిధ సాంకేతిక విభాగాల పరిణామాన్నీ, ప్రస్థానాన్నీ ఈ 424 పేజీల గ్రంథంలో స్థ్థూలంగా వివరించారాయన. ‘‘పుణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన ‘ఫిల్మ్ ఎప్రీసియేషన్’ కోర్సు, ఇరవయ్యేళ్ళ పైగా వివిధ జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు హాజరైన అనుభవం, తొమ్మిదిన్నరేళ్ళ సెన్సార్ బోర్డు సభ్యత్వం - ఇవన్నీ ఈ రచనకు నాకు పునాదులు’’ అన్నారాయన. రేపల్లెలో పుట్టి, మద్రాసులో డిగ్రీ చేసి, 1952లో దర్శకుడు కె. ప్రత్యగాత్మ సహాయకుడిగా ‘జ్వాల’ పత్రికతో జర్నలిస్టయ్యారు నందగోపాల్.
 
  ‘తెలుగుతెర’, ‘కినిమా’ లాంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన ఈ కురువృద్ధుడు 1995లో ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు అందు కున్నారు. ‘‘ఇప్పుడీ గ్రంథానికి అవార్డు వచ్చిందంటే నా రచనతో పాటు, దాన్ని ఎంతో అందంగా ముద్రించిన ‘ప్రగతి’ ప్రింటర్స్ హనుమంతరావు పాత్రను మర్చిపోలేను’’ అని నందగోపాల్ అన్నారు. ఈ అవార్డుతో ఉత్తమ సినీ గ్రంథ రచయితగా జాతీయ అవార్డునందుకున్న మూడో తెలుగు సినీ జర్నలిస్ట్ అయ్యారాయన. - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement