భళారా... భల్లాలదేవా! | Interview With Rana Daggubati | Sakshi
Sakshi News home page

భళారా... భల్లాలదేవా!

Published Sun, Jul 5 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

భళారా... భల్లాలదేవా!

భళారా... భల్లాలదేవా!

 ఈ చిత్రకథ చెప్పే ముందు రాజమౌళి నాకో మ్యాప్ ఇచ్చారు. ‘‘మహిష్మతి అనే రాజ్యం ఉంది. అందులో ఇవన్నీ జరుగుతాయి’’ అని పేపర్ వర్క్‌తో చూపించారు. ‘‘ఇందులో విలన్ పాత్ర ఉంది. ఆ పాత్రను ఓ హీరోనే చేయాలి’’ అని భల్లాలదేవా పాత్ర గురించి చెప్పారు. భల్లాలదేవ చిన్నతనం, పెద్దయిన తర్వాత ఎలా ఉంటాడు? రాజ్యాధికారం విలువ అర్థమైన తర్వాత ఎలా మారాడు?... అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి ఓ 25 పేజీలు రాసిచ్చారు.

బైబిల్ అంత క్లియర్‌గా ఉంది అది. ఆ 25 పేజీలు చదివితే ఎవరైనా ఈ పాత్ర చేయొచ్చు. కథ వినగానే, ఎగ్జయిట్‌మెంట్‌లో ఓకే చెప్పేస్తానని భయం వేసింది. అందుకే, ‘ఆలోచించి చెబుతా’ అన్నాను. ఎందుకంటే, నా కెరీర్ మొదలై ఐదేళ్లయ్యింది. ఈ సినిమా ఒప్పుకుంటే మూడేళ్లు పడుతుంది. కానీ, నాకేమో దుర్యోధనుడు, రావణాసురుడివంటి పాత్రలు చాలా ఇష్టం. భల్లాలదేవ ఆ పాత్రల స్థాయిలో ఉంటుంది. అందుకని చేద్దామా? వద్దా? అని ఆలోచించి, వదులుకుంటే, లైఫ్ టైమ్‌లో రాదేమో.. రెండు, మూడేళ్లేగా చేసేద్దాం అనుకుని ఒప్పుకున్నా.
 
 చిన్నప్పటి కల నెరివేరిందనిపిస్తోంది
 చిన్నప్పుడు నేను ‘అమర్ చిత్రకథలు’ బాగా చదివేవాణ్ణి. ఎన్టీ రామారావుగారు చేసిన పౌరాణిక చిత్రాలను ఇష్టపడి చూసేవాణ్ణి. ఓ 20, 30 ఏళ్లుగా ఆ తరహా చిత్రాలు రాలేదు. అలాగే, హాలీవుడ్ చిత్రాలు ‘ట్రాయ్’, ‘300’లాంటివి ఇష్టం. వాటిలోని పాత్రలు నన్ను ఉద్వేగానికి గురి చేసేవి. ఒక అద్భుతమైన తెలుగు సినిమా వచ్చినా, హాలీవుడ్‌లో ఓ గొప్ప పీరియాడికల్ మూవీ వచ్చిందంటే నేను దాన్నే చూస్తాను. మనకిలాంటి చిత్రాలు ఎందుకు రావు? అనుకునేవాణ్ణి. నా చిన్నప్పుడైనా, ఇప్పుడైనా నాకిష్టమైన చిత్రాలు పౌరాణికాలే.  సో.. ఈ సినిమా చేయడం ద్వారా నా చిన్నప్పటి కల, ఇప్పటి కల నెరవేరినట్లుగా భావిస్తున్నా.
 
 40 కిలోలు పెరిగా
  ఈ సినిమాకి ముందు నేను 86 కిలోలు ఉండేవాణ్ణి. ఈ పాత్ర కోసం దాదాపు 40 కిలోలు పెరిగా. దినేష్ అనే బాడీ బిల్డర్ మాకు ఆరు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చాడు. షూటింగ్ చేసే సమయానికి నా బరువు 122 కిలోలు. ఉదయం నిద్రలేవగానే కార్డియో ఎక్సర్‌సైజ్ చేసేవాణ్ణి, ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేవాణ్ణి. అప్పట్నుంచీ మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఏదో ఒక ప్రొటీన్ ఫుడ్ తినేవాణ్ణి. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్.. ఇదే నా డైట్.
 
 సైగలు తప్ప మాటలు ఉండేవి కావు!
 ఈ సినిమా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వియత్నాం నుంచి తన్, సన్, లక్ అని ముగ్గురు ట్రైనర్స్‌ని తీసుకొచ్చారు. వాళ్లకి మన భాష తెలియదు. మాకు వాళ్ల భాష తెలియదు. రోజుకి ఐదారు రోజులు జరిగిన ట్రైనింగ్‌లో మా మధ్య సైగలు తప్ప మాటలుండేవి కావు. ఒకవేళ మేమేమైనా తప్పు చేస్తే ‘నో.. ఎగైన్’ అనేవాళ్లు. లాంగ్వేజ్‌తో కాకుండా కేవలం బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడినప్పటికీ, నాకూ, ప్రభాస్‌కీ వాళ్లు మంచి స్నేహితులైపోయారు. ఇది పక్కా ఇండియన్ వార్ ఫిలింలా ఉండాలని ముందే అనుకున్నాం. మేం చేసే యాక్షన్ చైనీస్ మూవీస్‌లో ఉండే మార్షల్ ఆర్ట్స్‌ని తలపించకూడదు. అందుకే, యాక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రంలో నేను వాడటానికి మొత్తం ఆరు గదలు తయారు చేయించారు. సీన్‌కి తగ్గట్టుగా ఒక్కో గదను వాడేవాణ్ణి.  
 
 నా విగ్రహం చూసి షాకయ్యా!
 ఈ చిత్రం కోసం 130 అడుగుల భల్లాలదేవ విగ్రహం తయారు చేయించారు. ఎనిమిదివేల కేజీల బరువున్న విగ్రహం అది. దానికోసం నా కొలతలన్నీ తీసుకున్నారు. అంత పెద్ద విగ్రహం చూసి, షాకయ్యా. మామూలుగా ఏదైనా ఆబ్జెక్ట్ ఎత్తాలంటే ఒక్క ‘ఇండస్ట్రియల్ క్రేన్’ సరిపోతుంది. కానీ, దీనికి మాత్రం నాలుగు ఇండస్ట్రియల్ క్రేన్స్ కావాల్సి వచ్చింది. ఆ విగ్రహం రైజ్ అయ్యే సీన్ తీయడానికి 12 రోజులు పట్టింది.
 
 తెలుగులో ఒకే టేక్.. తమిళ్‌కి చాలా టేక్స్
 డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నేను ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో పౌరాణిక డైలాగులు మాట్లాడాను. అందుకని, ఈ సినిమా కోసం సునాయాసంగా మాట్లాడేశాను. కానీ, తమిళ వెర్షన్ డైలాగ్స్ చాలా ఇబ్బందిపెట్టాయి. చిన్నప్పుడు మద్రాసులో పెరిగినా, స్వచ్ఛమైన తమిళ భాష తెలియదు. పైగా, రాసిందేమో ప్రముఖ రచయిత వైరముత్తుగారి కొడుకు మదన్ కార్కీ. తమిళ డైలాగ్స్‌ను ఇంగ్లిష్‌లో రాసి పంపించారు. కానీ, వాటిని ఎలా ఉచ్ఛరించాలో కార్కీని అడిగి తెలుసుకున్నా. తెలుగు డైలాగ్స్‌కి ఒకే టేక్ సరిపోయేది. కానీ, తమిళ్‌కి మాత్రం నాలుగైదు టేక్స్ తీసుకున్నా.
 
 రోజూ ఆంబులెన్స్ సౌండ్ వినిపించేది!
 రోజూ ఫ్రేమ్‌లో రెండు, మూడువేల మంది ఉండేవాళ్లు. అందర్నీ ఓ వరస క్రమంలో నిలబెట్టడానికి ఒక ఆర్మీ చీఫ్‌ని కూడా పిలిపించారు. వార్ మూవీ కాబట్టి, రిస్క్ ఎక్కువ. అందుకే, షూటింగ్ లొకేషన్లో ఆంబులెన్స్‌లు ఉండేవి. రోజూ ఎవర్నో ఒకర్ని తీసుకెళుతూ, ఆంబులెన్స్ సౌండ్ వినిపించేది. ‘హమ్మయ్య.. ఈరోజు మనం కాదు’ అనుకునేవాణ్ణి. ఒకరోజు నేనూ ఆంబులెన్స్‌లో వెళ్లాల్సి వచ్చింది.
 
 ఏనుగులు, గుర్రాలు మొరాయించేవి
 చలికాలంలోనే ఈ చిత్రం తీద్దామనుకున్నాం. కానీ, కరెక్ట్‌గా నా కాలు విరిగింది. అలా నెల రోజులు బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రభాస్ భుజానికి ఆపరేషన్. ఓ రెండు నెలలు బ్రేక్. ఈలోపు వింటర్ పోయింది. మంచి ఎండల్లో షూటింగ్ చేశాం. ఇక మాతో పాటు లొకేషన్లో బోల్డన్ని గుర్రాలు, ఏనుగులు. అవి ఒక్కోసారి మొరాయించేవి. ఇందులో నేను రథం వాడాను. దానికోసం రెండు గుర్రాలు తెప్పించారు. ముందు తెప్పించిన గుర్రాలనూ, నన్నూ చూసి ‘నువ్వేమో ఇంత భారీగా ఉన్నావ్. ఇవి చాలవు’ అని రాజస్థాన్ నుంచి రెండు గుర్రాలు తెప్పించారు. అవి చారియట్ హార్సెస్ కావు. రేసు గుర్రాలు. దాంతో వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. వాటిని చూడగానే గుండె జారినంత పనైంది. నేను రథం మీద కొంత దూరం వెళ్లే షాట్‌ని ఉదయం పదకొండు గంటలకు మొదలుపెడితే సాయంత్రం ఆరు గంటలైంది.  ఆ షాట్‌ని మానిటర్‌లో చూసినప్పుడు ‘బెన్‌హర్’ మూవీ చూసినట్లనిపించింది.
 
 నెలరోజుల పాటు వీల్‌చైర్‌లో ఉండాల్సి వచ్చింది!
 నేను, ఆరుగురు ఫైటర్స్ పాల్గొనగా ఓ ఫైట్ రిహార్సల్స్ చేసినప్పుడు నా మోకాలికి దెబ్బతగలింది. సేఫ్టీ కోసం ‘నీ గార్డ్’ పెట్టుకున్నప్పటికీ, ఉపయోగం లేకుండా పోయింది. ఆరుగురు ఫైటర్స్‌లో ఎవరి చేతిలో ఉన్న ఆయుధం తగిలిందో ఇప్పటికీ మాకు తెలియదు కానీ, ‘నీ గార్డ్’ పక్కన తగిలింది. దానివల్ల నెలరోజులు వీల్ చైర్‌కి పరిమితం కావాల్సి వచ్చింది. యాక్చువల్‌గా నేనే సినిమా చేసినా, గాయం ఖాయం. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చేస్తున్నప్పుడు చేతికి గాయం అయ్యింది. ఇదిగో ఈ సినిమాకి మోకాలికి, చేతికి.. ఇలా తీపి గుర్తులున్నాయి. విచిత్రం ఏంటంటే.. సేఫ్టీ లేకుండా తగిలితే ఫర్వాలేదు కానీ, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా దెబ్బ తగిలింది. ‘బావా.. నిన్ను దరిద్రం చేజ్ చేసుకుంటూ వస్తోంది. నువ్వేమీ చేయలేవ్’ అని ప్రభాస్ నవ్వాడు కూడా.
 
 ‘కెన్ యు హియర్ మీ’ అనడిగారు!
 ఈ సినిమాకి ముందు నేను గుర్రాలెక్కింది లేదు. నాకోసం తెప్పించిన గుర్రాలు ట్రైనర్ మాటే వినడంలేదు. ఇక, నా మాట వింటాయా? నేనో గుర్రం మీద, నా వెనకాల ప్రభాస్ మరో గుర్రం మీద వచ్చే సీన్ తీస్తున్న రోజు నేను ఘోరంగా పడ్డాను. వెనక నుంచి ‘రేయ్.. తంతోంది రా.. చూసుకోరా’ అని అరుస్తుంటే, నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక ఏదో చేశాను. అది సడన్ బ్రేక్ వేసినట్లుగా ఒక్కసారిగా ఆగిపోయింది. నేను ఎగిరి అంత దూరం పడ్డాను. హెడ్ మీద ల్యాండ్ అయ్యాను. గుర్రం తొక్కేస్తుందనుకున్నా కానీ, అది ఎటో వెళ్లిపోయింది. ‘ఆస్పత్రికి వెళదాం’ అని, హార్స్ ట్రైనర్ అంటే, ‘ఏం దెబ్బలు తగ్గల్లేదు’ అన్నాను. కానీ, హెడ్ మీద ల్యాండింగ్ అయ్యారంటూ, తీసుకెళ్లారు. నేను పడినప్పుడు తీసిన వీడియోను డాక్టర్‌కి చూపించారు. ఆయన ‘చెవులు దగ్గర చిటికేసి, కెన్ యు హియర్, కాన్ యు సీ’ అనడిగారు. ‘ఓరి నాయనో’ అనిపించింది. స్కానింగ్ తీశారు. ఏమీ జరగలేదు. ‘ఇలా పడితే మినిమమ్ నాలుగు ఫ్రాక్చర్లు అవుతాయ్’ అని డాక్టర్ అన్నారు. కానీ, నేను చేసిన బాడీ బిల్డింగ్, తీసుకున్న డైట్ నాకేం కాకుండా చేశాయి. ఏదో ధైర్యంతో ఈ సినిమా చేసేశాం. ఇప్పుడు తల్చుకుంటే భయం వేస్తోంది.
 
 ఆయన కటౌట్ చూసి, ఇన్‌స్పయిర్ అయ్యా!
 మద్రాసులో ఐదో తరగతి చదువుతున్నప్పుడు కమల్‌హాసన్‌గారి ‘నాయకుడు’ కటౌట్ చూసి, ఇన్‌స్పయిర్ అయ్యాను. అందులో ఆయన తన వయసుకి మించిన వయసు పాత్ర చేశారు. చేస్తే ఇలాంటి పాత్రలు చేయాలనుకున్నాను. ఇప్పుడీ సినిమాలో నా వయసుకి మించిన పాత్ర చేయడం ఓ నటుడిగా నాకు చాలా ఆనందం అనిపించింది. రాజమౌళి రాసిన, నేను చూసిన విలన్స్‌లో భల్లాలదేవానే పవర్‌ఫుల్. ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది. ఎవరూ చేయనిది మనం చేశామన్న ఆనందం కలిగింది. ఈ సినిమాలో నేను చేసిన ప్రతి సన్నివేశం భారతీయ సినిమాలో ఏ నటుడూ చేయలేదు.
 
 ఈ సినిమా తీయడానికి ఎంతో గట్స్ కావాలన్నారు
 ‘ఇది వరల్డ్ క్లాస్ మూవీ.. హిందీకి తీసుకెళితే బాగుంటుంది’ అనుకున్నప్పుడు నాన్నగారు (డి. సురేశ్‌బాబు) బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌తో మాట్లాడమన్నారు. అప్పటికి ఆయన రూపొందించిన ‘ఏ జవానీ హై దివానీ’లో అతిథి పాత్ర చేశా. ఆ పరిచయంతో ఫోన్ చేసి, ఈ చిత్రం గురించి చెబితే, ముంబయ్ వచ్చి కలవమన్నారు. బడ్జెట్, కథ విని ‘ఎంత గట్స్.. నిజంగానే తీస్తున్నారా’ అన్నారు. రెండు, మూడు ఫొటోలు చూశాక ‘అవతార్’లా ఉందన్నారు. ‘ఇండియాస్ బిగ్గస్ట్ మూవీ’ అనే మాట ముందు వచ్చింది ఆయన నోటి నుంచే. అమితాబ్ బచ్చన్‌గారైతే ట్రైలర్ చూసి, ‘ఎక్కడ తీశారు?’ అంటూ ఆశ్చర్యపోయారు. ముందు నాలుగు మాటలే మాట్లాడతానన్న ఆయన ఆ తర్వాత సుదీర్ఘంగా ఈ సినిమా గురించి మాట్లాడారు. దీని ముందు నేను చిన్నగా అనిపిస్తున్నా అని ఆయన అనడం మర్చిపోలేని విషయం. తెలుగులో తీసిన ఇంటర్నేషల్ మూవీ ఇది. మనకు గొప్ప దర్శకులు ఉన్నారు. గొప్ప గొప్ప సినిమాలు తీశారు. కానీ, నాకు తెలిసి, ఇలాంటి సినిమా తీసేంత ప్యాషన్ ఒక్క రాజమౌళికే ఉంది. ‘బాహుబలి’ని ఇండియన్ అవతార్ అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. ఈ చిత్రం చేసిన ఈ మూడేళ్లల్లో యూనిట్ అంతా ఓ ఫ్యామిలీలా అయిపోయాం. చెప్పినదానికన్నా బడ్జెట్ మూడింతలైనా నిర్మాతలు కంగారు పడలేదు. మనం చేస్తున్నది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనే నమ్మకంతో చేశారు.
 
 ‘బాహుబలి’ తర్వాతే వేరే సినిమా!
 ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రభాస్ భుజానికి గాయం అయిన కారణంగా వచ్చిన రెండు నెలల గ్యాప్‌లో నేను హిందీ ‘బేబి’ చేశాను.  ‘బాహుబలి’ పూర్తయ్యాక బరువు తగ్గించేశాను. ఆ తర్వాత ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో నటించాను. ఇప్పుడు ‘బాహుబలి 2’ కోసం మళ్లీ బరువు పెరగాలి. ఇప్పటికి 40, 50 శాతం పూర్తయ్యింది. మిగతాది పూర్తయ్యాకే వేరే సినిమా చేస్తాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement