ఎన్నికల సినిమా నేడే!
దాదాపు వారం రోజులుగా రకరకాల వివాదాలు, వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో సినీ పరిశ్రమతో పాటు, సామాన్యుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో ఆదివారం నాడు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే పోలింగ్‌లో 702 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆపు చేయాలంటూ నటుడు ఒ. కల్యాణ్ వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఎన్నికలను ఆపకుండా నిర్వహించ వచ్చనీ, అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కౌంటింగ్ జరపడం కానీ, ఫలితాలు ప్రకటించడం కానీ చేయవద్దనీ శుక్రవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఎన్నికల అధికారి - ‘మా’కు న్యాయ సలహాదారైన వి. కృష్ణమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకే అంతా జరపడానికి ఏర్పాట్లు చేశాం. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు - ఇలా మొత్తం 6 విభాగాల్లో పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగా 6 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇ.వి.ఎంల)ను వినియోగిస్తున్నారు. ‘‘సాంకేతిక ఇబ్బందులెదురైతే ప్రత్యామ్నాయంగా మరొక యంత్రాన్ని అదనంగా అట్టిపెడుతున్నాం’’ అని ఆయన వివరించారు. గతంలోని అనేక ఎన్నికల లాగానే ఈసారీ సీనియర్ నటుడు జి. నారాయణరావు సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి, 1993లో ఏర్పాటైన ‘మా’కు తొలి అయిదు కార్యవర్గాలూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 2000లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. కాగా, 2002 అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవికి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు పోటీపడ్డారు.
అప్పట్లో 8 ఓట్ల తేడాతో రాజేంద్రప్రసాద్ ఓడిపోయారు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ బరిలోకి దిగారు. ఈ సారి కూడా ఆయనకూ, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడైన మురళీ మోహన్ ఆశీస్సులున్న జయసుధకూ మధ్య అధ్యక్ష పదవికి పోటీ జరగడం విశేషం. ‘‘ఈ మధ్య ఇంత భీకరమైన ‘మా’ ఎన్నికల పోరు జరగలేదు’’ అని పలువురు సీనియర్లు పేర్కొన్నారు. ఇప్పటి దాకా ఏ ఎన్నికల్లోనూ 50 శాతం మించి పోలింగ్ జరగని ‘మా’లో ఆదివారం పోలింగ్ ముగిసినప్పటికీ, 31వ తేదీ మంగళవారం కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఫలితాల ఉత్కంఠ కొనసాగనుంది. ఆ తరువాత కూడా కోర్టు వాయిదాలు, తుది తీర్పుకు మరికొంత ఆలస్యమయ్యే సూచనలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మా కథ : రెంటాల
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంగా 1950ల నాటికే మద్రాసులో ‘నడిగర సంగం’ మొదలైంది. ఏ భాషా సినీపరిశ్రమ ఆ భాషా ప్రాంతానికి తరలివెళ్ళడంతో, ఎక్కడికక్కడ కొత్తగా ప్రాంతీయ భాషా నటీనటుల సంఘాలు వచ్చాయి. అలా తెలుగు నటులకు ‘మా’ ఏర్పాటైంది. కళాకారులకు ‘అమ్మ’ లాంటిదనే ఉద్దేశంతో, అమ్మ ఒడిని లోగోగా పెట్టుకున్న ఈ సంఘాన్ని 21 ఏళ్ళ క్రితం 1993 అక్టోబర్ 4న స్థాపించారు.
చిరంజీవి సంస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సంస్థ కార్యవర్గ కాలపరిమితి రెండేళ్ళు. ప్రతి రెండేళ్ళకూ ఎన్నికలు జరగాలి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు తదితరులు ‘మా’ అధ్యక్షులుగా పనిచేశారు. మురళీమోహన్ అత్యధికంగా 6 సార్లు (12 ఏళ్లు) అధ్యక్షపదవి నిర్వహించారు.
తెలుగు సినిమాల్లో నటించే తారలంతా ‘మా’లో కానీ, దీని గుర్తింపున్న ఇతర ఆర్టిస్టు సంఘాల్లో కానీ తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. సభ్యుల సంక్షేమం, పారితోషిక సమస్యల పరిష్కారం ‘మా’ చూస్తుంది. కనీసం 8 చిత్రాల్లో నటిస్తే కానీ, ‘మా’లో సభ్యత్వమివ్వరు. జీవిత కాల సభ్యులు (709), గౌరవ సభ్యులు (2), సీనియర్ సిటిజన్లు (28) కలిపి ‘మా’లో సభ్యుల సంఖ్య 739. వీరిలో ఓటు హక్కున్నది 702 మందికే.
‘మా’లో సభ్యత్వానికి రుసుము ఒకప్పుడు స్వల్పమే కాగా, ఇప్పుడది అక్షరాలా లక్ష రూపాయలు. ఇంత భారీ రుసుముతో పేద కళాకారులకు దూరమై, పెద్దవాళ్ళకు గొడుగుగా ‘మా’ మారిందనేది ఒక విమర్శ. కళాకారుల సంక్షేమానికీ, ప్రకృతి వైపరీత్యాల బాధితుల సహాయానికీ పలు కార్యక్రమాలు చేసిన నిధులు సేకరించిన ఘన చరిత్ర ‘మా’ది. ప్రస్తుతం 3 కోట్ల 22 లక్షల దాకా నిధీ ఉంది.
అయితే, నిరుపేదలూ, వృద్ధులూ అయిన అర్హులైన అనేకమంది కళాకారులకూ ఆర్థిక సహాయం, మెడీక్లెయిమ్ లాంటి వసతులు ఇవాళ్టికీ మృగ్యమే. ‘మా’కు ఇప్పటికీ సొంత భవనం లేదు. కొనుగోలు చేసిన ఒక అంతస్తు వేరే చోట ఉన్నా, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో చిన్న కార్యాలయంలోనే నడుస్తోంది.
నోరు నొక్కేశారు!
ఇది ఇలా ఉండగా, తాజా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న ఒ. కల్యాణ్ ‘మా’లోని అవకతవకలపై శనివారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్‌తో పాటు జయసుధ, అలీ, నరేశ్, హేమ తదితరులపై ఆయన విమర్శనా స్త్రాలు సంధించారు. ‘మురళీమోహన్ బంధుప్రీతి వల్ల ‘మా’కు 50 లక్షల నష్టం వచ్చింది. ఇప్పటి దాకా అనేక లేఖలు రాసినా లాభం లేకపోయింది. ధైర్యం చేసి, పెదవి విప్పిన నా నోరు నొక్కేస్తున్నారు’ అని కల్యాణ్ ఆరోపించారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్‌కూ, తనకూ సంబం ధం లేదనీ, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాననీ ఆయన వివరించారు. ‘మా’లో అంతా మురళీమోహన్ చెప్పిందే వేదం, రాసిందే చట్టంలా నడుస్తోందని కల్యాణ్ ఆరోపించారు.