ఆ బాధ జీవితాంతం దహిస్తూనే ఉంటుంది : శ్వేతాబసు ప్రసాద్
వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై, కోర్టు ఆదేశాలపై ఇటీవలే ‘సంరక్షణాలయం’ నుంచి బయటకొచ్చిన సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తొలిసారిగా పెదవి విప్పారు. ముంబయ్‌లోని ఇంటికి చేరుకొన్న 23 ఏళ్ల ఈ యువ నటి ‘డి.ఎన్.ఎ’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అసలేం జరిగిందీ వివరించారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
ఇంటికి ఎప్పుడొచ్చారు?
శుక్రవారం ఇంటికి వచ్చా. జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి మీదా ఫిర్యాదులు లేవు. కాకపోతే, నేనేమీ మాట్లాడకుండానే ఆ సంక్షోభ సమయంలో ‘అన్ని దారులూ మూసుకుపోవడం వల్లే ఈ పనికి పాల్పడ్డా. డబ్బు సంపాదించడం కోసం వ్యభిచారంలోకి దిగాల్సిందిగా కొందరు నన్ను ప్రోత్సహించారు’ అంటూ నా పేరు మీద ఓ జర్నలిస్టు తప్పుడు ప్రకటన జారీ చేశారు. రెండు నెలలు పత్రికలు అందుబాటులో లేవు. దాని గురించి నాకు ఇప్పుడే తెలిసింది.
అంటే, ఆ ప్రకటన మీరు చేయలేదంటారు!
లేదు. కస్టడీలో అమ్మానాన్నలతో మాట్లాడడానికి కూడా నాకు అనుమతినివ్వనప్పుడు, మీడియాతో మాత్రం నేనెలా మాట్లాడగలను? నా పరువు ప్రతిష్ఠలను దెబ్బతీశారు. అసత్య ప్రకటనలు ఏ జర్నలిస్టు వద్ద నుంచి, ఏ పత్రిక ద్వారా పుట్టాయన్నది ఆరా తీస్తున్నా. చట్టపరంగా చర్యలు చేపడుతున్నా.
అనని మాటలు అన్నట్లు రాసేవారు ఏ రకం వారంటారు?
ఎవరైనా కష్టాల పాలై, ఇబ్బందులు పడుతుంటే అది చూసి ఆనందించడం మన జాతి లక్షణం. మనం శాడిస్టులం. నా పేరు మీద తప్పుడు ప్రకటన ప్రచారంలో పెట్టిన ఆ జర్నలిస్టును అడగదలుచుకున్నది ఒక్కటే - ‘మీకు నా గురించి, నా కుటుంబం గురించి ఏం తెలుసు? ఇది (ఈ అరెస్టు) జరిగినప్పుడు కూడా రకరకాల పాత్రల కోసం నేను ఆడిషన్లలో పాల్గొంటున్నాను. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంపై ఒక డాక్యుమెంటరీ రూపకల్పన కోసం మూడున్నరేళ్ళ జీవితాన్ని వినియోగించా. మళ్ళీ నటన మీద దృష్టిపెట్టాలనుకుంటున్నా.
ఎక్కువ భాగం మీడియా మీకండగా నిలిచిందే!
అవును. అందుకే, ఇంటికి తిరిగిరాగలిగా. జరిగిందేమిటన్న దానిపై లోతుల్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు. అది కోర్టులో ఉన్న విషయం.
దేనికైనా పశ్చాత్తాపపడుతున్నారా?
నేను తప్పు చేశానా, లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు వచ్చే ముందు.... మీడియా నేను బయటకు వచ్చేదాకా ఆగాల్సింది. నన్ను నేను రక్షించుకొనే హక్కు ఇవ్వాల్సింది. అక్కడ ఉండగా టీవీ చూడడానికీ, పేపర్లు చదవడానికీ నన్ను అనుమతించలేదు. తీరా ఇప్పుడు బయటకు వచ్చాక చూస్తే, జీవితం ఎంతటి మీడియా సర్కస్‌గా మారిందో తెలిసింది.
అసలు ఈ పరిస్థితుల్లోకి మీరెలా చిక్కుకున్నారు?
(ఒక్క క్షణం ఆగి..., నిట్టూరుస్తూ...) వ్యభిచారం కోసమంటూ నన్ను ఏ ఏజెంటూ హైదరాబాద్‌కు పిలవలేదు. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడానికి నేను అక్కడకు వెళ్ళాను. నా తలరాత అనండి, మరొకటి అనండి - వెనక్కి తిరిగి వచ్చే ఉదయం విమానం నేను మిస్సయ్యాను. ఆ అవార్డుల ఉత్సవం నిర్వాహకులే విమానం టికెట్, బస ఏర్పాట్లు చేశారు. ఆ టికెట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఏజెంట్ అరె స్టయ్యాడని నాకు చెప్పారు. ఈ కేసు ఇప్పుడు విచారణలో ఉంది. ఈ వ్యవహారంలో బలిపశువునయ్యా. ఆ సమయంలో పోలీసు దాడి జరిగింది.... ఆ సంఘటనను తోసిపుచ్చడం లేదు. కానీ, బయటకు వారు చెప్పినవన్నీ నిజాలు కావు.
మిమ్మల్ని పోలీసులు కఠినంగా ప్రశ్నించారా?
లేదు. అయితే, విచారణ నిమిత్తం నన్ను నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు పోలీసులు (వ్యభిచార రాకెట్లలో ప్రమేయమున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న) తెలుగు సినీ తారల పేర్లడిగారు. చాలామంది పేర్లయినా నాకు తెలియవు. అయినా, ఇతర తారలపై నేనెందుకు వ్యాఖ్యానించాలి?
అరెస్ట్ తర్వాత...
రెస్క్యూ హోమ్‌లో ఉన్నాను. మనుషుల అక్రమ రవాణా, వగైరా వ్యవహారాల్లో బాధితులైన పిల్లలకు సంబంధించిన హాస్టల్ అది. అక్కడ నేను స్వచ్ఛందంగా టీచర్‌గా పనిచేశా. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్పించా. నేనేమీ మానసికంగా కుంగిపోలేదు. అలా ఎందుకు కుంగిపోవాలి? నిజానిజాలు నాకు తెలుసు. నా జీవితాన్ని సినిమాకూ, నటనకూ అంకితం చేశా. ఏదో ఒక సంఘటనతో నా జీవితాన్ని నాశనం కానివ్వను.
మీ అమ్మానాన్న ఏమనుకున్నారు?
నేను రెస్క్యూ హోమ్‌లో ఉండగా మా తాతగారు చనిపో యారు. ఆ బాధ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. ఆయన అంత్యక్రియలకైనా హాజరు కాలేకపోయా. జీవితాంతం ఆ బాధ నన్ను దహిస్తూనే ఉంటుంది. మీడియాలో వార్తల పుణ్యమా అని ఆ ప్రకటనలన్నీ నేనే చేశాననుకొంటూనే మా తాత గారు కన్నుమూశారు.
దర్శకుడు హన్సల్ మీతో పనిచేస్తానంటున్నారు.
ఆయన నుంచి నాకు ఇంకా ఫోన్ రాలేదు. హన్సల్ మెహతా చిత్రానికి ఆడిషన్‌లో పాల్గొని, ఆ పాత్రకు నేను సరిపోతేనే చేద్దామనుకుంటున్నాను. అంతేతప్ప, ఏదో సానుభూతి చూపుతూ ఇచ్చే పాత్ర వద్దు. వివాదాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ముచేసుకుంటున్నానని జనం అనుకోవడం నాకిష్టం లేదు.
పదేళ్ళకే జాతీయ అవార్డొచ్చిన మీ ప్రతిభపై అనుమానాల్లేవు..
కానీ, జనం అవన్నీ సులభంగా మర్చిపోతారు. నన్నడిగితే, కష్టకాలంలోనే అసలైన స్నేహితులెవరన్నది తెలుస్తుంది. తెలిసినవాళ్ళు ముఖం చాటేశారు. స్నేహితులైతే, మా అమ్మ ఫోన్ చేస్తే ఎత్తేవాళ్ళు కాదు. మా అమ్మానాన్నకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే, దానికి బాధ్యులెవరు? ఈ సమయంలో మాకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు. ఇక, మాకు అండగా నిలబడనివాళ్ళ గురించి కూడా ఏమీ అనను. జీవితమంటే ఇంతే! ఇలాగే ఉంటుంది!