నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య దూరం ఒక్క ఫోన్‌కాలే! | Pawan kalyanku distance between the phone call! | Sakshi
Sakshi News home page

నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య దూరం ఒక్క ఫోన్‌కాలే!

Published Fri, Jun 19 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య దూరం ఒక్క ఫోన్‌కాలే!

నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య దూరం ఒక్క ఫోన్‌కాలే!

సంపత్ నంది... హన్మకొండ కుర్రాడు. బీఫార్మసీ టాపర్. ఎంఫార్మసీ డిగ్రీ హోల్డర్. డిగ్రీలు చదవడమే కాదు... పుస్తకాలూ అమితంగా చదివే సృజనశీలి. సినిమా మీద ప్రేమతో పోసాని దగ్గర రచయితగా మొదలై దర్శకుడయ్యారు. రెండు పెద్ద హిట్స్... సెట్స్‌పై ఇప్పుడు రవితేజతో ‘బెంగాల్ టైగర్’. ఇవాళ బర్‌‌తడే చేసుకొంటున్న ఈ మీడియా షై మ్యాన్‌తో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ...
 
 ***  మీ తాజా ‘బెంగాల్ టైగర్’ ఎందాకా వచ్చింది?
 60 శాతమైంది. ఆపకుండా షూటింగ్ చేస్తున్నాం.
 
 ***  హీరో రవితేజతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
 అన్నం అందరూ పెడతారు. కానీ, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం గొప్ప. ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్ట్ ఆగి, నేను డౌన్‌లో ఉన్నప్పుడు చాన్సిచ్చిన రవితేజకు ఋణపడ్డా. రవితేజ బంగారు కొండ.
 
 ***  సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు?
 అవును. రెండూ సమాన ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రలే. ఒకటి తమన్నా, రెండోది రాశీ ఖన్నా చేస్తున్నారు. తమన్నా ఎంత కో-ఆపరేటివో, అంతకు మించి ప్రొఫెషనల్. రేపటి సీన్ డైలాగుల్ని ఇవాళే నా మాడ్యులేషన్‌లో రికార్డు చేయించుకొనెళ్ళి, పొద్దుట కల్లా ప్రిపేరై వస్తుంది.
 
 ***  రిలీజ్ డేటూ ముందే చెప్పేశారే!
 అదృష్టమో, దురదృష్టమో నేను చేయాల్సిన ‘గబ్బర్‌సింగ్-2’ ఆగిపోవడంతో గ్యాపొచ్చింది. దాంతో కథ, లొకేషన్లు, బడ్జెట్‌తో సహా అన్నీ ఈ స్క్రిప్టుకు ముందే సిద్ధమయ్యాయి. అందుకే, రిలీజ్ డేట్ (సెప్టెంబర్ 18)తో సహా ప్లాన్ చేసి చెప్పేశా. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరుగుతోంది.
 
 ***  బొమన్ ఇరానీని ఎలా ఒప్పించారు?
 ‘అత్తారింటికి దారేది’ తర్వాత ఆయన ఎవరికీ ఓ.కె చెప్పలేదు. కానీ, ‘బెంగాల్ టైగర్’ కథ విని, విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు నటనంటే పిచ్చి ప్రేమ. రాసుకొనే ప్రతి స్క్రిప్ట్‌లో ఆయనకు వేషం ఇవ్వాలనిపించేంతగా సెట్స్‌లో ఫ్రెండైపోయారు.
 
 ***  ‘గబ్బర్‌సింగ్2’ ఆగడం డిస్ట్రబ్ చేసిందా?
 ఈ విషయంపై మీడియాలో ఏవేవో వార్తలొచ్చాయి. కానీ, అవేవీ నిజం కాదు. ‘గబ్బర్‌సింగ్2’కు వర్క్ చేయడం తీపి జ్ఞాపకం. ఎంతో నేర్చుకున్నా. నాలో క్రమశిక్షణ పెరిగింది. పుస్తకపఠనం రెట్టింపైంది.  
 
 ***  ఇంతకీ, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది?
 (గంభీరంగా...) కొన్నిటికి వ్యక్తులు కాదు, పరిస్థితులే కారణం. మా ప్రాజెక్ట్ ఆగడానికీ అంతే!
 
 ***  పవన్‌కల్యాణ్‌తో మీకిప్పటికీ సత్సంబంధాలున్నాయా?
 (నవ్వేస్తూ...) మా మధ్య ఎంతో స్నేహానుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య దూరమల్లా - ఒక్క ఫోన్ కాలే! త్వరలోనే తప్పకుండా ఆయనతో ఒక సినిమా చేస్తా. అందుకు ఆయన కూడా సిద్ధమే. ఆ మాటకొస్తే, ‘ఏ మైంది ఈ వేళ’ (2010) అనే చిన్న సినిమా తీసిన నాకు రామ్‌చరణ్ ‘రచ్చ’ అవకాశమిచ్చిన చిరంజీవి గారినీ, ‘మెగా’ ఫ్యామిలీనీ ఎప్పుడూ మర్చిపోను. ‘మెగా’ ఫ్యాన్‌గా చిరు సినిమాను డెరైక్ట్ చేయడం నా డ్రీమ్.
 
 ***  ‘గబ్బర్ సింగ్2’కి చేసుకున్న స్క్రిప్టే ‘బెంగాల్ టైగ’రా?
 దానికీ, దీనికీ సంబంధమే లేదు. ఒక్క రెండు ఫైట్ సీక్వెన్స్ మాత్రం వాడుతున్నా. ఈ స్క్రిప్ట్ పూర్తిగా రవితేజకు అతికినట్లు సరిపోయేలా అల్లుకున్నదే.
 
 ***  పవన్‌కల్యాణ్ ‘ఖుషి’ డైలాగుల ఇన్‌స్పిరేషన్ ఉందా?
 (నవ్వేస్తూ..) ‘టైగర్... బెంగాల్ టైగర్!’ అనే ‘ఖుషి’ డైలాగ్, ఆ సీన్, ఆయన మాట్లాడే విధానం స్ఫూర్తి ఉంది. ఆ ప్రేరణతో ఈ లైన్, టైటిల్ పుట్టాయి. కానీ, చాలామంది అనుకుంటున్నట్లు ఇది పోలీసు కథా కాదు, కలకత్తా నేపథ్యంలో నడిచే కథ అంతకన్నా కాదు. హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్‌ప్లే బేస్డ్ మాస్ ఎంటర్‌టైనర్.
 
 ***  రవితేజ ఈ సినిమా కోసం బాగా సన్నబడ్డారేంటి?
 ఈ సినిమా కొద్దిగా స్టైలిష్డ్‌గా, మోడరన్ టచ్‌తో వెళుతుంది. ఆ మేరకు రవితేజను కొత్తగా చూపేందుకు ప్రయత్నించా. పైగా, ఏణ్ణర్ధంగా రవితేజలో ఫిట్‌నెస్ స్పృహ పెరిగింది. అందుకే, స్లిమ్‌గా కనిపిస్తున్నారు.
 
 ***  2010 మొదలైనా ఇది 3వ సినిమానే. ఇంత గ్యాపేం?
 ఇవాళ పెద్ద హీరోలతో సినిమా ఏడాది చిల్లర పడుతుందని అందరికీ తెలుసు. ఆ మధ్యలో ‘గాలిపటం’ అనే చిన్న సినిమా నిర్మించా. ఏమైనా, ఇకపైన దర్శకుడిగా ఎక్కువ గ్యాప్ రాకుండా సినిమాలు చేస్తా.
 
 ***  ఇంతకీ మీరెందుకు నిర్మాతగా మారారు?
 సహజీవనం లాంటి సమకాలీన అంశాలతో సినిమా తీయాలని నేను, నా మిత్రులు అనుకొని ‘గాలిపటం’ తీశాం. మా ఫ్రెండ్ నవీన్ దర్శకుడు. ఇకపైనా యువ దర్శకులతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తాం.
 
 ***  పోసాని దగ్గర శిక్షణ మీకు ఉపయోగపడిందా?
 పోసాని గారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేసిన మూడేళ్ళలో నేర్చుకున్నది ఎమోషనల్‌గా, స్క్రీన్‌ప్లే పరంగా సీన్లు రాయడంలో బాగా హెల్ప్ అయింది. ఇక, దర్శకుడిగా ప్రపంచ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నా.
 
 ***  రచన, దర్శకత్వాల్లో ఎక్కడ సంతృప్తిగా అనిపించింది?
 నిజం చెప్పాలంటే, నేనింకా అసంతృప్తిగానే ఉన్నా. దర్శక, రచయితగా నా సామర్థ్యం చూపే సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా. ఆ వివరాలన్నీ ఈ సినిమా తరువాతే! ఇప్పటికైతే, నా దృష్టి అంతా ఈ ‘బెంగాల్ టైగర్’ మీదే! ఇది నా కెరీర్‌లో హ్యాట్రిక్ హిట్ ఫిల్మ్ అవుతుంది.
 - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement