నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!! | posani krishna murali interview | Sakshi
Sakshi News home page

నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!!

Published Tue, Feb 24 2015 10:33 PM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

నాకు మిత్రులూ లేరు! శత్రువులూ  లేరు!! - Sakshi

నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!!

 ఒక విషయాన్ని నమ్మడం వేరు. నమ్మినదాన్నే ఆచరిస్తూ, ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం వేరు. మాటలో, మనిషిలో ముక్కుబద్దలయ్యేంత సూటిదనమున్న మనిషి అంటే... ఇవాళ తెర మీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. పేకాటకు బానిసై, కుటుంబాన్ని పోషించుకునేందుకు జేబులో 50 రూపాయలు లేక కన్నతండ్రి (పోసాని సుబ్బారావు) పురుగుల మందు తాగి చనిపోతే, బంధువుల నిరాదరణ మధ్య ధైర్యంగా ఒంటరి పోరాటం చేసిన కన్నతల్లి (శేషమ్మ) నుంచి నిజాయతీనీ, పోరాటతత్త్వాన్నీ పుణికిపుచ్చుకున్న పోసాని జీవితమే ఒక సినిమా.
 
 అష్టకష్టాలు పడి, పరుచూరి బ్రదర్స్ వద్ద సహాయకుడిగా మొదలై... కొద్దికాలంలోనే రచయితగా వంద సినిమాలు చేసి, దర్శకుడిగానూ హిట్లు తీసి, నటుడిగా ఇవాళ బిజీగా మారిన కథ - పోసానిది. ‘గోపాల గోపాల’లో కామెడీ విలన్ కావచ్చు, తాజా ‘టెంపర్’లో నిజాయతీపరుడైన పోలీసు కావచ్చు... ఏ పాత్రనైనా పండించడం ఆయన  ప్రత్యేకత. వరుసగా వచ్చిపడుతున్న అభినందనలు, వస్తున్న అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా... ఇవాళ్టికీ సాదాసీదా డ్యుయల్ సిమ్ బేసిక్ మోడల్ నోకియా ఫోన్‌లో సంభాషిస్తూ, విజయం తలకెక్కించుకోకుండా నేల మీద నడుస్తున్న పోసానితో జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలు...

 
 ‘టెంపర్’లో పోషించిన పోలీసు నారాయణమూర్తి పాత్రకు చాలా పేరొచ్చినట్లుంది!
 నిజమే. అది చాలా నిజాయతీపరుడైన పోలీసు పాత్ర. ఆ పాత్రను తీర్చిదిద్దిన రచయిత వక్కంతం వంశీకీ, తూటాల లాంటి మాటలు రాసిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌కూ, సపోర్ట్ చేసిన చిన్న ఎన్టీఆర్‌కూ నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ‘టెంపర్’లోని పోలీసు మూర్తి పాత్ర చూసి, అందులో నేను చెప్పే డైలాగులు, సెల్యూట్ కొట్టే సీన్ గురించి కొన్ని వందల ఫోన్లు వచ్చాయి. కొత్త ఉత్సాహం వచ్చింది.  
 
   పోలీసు పాత్రలు కెరీర్‌లో మీకు పేరు తెచ్చినట్లున్నాయి!
 పోలీసు పాత్రలు నాకు వ్యక్తిగతంగా పెద్దగా నచ్చవు. కానీ, రచయితగా శ్రీకారం చుట్టిన ‘పోలీస్ బ్రదర్స్’ నాటి నుంచి వెన్నంటి ఉన్నాయి. మొన్నటి ‘వేదం’ మీదుగా ఇవాళ్టి ‘టెంపర్’ వరకు నేను చేసిన పోలీసు పాత్రలన్నీ పేరు తెచ్చాయి. ఎన్ని పోలీసు పాత్రలొస్తున్నాయంటే, వాటి కోసం రెండు జతల పోలీసు డ్రెస్సులు, బూట్లు కొనుక్కుని, ఇంట్లో పెట్టుకున్నా
 
  ప్రస్తుతం ఫలానా తరహా పాత్ర పోషించాలని ఏమైనా...?
 చిన్నప్పటి నుంచి నాటకాల్లో నటిస్తూ వచ్చాను. నేను హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా చేయగలను. పరిశ్రమలో ఇంతమంది ఆర్టిస్టుల మధ్య నాకంటూ స్థానం దొరకడం అదృష్టం. నన్ను పిలిస్తే, ఎలాంటి పాత్రయినా చేస్తా. పూర్తి విషాదభరిత పాత్ర పోషించాలని ఉంది.
 
 రచయితగా, నటుడిగా, దర్శకుడిగా... మీ విజయరహస్యం?
 ఏమీ లేదు. ఇచ్చిన పని నిజాయతీగా చేయడం. నిక్కచ్చిగా నా దోవన నేను వెళ్ళడం! నేనెప్పుడూ ఫైల్ పుచ్చుకొని రైటర్‌గానో, స్క్రిప్టు పట్టుకొని దర్శకుడిగానో, పోర్ట్‌ఫోలియో పట్టుకొని నటుడిగానో అవకాశాల కోసం తిరగలేదు. అయినా సరే, పరిశ్రమ నాకు ఈ మూడు శాఖల్లో నన్ను ఆదరించింది, అభిమానించింది. ఆశీర్వదించింది. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. పరుచూరి బ్రదర్స్ దగ్గర 1500 రూపాయలకు అసిస్టెంట్‌గా పని చేసిన నేను ఇవాళ నా కుటుంబ అవసరాలకు మించి, సంపాదించా. రేపు నేనున్నా, లేకపోయినా నా భార్యాబిడ్డలకు నెలకు నిర్ణీత ఆదాయం ఉండేలా చూడాలని నా భావన.
 
 కానీ, మీరు డబ్బు దగ్గర స్ట్రిక్ట్ అనీ, మెంటల్ అనీ...?
 చూడండి. నిర్మాతకూ, నాకూ స్నేహాలు, బంధుత్వాలు ఏముంటాయి! నాతో పని ఉంటే, నా దగ్గరకొస్తారు. లేకపోతే రారు. మరి, నేను చేసిన నటనకూ, రాసిన స్క్రిప్టుకూ డబ్బులు అడగడం కూడా తప్పేనా? నన్ను అడిగిన పని సవ్యంగా పూర్తిచేసి ఇచ్చేశాక, ముందుగా ఒప్పందం చేసుకున్న డబ్బులు ఇవ్వాలి కదా! రాసినదానికీ, నటించిన దానికే కదా అడుగుతున్నాను. రాయాల్సిన దానికీ, చేయాల్సిన దానికి కాదు కదా! అలా అడిగితే తిక్క అనీ, మెంటల్ అనీ, వివాదాస్పదుడనీ అనుకొంటే, వాళ్ళ ఇష్టం. ఇన్నేళ్ళ చరిత్రలో రచయితగా నేను ఆలస్యం చేయలేదు. నటుడిగా షూటింగ్‌కు నిమిషమన్నా ఆలస్యంగా వెళ్ళలేదు. కావాలంటే, ఎవరినైనా అడగండి. టైమ్‌కు రాకపోతే ఆర్టిస్టును తప్పుపడతాం, మరి, టైమ్‌కు పారితోషికం ఇవ్వకపోతే నిర్మాతను తప్పుపట్టకూడదా? నేను సినీ రంగానికి వచ్చింది డబ్బు సంపాదించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికే! ఎవరినో ఉద్ధరించడానికి కాదు! అందుకే, నాకిక్కడ స్నేహితులెవరూ లేరు. ఉన్నదల్లా గౌరవార్హులు, పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులే!
 
  పరిశ్రమలో పెద్దలతో కూడా మీరు తగాదా పడ్డ సందర్భాలున్నాయిగా?
 (కాస్త స్వరం పెంచి...) అవును. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గౌరవం, మర్యాద ఉంటాయి. అందుకే, నా విషయంలో ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా, ప్రవర్తించినా తగాదా పడ్డా. పత్రికలు నా గురించి తప్పు వార్తలు రాస్తే, వాటినీ వదిలిపెట్టలేదు. నా వాదనలోని నిజం, నా మనస్తత్వం తెలుసు కాబట్టే, వాళ్ళెవరూ తప్పుగా అర్థం చేసుకోలేదు. ఇక్కడ నాకెవరూ శత్రువులు లేరు. నేనెవరికీ శత్రువునూ కాదు.
 
   స్నేహితులు, శత్రువుల మాటెలా ఉన్నా, మీ శిష్యులు చాలామంది దర్శక, రచయితలుగా ఉన్నట్లున్నారు?
 (నవ్వేస్తూ...) అవును. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ, నివాస్, సంపత్ నంది, ఆకుల శివ, బి.వి.ఎస్. రవి, కల్యాణకృష్ణ - ఇలా పాతిక మంది దాకా ఉన్నారు. అది నా అదృష్టం. అటు నా గురువులు పరుచూరి బ్రదర్స్ రాస్తున్న సినిమాలకూ, ఇటు నా శిష్యులు తీస్తున్న సినిమాలకూ కూడా పనిచేస్తున్నా.
 
   మీరెందుకు చాలా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉంటారు?
 చిన్నప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాణ్ణి. కానీ, జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు, తిండికీ - చదువుకూ పడిన నానా ఇబ్బందుల వల్ల క్రమంగా రెబల్‌గా మారా. బతకడం కోసం... టమోటాలు వేసే బుట్టలు కుట్టాను. గుంటూరు నాజ్ థియేటర్ టికెట్ కౌంటర్‌లో నేల టికెట్లు అమ్మా. చిట్‌ఫండ్ కంపెనీలో పని చేశా. ఎం.ఏ, ఎం.ఫిల్ చదివి, తెలుగులో పిహెచ్.డి. చేస్తూ, మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర శిష్యుడిగా చేరి, బాయ్‌లాగా అన్ని పనులూ చేశాను. గురువుల ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణతో ఇంతవాణ్ణి అయ్యా. నిజానికి, నేను స్వతహాగా భయస్థుణ్ణి. కానీ, నన్ను రెచ్చగొడితే ఆ భయం పోయి, తిరగబడతా!
 
  కఠినంగా కనిపిస్తారు కానీ, సున్నితమనస్కులని తెలిసినవాళ్ళ మాట!
 (గంభీరంగా మారి...) ఇవాళ్టికీ టీవీలో, సినిమాలో ఒక విషాద ఘట్టం వచ్చినా తట్టుకోలేను. మొన్న టీవీలో ‘శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’ సినిమా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నా.
 
   మీకు దేవుడి మీద నమ్మకం, భక్తి...
 (మధ్యలోనే అందుకుంటూ...) అపారమైన నమ్మకం, భక్తి. అయితే, మూఢనమ్మకాలు లేవు. ఫలానా రూమ్‌లో కూర్చొంటేనే రాయగలను లాంటివి లేవు. ఒక చాప, దిండు వేసి, ఈ గదిలో కూర్చొని, రాయమన్నా రాసేస్తా. ఈ ఇంట్లోనే ఉంటూ నేను హిట్లూ తీశా, ఫ్లాపులూ ఇచ్చా. కాబట్టి, మన బుర్రకు వాస్తు ఏమిటి? (నవ్వులు...) నేను నమ్మేదల్లా మంచి, చెడు - ఈ రెండిటినే!
 
 మళ్ళీ సినిమా రచన, దర్శకత్వం చేస్తారా?
 ఎందుకు చేయను! చేస్తా! దేవుడి దయ వల్ల ప్రస్తుతం నటనతో పూర్తిగా బిజీగా ఉన్నా. ఒకవేళ ఎప్పుడైనా కొద్దిగా గ్యాప్ వస్తే, అప్పుడు తప్పకుండా రచన, దర్శకత్వాలు చేస్తా. ప్రస్తుతానికి మత్తుమందిచ్చి, వాటిని నిద్రపుచ్చుతున్నా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిద్ర లేపుతా.
 
   మీ ‘ఐ లవ్ యు రాజా’ ఊతపదం ఇవాళ తెలుగు నాట అందరి నోటా వినిపిస్తున్నట్లుందే?
 (నవ్వేస్తూ...) ‘మా’ టి.విలో జరిగిన ఒక పిల్లల టాలెంట్ షోలో నేను ఒక జడ్జీని. అక్కడకు వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా, నొప్పించకుండా, ప్రోత్సహించేలా మాట్లాడడం కోసం, ‘వచ్చేసారి ఇంకా బాగా చెయ్యి నాన్నా’ అని చెబుతూ, ‘ఐ లవ్ యు రాజా’ అనేవాణ్ణి. అది బాగా పాపులర్ అయింది. దాంతో, పిల్లలు కూడా నన్ను ‘లవ్ యు రాజా’ అనసాగారు. అది అలా తెలుగు నాట అంతటా పాపులర్ అయింది. తరువాత సినిమాలో పెట్టా! అక్కడా బ్రహ్మాండంగా ఆ డైలాగ్ పేలింది. అప్పటి నుంచి దేశమంతటా ఈ ‘ఐ లవ్ యు రాజా’ మాట అందరూ వాడుతున్నారు. ఆ మధ్య ‘రేసుగుర్రం’ సినిమాలో హీరో అల్లు అర్జున్‌తో పాటు నేనూ అనే ‘దేవుడా’ అనే ఊతపదం, అలాగే ‘అత్తారిం టికి దారేది’లోని ‘ఏసునాథా’ అనే మాట - ఇవన్నీ బాగా పాపులరయ్యా యి. నటుడిగా మరింత మందికి దగ్గర చేశాయి.
 
 రాజకీయ పార్టీలు చాలా మారినట్లున్నారు?
 లేదు. నేను సభ్యత్వం తీసుకున్న ఒకే పార్టీ - అప్పట్లో చిరంజీవి గారి ‘ప్రజారాజ్యం పార్టీ’. ఆ పార్టీ తరఫున చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేశా. కులం కార్డు వాడకుండా, డబ్బు, మద్యం పంచకుండా ప్రచారం చేశా. ఎలా గెలుస్తాం చెప్పండి. రాజకీయాల్లో పనికిరానని వచ్చేశా. ఉన్నంతలో మంచివాళ్ళకు ఓటేయడం మినహా ఇప్పుడు ఏ పార్టీలో లేను.
 
  మీ ఇద్దరు పిల్లలేం చేస్తున్నారు?

 వాళ్ళకు సినిమాల్లోకి రావాలని కోరిక. నాకేమో ఇష్టం లేదు. అయినా, నా భావాలను వాళ్ళ మీద రుద్దలేదు. వాళ్ళకి
 ష్టమైన వైపే వెళ్ళమన్నా. కాకపోతే, ఏ పని చేసినా ప్రవర్తన బాగుండాలని చెబుతూ వచ్చా. మా పెద్దవాడు ఉజ్జ్వల్ డిగ్రీ ఫైనలియర్. వాడు నా కన్నా బాగా రాస్తాడు, రచయిత, దర్శకుడు కావాలని వాడి కోరిక. రెండోవాడు ప్రజ్వల్ ప్లస్ 2 పాసయ్యాడు. సినీ కోర్సు చేయడానికి అమెరికా వెళ్ళాడు. టెక్నిక్ చదువుకొని, అక్కడే స్థిరపడాలని వాడి ఆశ.
 
 రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement