హీరోయిన్‌గా చేయమనగానే...నాలో దిగులు మొదలైంది!
తెలుగు తెరపై ప్రస్తుతం ‘గ్లామరస్ మదర్’ అనగానే.. టకీమని ప్రగతి గుర్తొస్తారు. ఆమె అభినయంలో సహజత్వం ఉట్టిపడుతుంటుంది. ప్రతి సినిమాలోనూ ప్రగతి వాంటెడ్. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, సెలబ్రిటీ స్థాయికి చేరిన ప్రగతితో ‘సాక్షి’ సంభాషణ.
ఎలా ఉన్నారండీ?
దేవుని దయవల్ల బాగున్నానండీ.. చేతిలో అయిదు సినిమాలున్నాయి. అన్నింట్లోనూ తల్లిగానే చేస్తున్నా. ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంది.
ఏంటి ఆ అయిదు సినిమాలు?
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ప్రకాశ్‌రాజ్, జయసుధల కూతురి పాత్ర నాది. కాజల్ అగర్వాల్‌కి తల్లిని అన్నమాట. ప్రకాశ్‌రాజ్‌గారి పెయిర్‌గా చాలా సినిమాల్లో చేశాను. ఇప్పుడు కూతురిగా నటించడం కొత్త అనుభవం. గోపీచంద్ ‘లౌక్యం’లోనూ నాది తల్లి పాత్రే. అయితే... ఇది కామెడీ తల్లి పాత్ర. ఈ రెండింటికీ భిన్నమైన పాత్రను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో చేస్తున్నాను. వీటితో పాటు నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలో కూడా నాది తల్లి పాత్రే.
మీ కెరీర్ హీరోయిన్‌గా మొదలైంది కదా?
అవును. తమిళ్‌లో కె. భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘వీట్టులే విశేషం’ నా తొలి చిత్రం. ఇక్కడ ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’గా విడుదలైంది.
హీరోయిన్‌గా మొత్తం ఎన్ని సినిమాలు చేసుంటారు?
ఎనిమిది సినిమాలే. అందులో ఒకటి మలయాళం. మిగిలిన ఏడూ తమిళంలోనే చేశాను. హీరోయిన్‌గా నా కెరీర్ కేవలం రెండేళ్లు. వెంటనే పెళ్లి చేసేసుకున్నాను. 1995లో నటనకు దూరమయ్యాను. 96లో అబ్బాయి పుట్టాడు. మళ్లీ 98 నుంచి నటించడం మొదలుపెట్టాను.
హీరోయిన్‌గా చేసిన మీరు కేరక్టర్ నటిగా స్థిరపడ్డారు. ఈ మార్పు ఎలా ఉంది?
అసలు నాకు హీరోయిన్ అవ్వాలని లేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయిందంతే. హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, పెద్ద తేడాగా కూడా ఏమీ లేదు. మళ్లీ నటన మొదలుపెట్టగానే... ముందు టీవీ సీరియల్స్ చేశాను. అక్కాచెల్లెళ్లూ, అమ్మ సీరియల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘అక్కాచెల్లెళ్లు’ చూసే ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలో అమ్మ వేషానికి పిలిపించారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
మీ సినీ ప్రయాణం యాధృచ్ఛికంగా మొదలైందన్నారు కదా... ఆ వివరాలు?
మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ కష్టపడి చదివించింది. నేను యావరేజ్ స్టూడెంట్‌నే. అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే... టీవీల్లో వచ్చే కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పేదాన్ని. అలాగే మోడలింగ్ కూడా చేసేదాన్ని. చెన్నయ్‌లోని ‘మైసూర్ సిల్క్ ప్యాలస్’ షోరూమ్ కోసం మోడలింగ్ చేశాను. ఆ ఫొటోలు భాగ్యరాజాగారి వద్దకెళ్లాయి. ఆడిషన్స్‌కి వెళ్తే ఎంపిక చేశారు. చెల్లెలు పాత్రకేమో అనుకున్నాను. ఆ పాత్ర అయితే... పెద్దగా వర్కింగ్ డేస్ ఉండవు కాబట్టి, చేసేయొచ్చులే అనుకున్నా. కానీ... ‘ఓకే’ చేసింది హీరోయిన్‌కి. అది విని షాక్. నాలో దిగులు మొదలైంది. ‘షూటింగ్‌ల చుట్టూ తిరిగితే చదువు పాడవుతుందేమో’ అని అమ్మతో అన్నాను. అమ్మ ధైర్యం చెప్పడంతో అంగీకరించా. అదే ‘వీట్టులే విశేషం’.
తెలుగు చక్కగా మాట్లాడతారు. నేపథ్యం వింటే చెన్నయ్‌లా అనిపిస్తోంది. మీ స్వస్థలమెక్కడ?
నేను పక్కా తెలుగమ్మాయిని. మాది హైదరాబాద్. టెన్త్‌దాకా ఇక్కడే చదువుకున్నాను. తర్వాత చెన్నయ్ వెళ్లిపోయాం. అక్కడే నా కెరీర్ మొదలైంది. నేను చిన్నప్పుడే క్లాసికల్ నేర్చుకున్నాను. నటరాజ రామకృష్ణ మా గురువుగారు.
మీ పాత్ర పోషణలో సహజత్వం కనిపిస్తుంటుంది...
అమ్మ పాత్ర నటించకూడదు. ప్రవర్తించాలి. అమ్మ మనస్తత్వంలో మార్పు ఉండదు. జానర్లు మారే కొద్దీ బిహేవియర్, మాటతీరు మారుతుందంతే. దీన్ని బట్టి నడుచుకొని చేయాలి. అదే నా శైలి.
నటిగా మీ లక్ష్యం?
కేరక్టర్ యాక్ట్రెస్ అని కళ్లు మూసుకుంటే... కొందరు మనకు గుర్తొస్తారు. అలా భావి తరాలకు నేను గుర్తు రావాలి. రాబోయే తరంలో నా పాత్రలు ఎవరు చేసినా.. ‘ఈ పాత్ర ప్రగతి అయితే.. గొప్పగా చేసేది’ అని గుర్తు చేసుకొని మరీ మాట్లాడాలి. ఆ స్థాయికి రావాలనేది నా లక్ష్యం.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరిప్పుడు సెలబ్రిటీ అవడం మీకు ఏమనిపిస్తోంది?
ఇదంతా భగవదనుగ్రహం. జీవితంలో నిలబడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మావారు ఐటీ ఉద్యోగి. మాకు ఏ బాధలూ లేవు. అయితే బెంగల్లా ఒక్కటే. పాపులారిటీ, డబ్బు సంపాదించుకోగలిగాను కానీ, సంతృప్తి మాత్రం లేదు. నటిగా అనుకున్న స్థాయిలో నాకు ఇంకా గుర్తింపు రాలేదు. మన దర్శక, నిర్మాతలకు తల్లి పాత్ర అనగానే నేను గుర్తొస్తున్నాను. ఇది ఆనందించాల్సిన విషయమే కానీ, ఇంకా ఎన్నో వెరైటీ పాత్రలు చేయాలని ఉంది.