వీహెచ్ x వర్మ.. ఓ అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి పోస్టర్ చించేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు బట్టలను చించేయాలని హీరో విజయ్ దేవరకొండను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. వీహెచ్ మారుమూల పల్లెలో జన్మించి ఉంటారని, కనీసం పలకా బలపం కూడా పట్టి ఉండరని అందుకే అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్‌ను నడిరోడ్డులో చించేశారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కామెంట్ చేశారు.
ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పలు వివాదాస్పద పోస్టులు పెట్టారు. వీహెచ్ మైండ్ సెట్ పురాతన కాలంలో ఉండిపోయిందని అన్నారు. అదీ ఎంతలా అంటే మధ్యయుగ కాలంలోని మనుషుల్లా అని నొక్కి చెప్పారు. హనుమంతరావు అర్జున్ రెడ్డి పోస్టర్‌ను ఎందుకు చించేశారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. బహుశా.. అంత అందమైన అమ్మాయి.. విజయ్ దేవరకొండకు ముద్దివ్వడం ఆయనకు రుచించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీహెచ్‌కు అలాంటి అందమైన మహిళ ఎప్పుడూ ఇలా ముద్దు ఇవ్వాలేదా? అని ప్రశ్నించారు.
వీహెచ్.. అర్జున్ రెడ్డి పోస్టర్‌ను తన మనవళ్లు, మనవరాళ్లకు చూపించి అందులో ఏదైనా తప్పుందా? అని అడగాలని అన్నారు. తాను చేసిన పోస్టులు తాతయ్యకు అర్థం కాదేమోనని కామెంట్ చేశారు. 'తాతయ్యా..! అర్జున్ రెడ్డి సినిమా మీ తాతయ్యల కోసం కాదు. మీ మనవళ్లు మనవరాళ్ల కోసం అని అర్థం చేసుకోండి.' అని వర్మ పోస్టులో పేర్కొన్నారు. 'మీ పార్టీ ఎలానో తాతయ్య అయిపోయింది. మీ పిల్ల చేష్టల వల్ల భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి రాష్ట్రంలోని మీ మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ ఓటు వేయరని అన్నారు. అప్పుడు మీ వల్ల మీ కాంగ్రెస్ పార్టీ పే..ద్ద.. తాతయ్య అయిపోతుంది' అంటూ మరో కామెంట్ చేశారు.