దాదాపు తొమ్మిదిన్నరేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో మొదలైన వివాదాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పట్లో ముగించేలా లేడు. చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ.. 'రౌడీ నెం.150' అనే ఒక పోస్టర్‌ను తన ట్విట్టర్‌లో విడుదల చేశాడు. ఖైదీనంబర్ 150 పోస్టర్‌కు వర్మ ముఖాన్ని అతికించి.. మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను తయారుచేశారని చెప్పాడు. మరోటి అచ్చం ఖైదీ టైటిల్ లాగే ఉండేలా తయారుచేసి, చేతిలో కాఫీగ్లాసు పట్టుకుని దాన్ని ముఖానికి అడ్డుపెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫొటో పెట్టాడు. ఖైదీ నెం.150 వేడుక సమయంలో వేదికమీద నుంచి నాగేంద్రబాబు చేసిన ప్రసంగంలో రాంగోపాల్ వర్మను పేరు ప్రస్తావించకుండా చేసిన విమర్శలతో వర్మ తీవ్రంగా మండిపడ్డాడు. దేవుడు చిరంజీవి కుటుంబంలో పవన్, చరణ్, సాయిధరమ్, వరుణ్, బన్నీ.. వీళ్లందరికీ చాలా సానుకూల లక్షణాలు ఇచ్చాడు గానీ, నాగబాబుకు మాత్రం బ్యాలెన్స్ ఇవ్వలేదని అంతకుముందు మరో ట్వీట్‌లో వర్మ మండిపడ్డాడు.
ఆ తర్వాత.. వివిధ ప్రముఖులు ఈ అంశాలపై చెప్పిన కొటేషన్లను కూడా వర్మ ట్వీట్ చేశాడు. అందులో.. 'అద్దాల మేడల్లో ఉండేవాళ్లు ఎదుటి వారి మీద రాళ్లు వేయకూడదు' అని భగవద్గీత అన్నట్లు కూడా పేర్కొన్నాడు. అలాగే, 'తన కుటుంబంలోని పనికిమాలినవాళ్లను ప్రేమించడం వారినే విధ్వంసం చేస్తుంది' అని డామన్ వయాన్స్ అన్న మాటను, 'జీవితంలో పూర్తిగా ఓడిపోయి ఇతరులను విమర్శించడం అంటే, తుపానుకు ఎదురుగా నిలబడి నోటితో గాలి ఊదడం' అన్న ఫ్రాంక్లిన్ ఫోయర్ మాటలను కూడా ట్వీట్ చేశాడు. వీటన్నింటినీ కూడా నాగబాబును ఉద్దేశించే ఆయన పేరు ప్రస్తావించకుండా వర్మ చెప్పడం గమనార్హం.