చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆర్యవైశ్య వర్గాన్ని కించపరుస్తూ ఆకాశవాణి (ఆలిండియా రేడియో)లో ప్రసారమైన వ్యాఖ్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాలను ముట్టడిస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రామకృష్ణ తంగుటూరి హెచ్చరించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో ప్రచారం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఒక జాతీయ భాషలో వెలువడిన ప్రకటనను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు తెలుగు భాషలోకి తర్జుమా చేయడంలో ఆర్యవైశ్యులను అవమానపరిచారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగుడైన కుమారుడితో తండ్రి మాట్లాడే క్రమంలో ‘నా సంపాదనంతా ఆ కోమటోడికి వడ్డీ కట్టడానికే సరిపోయింది’..అంటూ వ్యాఖ్యానిస్తాడు.
వాట్సాప్ ద్వారా ఈ వ్యాఖ్యలు ప్రపంచం నలుమూలలా ఉన్న వైశ్యులకు చేరిపోయాయి. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు 26వ తేదీన ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ప్రచారాన్ని ఆకాశవాణి ఉపసంహరించుకుంది. ముంబయిలోని అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థకు సైతం నిలుపుదల ఆదేశాలను పంపారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని ఆలిండియా రేడియో డెప్యూటీ డెరైక్టర్ ఎం.కృష్ణకుమారి ఈనెల 28వ తేదీన విడుదల చేసిన ఒక లేఖ ద్వారా బీజేపీ విజయవాడ సిటీ అధ్యక్షులు ఉమామహేశ్వర రాజుకు క్షమాపణలు చెప్పారు.
అరెస్ట్ చేయకుంటే ఆకాశవాణి ముట్టడి
ఆర్యవైశ్య కులాన్ని దారుణంగా కించపరుస్తూ ఆకాశవాణిలో ప్రసారమైన వ్యాఖ్యలకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాలను ముట్టడిస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రామకృష్ణ తంగుటూరి చెన్నైలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆకాశవాణిపై ఆర్యవైశ్యుల ఆగ్రహం
Published Tue, Sep 29 2015 10:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM
Advertisement