విమానంలో కన్హయ్యపై దాడి!
ముంబై: విమానంలో తోటి ప్రయాణికుడు తన పీకనులిమి చంపబోయాడంటూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఆదివారం తెలిపారు. ‘ఈ సారి విమానంలో దాడి. ఒక వ్యక్తి నా పీకనులిమాడు. నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు’అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ముంబై నుంచి పుణెకు వెళ్లడానికి కన్హయ్య జెట్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతా కారణాల రీత్యా కన్హయ్యను విమానం నుంచి దింపి రోడ్డుమార్గంలో విమాన సిబ్బంది పుణెకు పంపారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగిందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఈ సంఘటనపై ఇరు పక్షాలు ఫిర్యాదు చేశాయన్నారు. పబ్లిసిటీ కోసం కన్హయ్య చేసిన చీప్ ట్రిక్ అని మనస్ ఆరోపించాడు. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుందన్నాడు. అసలు కన్హయ్య అనే అతను ఎవరో తనకు తెలియదన్నాడు. కాగా, కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సహచర విద్యార్థి తరఫున కన్హయ్య ప్రచారం చేయనున్నారు. మోదీ ప్రభుత్వం వెనుక ఆరెస్సెస్ దాగి ఉందని, వారి హయాంలో దేశం మతతత్వ, దళిత వ్యతిరేక ప్రయోగశాలగా మారిందని కన్హయ్య ఆరోపించారు.