
నోరు జారాడు.. పదవి పోయింది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్పై వేటుపడింది. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్ష పదవి నుంచి దయాశంకర్ను తొలగించారు. పార్టీ పదవులన్నింటి నుంచి దయాశంకర్ను తొలగిస్తున్నట్టు బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రకటించారు.
మాయావతిపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంకావని, వీటిని ఖండిస్తున్నామని మౌర్య చెప్పారు. బుధవారం ఉదయం దయాశంకర్.. మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, కొన్ని గంటల్లోనే బీజేపీ ఆయనపై చర్యలు తీసుకుంది. మాయావతిని వేశ్యతో పోలుస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. ప్రతిపక్ష పార్టీల నేతలందరూ మూకుమ్మడిగా అధికార బీజేపీని నిలదీశారు.