
ఢిల్లీలో దౌర్జన్యానికి దిగిన ఆఫ్రికన్లు!
క్యాబ్ డ్రైవర్‌పై అమానుషంగా దాడి!
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఆఫ్రికన్ దేశస్తులు దౌర్జన్యానికి దిగారు. కాంగోలిస్ టీచర్ హత్యోదంతంపై ఢిల్లీలో ఆందోళనలు జరుగుతుండటం, జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా ఆఫ్రికన్లు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
51 ఏళ్ల నురుద్దీన్ అనే క్యాబ్ డ్రైవర్‌పై ఆరుగురు ఆఫ్రికన్లు దాడికి తెగబడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని మెహ్రౌలిలో ఈ ఘటన జరిగింది. క్యాబ్‌లో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకోవడానికి క్యాబ్ డ్రైవర్ నిరాకరించడంతోనే వారు ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 'క్యాబ్‌లో నిబంధనల ప్రకారం నలుగురిని ఎక్కించుకోవాల్సి ఉండగా.. ఆరుగురం ప్రయాణిస్తామని ఆఫ్రికన్ దేశస్తులు క్యాబ్ డ్రైవర్‌పై ఒత్తిడి చేశారని, అందుకు ఒప్పుకోకపోవడంతో దాడికి దిగారని, డ్రైవర్ ఒంటిపై కత్తిగాట్లు, పిడిగుద్దుల వల్ల కమిలిన గాయాలు అయ్యాయని, డ్రైవర్‌ను ప్రస్తుతం ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు ర్వాండా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు పరారయ్యారు. ఈ దాడిపై కేసు నమోదు చేసి ర్వాండాను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.