గోరఖ్‌పూర్‌ ఘోరం ఎవరి నేరం? | Gorakhpur hospital tragedy: Who said what on the incident which claimed the lives of 70 children | Sakshi
Sakshi News home page

గోరఖ్‌పూర్‌ ఘోరం ఎవరి నేరం?

Published Mon, Aug 14 2017 2:24 PM | Last Updated on Tue, Sep 12 2017 12:04 AM

Gorakhpur hospital tragedy: Who said what on the incident which claimed the lives of 70 children



సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని బాబా రఘుదాస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా గత మూడు రోజుల్లో 70 మంది పిల్లలు అకాల మత్యువాత పడిన విషయం తెల్సిందే. ఆక్సిజన్‌ కొరత కారణంగా అంతమంది మరణించలేదని, వారిలో 30 మంది పిల్లలు మెదడు వాపు వ్యాధి కారణంగా మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్‌ యోగి సమర్థించుకున్నారు. మెదడు వాపు వ్యాధి వచ్చిన పిల్లలకు వారు కోలుకునే వరకు తప్పనిసరిగా ఆక్సిజన్‌ వాయువును నిరంతరం అందించాల్సిన అవసరం ఉందనేది, అదిలేకపోతే వారు వెంటనే మత్యువాత పడతారని ఏ డాక్టర్‌ను అడిగినా చెబుతారు. మెదడువాపైనా, మరో వ్యాధైనా గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో పిల్లలు మాత్రం ఆక్సిజన్‌ అందక మరణించారన్నది నిర్వివాదాంశం.

ఆస్పత్రికి అవసరమైన నిధులను విడుదల చేయకపోవడం వల్ల తాము ఆక్సిజన్‌ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నామని తెలియజేస్తూ రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వానికి మూడు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మీడియా సాక్షిగా తెలిపారు. ఒక్క గోరఖ్‌పూర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలోనే కాకుండా మీరట్, ఝాన్సీ, లక్నో ప్రభుత్వ కళాశాలల ఆస్పత్రుల్లో కూడా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది.

అయినప్పటికీ వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మెదడువాపు వ్యాధి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని 1970వ దశకం నుంచి పీడిస్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలోనే ఒక్క పడకకు సరాసరి 200 మంది పిల్లలు మరణించారని ‘బ్రూకింగ్స్‌ ఇండియా’ అంచనా వేసింది. ఈ ఆస్పత్రిలో 900 పడకలు ఉన్నాయి. వ్యాధి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అందించడంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొదటి నుంచి బాగా వెనకబడి ఉంది. ఆస్పత్రులకు నిధులను సక్రమంగా సకాలంలో విడుదల చేయరు. చేసినా సదరు ఆస్పత్రి అధికారులు వాటిని సక్రమంగా ఖర్చు చేయరు. సిబ్బంది, సాంకేతిక పరికరాల కొరత ఎప్పుడూ వేధిస్తూనే ఉంటోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 46 శాతం కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 54 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొరత ఉంది. ఒక్క గోరఖ్‌పూర్‌ జిల్లాలో 3,319 గ్రామాలు ఉండగా, వాటిలో 1,114 గ్రామాలకు మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో వీటి కొరత 26 శాతం ఉంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య వసతుల విషయంలో యూపీ కింది నుంచి మూడోస్థానంలో ఉంది.

యూపీలో ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 64 మంది శిశువులు మరణిస్తున్నారని, ఇక ఐదేళ్లలోపు పిల్లలు ప్రతి వెయ్యి మందిలో 78 మంది మరణిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇక ప్రసవం సందర్భంగా ప్రతి లక్ష మంది తల్లుల్లో 258 మంది తల్లులు మరణిస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది.

సాంకేతిక పరికరాల కొరత
కేంద్రంలోని వైద్య మండలి సూచించిన మార్గదర్శకాల ప్రకారం గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాస్పత్రిలో 27 శాతం సాంకేతిక పరికరాల కొరత ఉన్నది. గర్భస్థ పిండాలకు సంబంధించి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగించే ఎన్‌డీ–లేజర్, ఎన్‌ఎస్‌టీ మెషిన్లు, అల్ట్రాసౌండ్‌ మెషిన్లు గత ఐదు సంవత్సరాలుగా పనిచేయడం లేదు.

గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలోని 11 విభాగాల్లో ఏర్పాటు చేసిన 200లకుపైగా పరికరాలు ‘నిర్వహణ కాంట్రాక్ట్‌’ పరిధిలో లేవంటే ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు. ఎంఆర్‌ఐ, కోబాల్ట్‌–60 యూనిట్‌ టెండర్లలో భారీ అక్రమాలు జరిగినట్లు కాగ్‌ నివేదికే ఆరోపించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇటు ప్రభుత్వం, అటు ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం వెరసి పసిపిల్లల ప్రాణాలు లోకం చూడకుండానే గాల్లో కలసిపోతున్నాయి.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement