చెన్నై, సాక్షి ప్రతినిధి: పెద్దలు కుదిర్చిన వివాహాన్ని నిలిపివేసేందుకు ప్రియునితో పెళ్లికుమారుడినే హత్య చేసింది ఆ పెళ్లికూతురు. తలను, మొండాన్ని వేర్వేరు ముక్కలుగా చేసి పార్శిల్ చేసింది. పోలీసుల విచారణలో ఘాతుకం బయటపడటంతో ప్రియుడు సహా కటకటాలపాలైంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా చిత్తుకాడుకు చెందిన రాజా (34)కు చెన్నై పాడికి చెందిన సత్యకు ఆగష్టు 8వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఈనెల 15వ తేదీన పెళ్లికి నిశ్చయించారు. అయితే వివాహమై ఇద్దరు పిల్లలున్న సహాయం అనే వ్యక్తితో పదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్న సత్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తన అయిష్టాన్ని పెండ్లికుమారుడు రాజాకు తెలిపినా పట్టించుకోలేదు.
పెళ్లిని ఎలాగైనా నిలిపివేయాలని నిశ్చయించుకున్న సత్య పెండ్లికుమారుడు రాజాను ఈనెల 1వ తేదీ రాత్రి కొరటూరు రైల్వేస్టేషన్‌కు పిలిపించుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రియుడు సాయంతో కలిసి అతనితో ఘర్షణ పడింది. ఇద్దరూ కలిసి రాజాను చంపేశారు. తలను, మొండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక డబ్బాలో పార్శిల్‌చేసి చిత్తుకాడు రహదారిపై పడవేశారు. ఈనెల 4వ తేదీన పోలీసులకు రాజా శవం ఉన్న ఆ డబ్బాదొరికింది. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్య, సహాయంను నిందితులుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు.