పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!! | Indian soldiers disappear in Indo-Pak war | Sakshi
Sakshi News home page

పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!

Published Sun, May 21 2017 12:45 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!

పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!

నాలుగున్నర దశాబ్దాలుగా 54 మంది భారత సైనిక వీరులు
1971 భారత్‌ పాక్‌యుద్ధంలో భారత సైనికులు అదృశ్యం
చనిపోయారని ప్రకటించి సంతాపం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
వారు పాక్‌జైళ్లలో మగ్గుతున్నారంటూ ఎన్నో సాక్ష్యాధారాలు
⇒  టైమ్‌మేగజీన్‌సహా చాలా పత్రికల్లో తరచుగా కథనాలు
తమ కుటుంబాలకు సైతం లేఖలు రాసిన భారత ఖైదీలు
వారిని స్వయంగా చూసిన వారూ, కలిసిన వారూ ఉన్నారు
కొందరు భారత సైనికులు పాక్‌జైళ్లలోనే కన్నుమూసిన వైనం
అయినా వారి వివరాలు బయటపెట్టని పాక్‌దుర్మార్గ నైజం  
భారత యుద్ధ ఖైదీలు ఎవరూ లేరంటూ బుకాయింపులు
వారి విడుదలను సీరియస్‌గా పట్టించుకోని భారత ప్రభుత్వాలు
తమ వారి జాడ కోసం 46 ఏళ్లుగా వారి బంధువుల ఆక్రోశం
తాజాగా జాధవ్‌కేసులో ఐసీజే తీర్పుతో చిగురించిన ఆశలు
హవల్దార్‌కోసం ఐసీజేలో కేసు వేయాలన్న పంజాబ్‌హైకోర్టు
ఇప్పటికైనా భారత యుద్ధ ఖైదీలకు చెర వీడేనా?
 (సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

భారతీయుడు కుల్‌భూషణ్‌జాధవ్‌కు పాకిస్తాన్‌విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌సవాల్‌చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్‌ను భారత్‌నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్‌ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అంతర్జాతీయ వేదిక మీద భారత్‌కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్‌చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్‌ పాక్‌యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు. వారంతా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది.

కానీ వారందరూ లేదా వారిలో చాలా మంది పాక్‌జైళ్లలో ఖైదీలుగా మగ్గిపోతున్నారని.. ఆ జైళ్లలోనే కొందరు మరణించారని నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో సాక్ష్యాధారాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ 54 మంది సైనికుల కుటుంబాలు తమ వారి ఆచూకీ కోసం ఆక్రోశిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఫలితం లేదు. భారత సైనికులెవరూ తమ వద్ద లేరని పాక్‌ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉంది. మన ప్రభుత్వాలు ఆ బుకాయింపునే ఆ కుటుంబాల వారికి వల్లెవేస్తోంది. నైరాశ్యంలో మునిగిపోయిన ఆ కుటుంబాలకు జాధవ్‌కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతిరేఖగా కనిపిస్తోంది.

1971 యుద్ధంలో అదృశ్యమైన హవల్దార్‌ధరమ్‌పాల్‌సింగ్‌ను పాక్‌లో యుద్ధ ఖైదీగా జైలులో ఉన్నారని, ఆయనను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య తాజాగా పంజాబ్‌ హరియాణా కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. ధరమ్‌పాల్‌సింగ్‌విడుదల కోసం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలనీ నిర్దేశించింది. మరోవైపు.. పాక్‌జైళ్లలో మగ్గిపోతున్న భారత యుద్ధ ఖైదీలందరి విడుదల అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని, ఈ వ్యవహారం మొత్తాన్ని ఐసీజేకి నివేదించి న్యాయం కోరాలని అదృశ్యమైన సైనికుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ 54 మంది భారత వీరుల ‘అదృశ్యం’ పూర్వాపరాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్‌...

అది 1971 డిసెంబర్‌. పాకిస్తాన్‌ప్రభుత్వంపై తూర్పు పాకిస్తాన్‌తిరుగుబాటు చేసింది. స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న మారణకాండను నివారించడానికి భారత్‌రంగంలోకి దిగింది. భారత సైన్యం పాక్‌బలగాలపై పోరాడి మెడలు వంచింది. తూర్పు పాకిస్తాన్‌స్వాతంత్రం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆ యుద్ధంలో పాక్‌తో పోరాడిన భారత సైనిక వీరుల్లో 54 మంది ‘అదృశ్యమ’య్యారు. వారిలో చాలా మంది యుద్ధంలో వీరమరణం పొంది అమరులయ్యారని భారత ప్రభుత్వం భావించింది.

ఆ మేరకు సంతాపాలు ప్రకటించింది. కానీ.. ఆ 54 మందీ.. లేదా వారిలో చాలా మంది సజీవంగానే ఉన్నారని.. పాకిస్తాన్‌జైళ్లలో యుద్ధ ఖైదీలుగా మగ్గుతున్నారని.. అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. పాక్‌మాత్రం 1971 యుద్ధానికి సంబంధించి తమ వద్ద యుద్ధ ఖైదీలు ఎవరూ లేరనే బుకాయిస్తోంది. ‘అదృశ్యమైన 54 మంది’ జాబితాను 1979లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సమరేంద్ర కుందు లోక్‌సభలో వెల్లడించారు.

అదృశ్యమైన మేజర్‌అశోక్‌లేఖలు...
1971లో చాంబ్‌సెక్టార్‌లో డిసెంబర్‌5న పాక్‌బలగాలతో భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మేజర్‌అశోక్‌సూరి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మేజర్‌అశోక్‌సూరి చనిపోయారని సైన్యం ప్రకటించింది. బుల్లెట్‌రంధ్రం ఉన్న ఒక హెల్మెట్‌ను.. ఢిల్లీలో నివసిస్తున్న ఆయన తండ్రి డాక్టర్‌ఆర్‌.ఎస్‌.సూరికి పంపించింది. కానీ ఆ హెల్మెట్‌మీద ఉన్న పేరు వేరే ఎవరిదో! సరిగ్గా మూడేళ్ల తర్వాత 1974 డిసెంబర్‌లో ఆ మేజర్‌తండ్రికి ఒక చీటీ అందింది. అందులో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను’ అంటూ ఆయన కుమారుడు మేజర్‌అశోక్‌సూరి చేతిరాత ఉంది.

దానికి అనుసంధానించి ఉన్న లేఖలో ‘సాహెబ్, వాలేకుం సలామ్‌! నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేను. ఈ చీటీని మాత్రం తేగలిగాను. మీ కుమారుడు సజీవంగా పాకిస్తాన్‌లో ఉన్నారు. నేను పాక్‌కు తిరిగి వెళ్తున్నాను  ఇట్లు ఎం. అబ్దుల్‌హమీద్‌’ అనే సమాచారం ఉంది. మళ్లీ 1975 ఆగస్టులో ఆ తండ్రికి కరాచీ జైలు నుంచి మరో లేఖ అందింది. ‘ప్రియమైన నాన్నకు పాదాభివందనం. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మన గురించి భారత సైన్యం లేదా, ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నించు. మేం ఇక్కడ 20 మంది అధికారులం ఉన్నాం. ... మా విముక్తి కోసం పాక్‌ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం సంప్రదించగలదు’ అనే సందేశం వచ్చింది. ఆ చేతిరాత ‘యుద్ధంలో చనిపోయిన’ మేజర్‌అశోక్‌దే అని నాటి రక్షణశాఖ కార్యదర్శి నిర్ధారించుకున్నారు.

‘అదృశ్యుల’ బంధువుల విజ్ఞప్తులు...
అప్పటి నుంచీ మేజర్‌అశోక్‌తండ్రి మరణించేవరకూ ప్రతి వారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు వెళ్లి తన కుమారుడిని విడిపించాలని కోరుతుండేవారు. అదృశ్యమైన సైనికులు పాక్‌లో బందీలుగా ఉన్నదే నిజమైతే.. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని, అలా చేస్తే అక్కడ వారి ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని ఉన్నతాధికారులు ఆయనకు సూచించారు. దీంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పలేదు.

అయితే.. అదృశ్యమైన సైనికులకు సంబంధించిన కుటుంబాలు ‘అదృశ్యమైన సైనిక సిబ్బంది బంధువుల సంస్థ’గా ఏర్పడి తమ ప్రయత్నాలు కొనసాగించారు. మేజర్‌అశోక్‌సూరి తండ్రి తమ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని మిగతా సైనికుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు. ఆయన తరచుగా ప్రధానమంత్రికి లేఖలు రాశేవారు. ప్రధాని నుంచి ఆయనకు సమాధానాలు కూడా వచ్చేవి. అదృశ్యమైన భారత సైనికుల సిబ్బంది వ్యవహారాన్ని తేల్చాలని, మానవతా దృక్పథంతో ఉత్కంఠకు తెరదించాలని ప్రాధేయపడుతూ పాక్‌విదేశాంగ మంత్రికి కూడా వివిధ మార్గాల్లో వినతిపత్రాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు

ఈ 54 మంది ఏమయ్యారు?

1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement